Share News

Thane Engineer Espionage: పాక్‌కు గూఢచర్యం.. భారత యుద్ధ నౌకల వివరాలను చేరవేసిన ఇంజినీర్

ABN , Publish Date - May 31 , 2025 | 10:55 AM

భారత యుద్ధ నౌకల వివరాలను పాక్ ఏజెంట్లకు అందజేసిన మహారాష్ట్ర యువ ఇంజినీర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Thane Engineer Espionage: పాక్‌కు గూఢచర్యం.. భారత యుద్ధ నౌకల వివరాలను చేరవేసిన ఇంజినీర్
Thane engineer espionage

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థానీ నిఘా ఏజెంట్లకు భారత యుద్ధ నౌకల సమాచారం అందజేసిన మహారాష్ట్ర యువకుడు రవీంద్ర వర్మను (27) పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. థానేలో ఉంటున్న అతడు మెకానికల్ ఇంజినీర్ అని చెప్పారు. పాక్ ఏజెంట్ల ఉచ్చులో పడి అతడు యుద్ధ నౌకలు, జలాంతర్గాములకు సంబంధించిన గోప్యమైన సమాచారాన్ని చేరవేశాడని తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రవీంద్ర వర్మ ఓ ప్రైవేటు రక్షణ రంగ టెక్నాలజీ సంస్థలో పని చేసేవాడు. ఫేస్‌బుక్‌ ద్వారా పాకిస్థానీ ఏజెంట్‌లు అతడికి పరిచయమయ్యారు. సదరు పాక్ ఏజెంట్‌లు తమని తాము యువతులుగా పరిచయం చేసుకున్నారు. ఇక రక్షణ రంగ సంస్థ ఉద్యోగి అయిన వర్మకు యుద్ధనౌకలు, జలాంతర్గాముల్లోకి వెళ్లేందుకు అనుమతి ఉండేది. అతడు తన వెంట సెల్‌ఫోన్ కూడా తీసుకెళ్లేవాడు. తన విధులు పూర్తి చేశాక, నౌకలకు సంబంధించిన గోప్యమైన సమాచారాన్ని సేకరించి పాక్ ఏజెంట్‌లకు అందించేవాడు. బొమ్మలు, ఇతర డిజైన్లు వేసి సమాచారాన్ని ఇచ్చేవాడు. కొన్ని సార్లు ఆడియో రూపంలో కూడా సీక్రెట్ సమాచారాన్ని చేరవేసేవాడు. 2024లో పాయల్ శర్మ, ఇస్‌ప్రీత్ పేరిట ఉన్న ఫేస్‌బుక్‌ల నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు వచ్చాక అతడు పాక్ ఏజెంట్లతో టచ్‌లోకి వచ్చాడని పోలీసులు తెలిపారు.


పాక్ ఏజెంట్లు ఇద్దరూ తమని తాము భారతీయ పౌరులుగా పరిచయం చేసుకున్నారు. తాము పనిచేస్తున్న ప్రాజెక్టుకు కోసం భారత యుద్ధ నౌకలకు సంబంధించిన సమాచారం కావాలని కోరారు. వర్మ పంపించిన సమాచారానికి అతడికి భారత్‌లోని వివిధ బ్యాంక్ అకౌంట్‌ల నుంచి డబ్బులు బదిలీ అయ్యేవని కూడా పోలీసులు తెలిపారు. ‘‘అతడికి తాను ఏం చేస్తున్నదీ, గోప్యమైన సమాచారాన్ని ఎవరికి ఇస్తున్నదీ పూర్తిగా తెలుసు. ఈ సమాచారం ఇచ్చినందుకు అతడికి డబ్బు ముట్టేవి’’ అని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

పహల్గాం దాడి తరువాత భారత నిఘావర్గాలు హైఅలర్ట్‌లో ఉంటున్నాయి. పాక్ కోసం గూఢచర్యానికి పాల్పడుతున్న అనేక మందిని అదుపులోకి తీసుకున్నాయి. రాజస్థాన్, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్, పంజాబ్‌‌లకు చెందిన సుమారు 15 మంది పాక్ కోసం గూఢచర్యానికి పాల్పడుతూ పోలీసులకు చిక్కారు.


ఇవీ చదవండి:

వాస్తవాన్ని వివరించిన భారత్.. పాక్‌కు మద్దతు ఉపసంహరించిన కొలంబియా

భారత్-పాక్ ఉద్రిక్తతలు.. అణు యుద్ధ ముప్పును తప్పించానంటూ ట్రంప్ మరో ప్రకటన

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 31 , 2025 | 11:10 AM