Donald Trump: భారత్-పాక్ ఉద్రిక్తతలు.. అణు యుద్ధ ముప్పును తప్పించానంటూ ట్రంప్ మరో ప్రకటన
ABN , Publish Date - May 31 , 2025 | 08:48 AM
భారత్, పాక్‌ల మధ్య రాజీ కుదిర్చింది తానేనని ట్రంప్ మరోసారి చెప్పుకున్నారు. ఇరు దేశాల మధ్య అణు యుద్ధాన్ని నివారించినట్టు ప్రకటించారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్, పాక్ మధ్య తానే రాజీ కుదిర్చానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు ప్రకటించారు. అమెరికా ప్రభుత్వ సలహాదారు బాధ్యతల నుంచి తప్పుకున్న టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్‌తో కలిసి శుక్రవారం పత్రికా సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ కామెంట్స్ చేశారు. అమెరికా జోక్యంతో అణు యుద్ధ ప్రమాదం తప్పిందని అన్నారు.
భారత్, పాక్ యుద్ధానికి దిగకుండా తాము అడ్డుకున్నామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఈ యుద్ధం అణు విపత్తుగా మారి ఉండేదని చెప్పుకొచ్చారు. ఉద్రిక్తతలు సద్దుమణగడంలో చొరవ చూపినందుకు భారత్, పాక్ నేతలకు కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు. యుద్ధంలో కూరుకుపోయిన దేశాలతో ఎలా వాణిజ్యం నెరపగలమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఘర్షణలను చల్లార్చడంలో అమెరికా పాత్ర గురించి ప్రస్తావించారు. అమెరికా మిలిటరీ శక్తి, నాయకత్వ సామర్థ్యాలకు ఇది నిదర్శనమని అన్నారు.
అయితే, పాక్‌తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ద్వైపాక్షిక అంశమని భారత్ చెబుతున్న విషయం తెలిసిందే. ఈ వివాదంలో మూడో దేశం జోక్యం అవసరం లేదన్నది భారత విదేశాంగ విధానం. పాక్‌తో చర్చల్లో వాణిజ్య ప్రస్తావన కూడా లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం చారిత్రాత్మకమని అప్పట్లో ట్రంప్ పేర్కొన్న విషయం తెలిసిందే. తన మధ్యవర్తిత్వంతోనే ఈ ఒప్పందం కుదిరిందని చెప్పుకొచ్చారు. వాణిజ్యం అంశం ఆధారంగా ఇరు దేశాల మధ్య రాజీ కుదిర్చినట్టు చెప్పుకొచ్చారు. ఏదోక రోజు ఇరు దేశాల వారు కలిసి పార్టీలకు హాజరవ్వొచ్చని కూడా వ్యాఖ్యానించారు. వాణిజ్య దౌత్యంతో ఇరు దేశాల మధ్య రాజీ కుదిర్చినట్టు ట్రంప్ చెప్పుకొచ్చారు.
ఇవీ చదవండి:
ఆపరేషన్ సిందూర్‌పై కొలంబియా అభ్యంతరం.. స్పందించిన శశి థరూర్
ఆపరేషన్ సిందూర్‌తో దీటైన జవాబిచ్చాం.. సిక్కిం రాష్ట్ర అవతరణ వేడుకల్లో ప్రధాని మోదీ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి