Air India crash: ఆ విమాన నిర్వహణ మేం చేపట్టలేదు
ABN, Publish Date - Jun 16 , 2025 | 05:19 AM
అహ్మదాబాద్‌లో విమానం కూలిన ఘటన నేపథ్యంలో.. ఎయిరిండియా విమానాల నిర్వహణలో టర్కిష్ టెక్నిక్ పాత్రపై అనుమానాలు తెలెత్తిన సంగతి తెలిసిందే. డ్రీమ్‌లైనర్ కూలిపోవడంలో టర్కిష్ టెక్నిక్ ప్రమేయం ఉందన్న ఆరోపణలు వచ్చాయి.
స్పష్టం చేసిన తుర్కియే
న్యూఢిల్లీ, జూన్ 15: అహ్మదాబాద్‌లో విమానం కూలిన ఘటన నేపథ్యంలో.. ఎయిరిండియా విమానాల నిర్వహణలో టర్కిష్ టెక్నిక్ పాత్రపై అనుమానాలు తెలెత్తిన సంగతి తెలిసిందే. డ్రీమ్‌లైనర్ కూలిపోవడంలో టర్కిష్ టెక్నిక్ ప్రమేయం ఉందన్న ఆరోపణలు వచ్చాయి. ఇవన్నీ తప్పుడు ఆరోపణలని తుర్కియే స్పష్టం చేసింది. ‘ఎయిరిండియా ప్యాసింజర్ విమానం టేకాఫ్ సమయంలో కూలిపోయింది. అయితే టర్కిష్ టెక్నిక్ అనే సంస్థ ఈ విమాన నిర్వహణను నిర్వహించిందనేది వాస్తవం కాదు’ అని రిపబ్లిక్ ఆఫ్ తుర్కియే డైరెక్టరేట్ ఆఫ్ కమ్యూనికేషన్స్ సెంటర్ ఫర్ కౌంటర్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఎయిరిండియాకు చెందిన ఏ ఒక్క బోయింగ్ విమానానికి కూడా టర్కిష్ టెక్నిక్ సంస్థ నిర్వహణ పనులు చేపట్టలేదని ఆ ప్రకటనలో వివరణ ఇచ్చింది.
2024-2025లో ఎయిరిండియా, టర్కిష్ టెక్నిక్ మధ్య కుదిరిన నిర్వహణ ఒప్పందాలు బీ777 వైడ్-బాడీ విమానాలకు మాత్రమేనని తెలిపింది. భారత్-తుర్కియే మధ్య సంబంధాలపై ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆ దేశ అధికారులు పేర్కొన్నారు. కూలిపోయిన విమాన నిర్వహణను చేపట్టిన కంపెనీ గురించి తమకు తెలుసని, కానీ.. వివాదాల జోలికి వెళ్లకూడదనే ఉద్దేశంతో ఆ వివరాలు వెల్లడించడం లేదని చెప్పారు. తుర్కియేకు చెందిన ఒక ఏజెన్సీ ఎయిరిండియా విమాన నిర్వహణ బాధ్యతలు చేపట్టిందంటూ యోగా గురువు బాబా రామ్‌దేవ్ బహిరంగ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో తుర్కియే ఈ వివరణ ఇచ్చింది.
Updated Date - Jun 16 , 2025 | 05:19 AM