Thar Desert Greening: థార్ ఎడారిలో పచ్చదనం పరవళ్లు
ABN, Publish Date - Apr 19 , 2025 | 04:03 AM
థార్ ఎడారిలో పెరిగిన వర్షపాతం, భూగర్భ జలాల పెరుగుదల, వృక్ష సంపద వల్ల పచ్చదనం పెరిగింది. అయినప్పటికీ, వాతావరణ మార్పులు, నీటి వినియోగం విషయంలో సమతుల్యత అవసరం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: భూమిపై అత్యంత వేడి ప్రాంతాల్లో థార్ ఎడారి కూడా ఒకటి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎడారుల విస్తీర్ణం కూడా పెరుగుతూ ఉంది. కానీ.. భారత్-పాకిస్థాన్ సరిహద్దులో ఉన్న థార్ ఎడారి మాత్రం అందుకు భిన్నంగా పచ్చదనాన్ని పరుచుకుంటోంది. ఎటు చూసినా ఇసుక తప్ప మరేమీ కనిపించని ఈ ఎడారిలో గత రెండు దశాబ్దాలుగా వృక్ష సంపద ఆశ్చర్యకరంగా 38ు పెరిగింది. ఒకప్పుడు ఇసుక దిబ్బలతో నిండి ఉన్న ఈ నేల క్రమంగా ఆకుపచ్చగా మారుతోందని ఉపగ్రహ డేటా స్పష్టం చేస్తోంది. భారత్‌లోని అతిపెద్ద ఎడారిలో ఈ అనూహ్యమైన మార్పునకు కారణం ఏమిటి..? అంటే.. వాతావరణ మార్పులు, మారుతున్న వర్షపాత నమూనాలు, మానవ ప్రయత్నాలు.. వెరసి ఇక్కడ పచ్చదనాన్ని తీసుకొస్తున్నాయని.. ‘సెల్ రిపోర్ట్స్ సస్టెయినబిలిటీ’లో ప్రచురితమైన తాజా అధ్యయనం వెల్లడించింది.
వాయవ్య భారతం, ఆగ్నేయ పాకిస్థాన్‌లలో సుమారు 2లక్షల చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న థార్ ఎడారి ప్రాంతంలో సుమారు 1.6 కోట్ల మందికిపైగా నివసిస్తున్నారు. అధ్యయనంలో భాగంగా 2001 నుంచి 2023 వరకు ఉపగ్రహ చిత్రాలను పరిశోధకులు పరిశీలించారు. ఈ క్రమంలో థార్ ప్రాంతంలో రుతుపవనాల వర్షపాతం 64 శాతం పెరిగిందని వారు గుర్తించారు. కాలానుగుణ వర్షపాతంలో పెరుగుదల కారణంగా ఇక్కడ నేల తేమగా మారిందని, భూగర్భ జలాలు పెరగడంతో వృక్ష సంపద కూడా పెరిగిందని వారు తెలిపారు. పచ్చదనంతోపాటు మౌలిక సదుపాయాలు కూడా పెరిగి నివాసయోగ్యంగా మారడంతో వ్యవసాయం అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ఎడారి నేల పచ్చగా మారడం ఆనందించదగ్గ విషయమే అయినప్పటికీ.. సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భూగర్భజలాల మితిమీరిన వినియోగం దీర్ఘకాలిక క్షీణతకు దారితీస్తుందని, ఇప్పుడిప్పుడే సాధిస్తున్న పురోగతికి ఇది ముప్పు వాటిల్లేలా చేస్తుందని చెబుతున్నారు. అలాగే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కూడా ఈ ప్రాంత జనాభాపై ప్రభావం చూపిస్తాయని అన్నారు. కాబట్టి సుస్థిర అభివృద్ధి అన్నిటికంటే ముఖ్యమని చెప్పారు. పునరుద్పాదక శక్తి, స్మార్ట్ నీటి నిర్వహణ వ్యవస్థలపై దృష్టి పెట్టాలని వారు కోరుతున్నారు.
ఈ మార్పు మంచిదేనా..?
థార్ ఎడారిలో పచ్చదనం, నీటి వనరులు, వ్యవసాయం పెరగడం.. శుభపరిణామమే. అదే సమయంలో కొత్త ప్రమాదాలు కూడా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. వ్యవసాయం ఎక్కువగా చేస్తే ఆహార భద్రత ఉంటుంది. అయితే దీనికి వాతావరణం కూడా సహకరించాలి. భవిష్యత్తులో వాతావరణంలో విపరీతమైన మార్పులు వస్తాయని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. దీనివల్ల వరదలు ముంచెత్తితే మౌలిక సదుపాయాలు దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అలాగే పెరుగుతున్న వృక్షజాలం కారణంగా స్థానిక జీవవైవిధ్యానికి ముప్పు తప్పదని, ముఖ్యంగా ఎడారి వాతావరణానికి అలవాటు పడిన జీవుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని చెబుతున్నారు.
Updated Date - Apr 19 , 2025 | 04:03 AM