SY Quraishi: పందులతో కుస్తీపడితే మనం మురికి అవుతాం
ABN, Publish Date - Apr 22 , 2025 | 03:31 AM
బీజేపీ ఎంపీ దూబే వ్యాఖ్యలపై మాజీ ఎన్నికల కమిషనర్ ఖురేషీ పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘పందులతో కుస్తీ పట్టకూడదు’’ అంటూ బెర్నార్డ్ షా సూక్తిని ఉదహరించారు
బురద అంటించడం ఆ పందికెంతో ఇష్టం
దూబే వ్యాఖ్యలపై ఖురేషీ పరోక్ష విసుర్లు
విద్వేష రాజకీయాల కోసం మతపరమైన గుర్తింపును పావుగా వాడుతున్నారని ఫైర్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: సుప్రీంకోర్టు, చీఫ్ జస్టిస్‌పై బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే చేసిన తీవ్ర వ్యాఖ్యల దుమారం మరింత ముదురుతోంది. దూబే వ్యాఖ్యలను మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్‌వై ఖురేషీ తప్పుపట్టగా, ప్రతిగా ఖురేషీపై దూబే ‘ముస్లిం కమిషనర్’ అంటూ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. దీంతో దూబేపై ఖురేషీ పరోక్షంగా, ప్రత్యక్షంగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దూబే పేరును ప్రస్తావించకుండా.. ‘‘చాలా ఏళ్ల కింద నేను ఒకటి తెలుసుకున్నాను. పందులతో ఎప్పుడూ కుస్తీ పట్టకూడదు. అలా చేస్తే మనం మురికి అవుతాం. అంతేకాదు.. మనను ఇలా మురికి చేయడం ఆ పందికి ఇష్టం కూడా..’ అని జార్జ్ బెర్నార్డ్ షా చెప్పిన సూక్తి చాలా గొప్పది’’ అని సోమవారం ఉదయం ఎక్స్‌లో పోస్టు చేశారు.
తర్వాత మీడియాతో ఖురేషీ మాట్లాడారు. ‘‘కొందరు విద్వేష రాజకీయాలు చేసేందుకు మతపరమైన గుర్తింపును పావుగా వాడుకుంటున్నారు. కానీ భారత్ ఎప్పుడూ రాజ్యాంగ వ్యవస్థలు, సూత్రాల కోసం నిలబడుతుంది. పోరాడుతుంది. మన దేశంలో ఎవరైనా తమ వ్యక్తిగత సామర్థ్యం, చేసిన సేవలను బట్టి గుర్తింపు పొందుతారు. వారి మతపరమైన గుర్తింపును బట్టి కాదు..’’ అని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, న్యాయవ్యవస్థ, చీఫ్ జస్టి్‌సపై దూబే చేసిన వ్యాఖ్యలపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు చేపట్టాలని న్యాయవాది బ్రిజేశ్‌సింగ్, మరికొందరు సుప్రీంకోర్టును కోరారు. అయితే దీనిపై అటార్నీ జనరల్ దగ్గరికి వెళ్లి అనుమతి తీసుకోవాలని జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం సూచించింది. దీంతో బ్రిజేశ్ సింగ్ అటార్నీ జనరల్‌కు లేఖ రాశారు.
Updated Date - Apr 22 , 2025 | 03:31 AM