ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Supreme Court: ఢిల్లీ వీధుల్లో కుక్కలు కనిపించొద్దు

ABN, Publish Date - Aug 12 , 2025 | 03:57 AM

దేశ రాజధానిలో పెద్ద బెడదగా మారిన వీధికుక్కల సమస్యపై సుప్రీంకోర్టు సుమోటోగా స్పందించింది

  • అన్నింటినీ షెల్టర్లకు తరలించండి

  • స్టెరిలైజేషన్‌ తర్వాత కూడా వీధుల్లోకి వదలొద్దు

  • అడ్డుపడే సంస్థలపై కఠిన చర్యలు తప్పవు

  • దీనిపై జంతు ప్రేమికుల పిటిషన్లు పరిగణించం

  • నిబంధనల్ని పక్కనపెట్టి పనిలోకి దిగండి: సుప్రీం

న్యూఢిల్లీ, ఆగస్టు 11: దేశ రాజధానిలో పెద్ద బెడదగా మారిన వీధికుక్కల సమస్యపై సుప్రీంకోర్టు సుమోటోగా స్పందించింది. ఢిల్లీ- ఎన్‌సీఆర్‌ పరిధిలో ఒక్క కుక్క కూడా వీధుల్లో కనిపించడానికి వీల్లేదని, వాటన్నింటినీ తక్షణం షెల్టర్లకు తరలించాలని అధికారులను ఆదేశించింది. ఈ తరలింపు ప్రక్రియకు అడ్డుపడే సంస్థలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇందులో మినహాయింపులకు తావు లేదని తేల్చిచెప్పింది. కుక్క కాటు ఘటనలు, రేబిస్‌ కారణంగా మరణాల సంఖ్య బాగా పెరిగిపోయింది. దీనిపై పత్రికలు, మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా జస్టిస్‌ జేబీ పార్దివాలా, జస్టిస్‌ ఆర్‌ మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం విచారణను చేపడుతోంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం వాదనలను మాత్రమే తాము పరిగణనలోకి తీసుకుంటామని, శునక ప్రియుల పిటిషన్లను పట్టించుకోబోమని బెంచ్‌ స్పష్టం చేసింది. ‘‘ఇది మా కోసం తీసుకుంటున్న నిర్ణయం కాదు. ప్రజల ప్రయోజనాలే ఇందులో ప్రధానం. అందువల్ల ఏ తరహా సెంటిమెంట్లను మేం అనుమతించబోం. స్టెరిలైజేషన్‌ (కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌) జరిపిన తర్వాత కూడా కుక్కలను వదిలిపెట్టొద్దు’’ అని జస్టిస్‌ పార్దివాలా తేల్చిచెప్పారు. ఈ సమస్యపై ఎటువంటి చర్యలు చేపట్టేందుకు వీలున్నదో అమికస్‌ క్యూరీ గౌరవ్‌ అగర్వాల్‌ చెప్పే ప్రయత్నం చేయగా, కొంతకాలానికి అన్ని నిబంధనలు పక్కనబెట్టి, అన్ని ఏరియాల్లో కుక్కలను పట్టుకుని షెల్టర్లకు తరలించాలని ఆయన తెలిపారు. ఈ పనులను పౌర సంస్థలు చేయగలిగితే సరేనని.. లేదంటే ప్రత్యేక బృందాలను నియమిస్తామని బెంచ్‌ అనగా, కోర్టు నిర్ణయాన్ని తు.చ. తప్పక పాటిస్తామని ఢిల్లీ ప్రభుత్వ అధికారులు తెలిపారు. కాగా, ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌వరకు దేశ రాజధానిలో 49 రేబిస్‌ కేసులు, 35,198 కుక్క కాటుకు సంబంధించిన ఘటనలు నమోదయ్యాయి. అలాగే, దేశవ్యాప్తంగా ఏటా ఆరువేలమంది కుక్క కాటు, రేబిస్‌ కారణంగా మరణిస్తున్నారు.

‘గుడ్‌, బ్యాడ్‌ అండ్‌ అగ్లీ’ సినిమా ప్రస్తావన

జంతు ప్రేమికుల తీరుపై బెంచ్‌ తీవ్రస్వరం వినిపించింది. ‘‘రేబిస్‌ కారణంగా ఆత్మీయులను కోల్పోయిన కుటుంబసభ్యులకు తిరిగి వారిని ఈ జంతు ప్రేమికులు తెచ్చి ఇస్తారా?’’ అంటూ ఆగ్రహించింది. ఈ సమయంలో ‘గుడ్‌, బ్యాడ్‌ అండ్‌ అగ్లీ’ అనే సినిమాను ప్రస్తావించింది. ‘‘కాల్చాలనుకుంటే కాల్చడమే. అక్కడ మాటలు అవసరం లేదు. ఇది మాటలకు సమయం కాదు. చేతల్లో చూపించాలి.’’ అని వ్యాఖ్యానించింది. హెల్ప్‌లైన్‌ను ఒక వారంలో ఏర్పాటు చేయాలని బెంచ్‌ ఆదేశించింది. వీధి కుక్కలను ఉంచేందుకు షెల్టర్లను 8 వారాల్లో ఏర్పాటు చేసి, తమకు తెలియజేయాలని కోర్టు ఢిల్లీ ప్రభుత్వాన్ని, మున్సిపల్‌ కార్పొరేషన్లను ఆదేశించింది. ఈ షెల్టర్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. వీధి కుక్కలకు స్టెరిలైజేషన్‌ చేసేందుకు తగినంత మంది సిబ్బంది ఉండాలని పేర్కొంది.

రూ.15వేల కోట్లు అవసరం: మేనకా గాంధీ

సుప్రీంకోర్టు ఆదేశాలపై జంతు ప్రేమికురాలు, కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ మాట్లాడుతూ కుక్కల షెల్టర్లకు అవసరమయ్యే నిధులు, స్థలాలు పురపాలక సంఘాల వద్ద ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. ఢిల్లీలోని కుక్కల పునరావాసానికి రూ.15వేల కోట్లు అవసరం ఉంటుందని తెలిపారు. పెద్ద ఎత్తున కుక్కలను తరలించడం అనేది ‘అశాస్ర్తీయం’, ‘వ్యర్థ ప్రయాస’ అని జంతు ప్రేమికుల సంస్థ ‘పెటా’ అభిప్రాయపడింది. వీధి కుక్కలను జైల్లో పెట్టి సాధించేది కూడా ఏమీ ఉండబోదని పేర్కొంది. ఉమీద్‌ ఫర్‌ యానిమల్స్‌ ఫౌండేషన్‌ సంస్థ వ్యవస్థాపకుడు నిఖిల్‌ మహేష్‌ మాట్లాడుతూ ఈ తీర్పును సవాలు చేస్తామని తెలిపారు. కాగా, పలు కాలనీ సంఘాలు తీర్పును స్వాగతించాయి. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా విలేకరులతో మాట్లాడుతూ తీర్పునకు అనుగుణంగా విధానాన్ని రూపొందించి, ప్రణాళికా బద్ధంగా అమలు చేస్తామని చెప్పారు.

Updated Date - Aug 12 , 2025 | 03:57 AM