Supreme Court: మధ్యవర్తిత్వంతో పెండింగ్ కేసుల పరిష్కారం
ABN, Publish Date - Jun 28 , 2025 | 05:34 AM
పెండింగ్ కేసుల పరిష్కారంపై సుప్రీంకోర్టు ప్రత్యేక కార్యాచరణను ప్రారంభించనుంది. తాలూకా స్థాయి కోర్టుల నుంచి హైకోర్టుల వరకు పెండింగ్‌లో ఉన్న వివాదాలను తేల్చేందుకు 90 రోజుల పాటు ‘జాతీయ స్థాయి మధ్యవర్తిత్వ ప్రచార కార్యక్రమా’న్ని నిర్వహించనుంది.
జూలై 1 నుంచి 90 రోజుల పాటు కార్యాచరణ
జాతీయ కార్యక్రమంగా చేపట్టిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, జూన్ 27: పెండింగ్ కేసుల పరిష్కారంపై సుప్రీంకోర్టు ప్రత్యేక కార్యాచరణను ప్రారంభించనుంది. తాలూకా స్థాయి కోర్టుల నుంచి హైకోర్టుల వరకు పెండింగ్‌లో ఉన్న వివాదాలను తేల్చేందుకు 90 రోజుల పాటు ‘జాతీయ స్థాయి మధ్యవర్తిత్వ ప్రచార కార్యక్రమా’న్ని నిర్వహించనుంది. ‘జాతి కోసం మధ్యవర్తిత్వం’ పేరుతో జరిగే ఈ కార్యక్రమం జులై ఒకటో తేదీన ప్రారంభమయి సెప్టెంబరు 30న ముగియనుంది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోని మధ్యవర్తిత్వ, సాంత్వన ప్రాజెక్టు కమిటీ (మీడియేషన్ అండ్ కాన్సిలియేషన్ ప్రాజెక్టు కమిటీ-ఎంసీపీసీ), జాతీయ న్యాయసేవల సంస్థ (నల్సా) గురువారం ప్రకటించాయి.
స్నేహపూర్వక విధానంలో మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కరించవచ్చన్న విషయాన్ని దేశం నలుమూలలకు తీసుకెళ్లనున్నట్టు సుప్రీంకోర్టు ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. రాజీకి అనుకూలంగా ఉండే కేసులను గుర్తించి, వాటిని మధ్యవర్తిత్వ విధానం ద్వారా పరిష్కరించుకోవచ్చన్న భావనను ప్రజల్లో కల్పించనున్నట్టు పేర్కొంది. జులై ఒకటో తేదీ నుంచి 30 వరకు పెండింగ్ కేసుల గుర్తింపు, కక్షిదారులు, మధ్యవర్తులకు సమాచారం పంపించే ప్రక్రియ కొనసాగుతుంది. అనంతరం కేసులపై ఆయా కోర్టుల్లో సంప్రదింపులు జరుగుతాయి. వారంలో మొత్తం ఏడు రోజుల పాటు విచారణ జరగనుంది.
Updated Date - Jun 28 , 2025 | 05:34 AM