Justice Yashwant Verma: జస్టిస్ వర్మ ప్రవర్తన నమ్మశక్యంగా లేదు
ABN, Publish Date - Aug 08 , 2025 | 05:26 AM
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తన నివాసంలో భారీ మొత్తంలో కాలిన నోట్ల కట్టలు బయటపడిన కేసులో అంతర్గత దర్యాప్తు నిర్వహించిన కమిటీ
ఆయన పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, ఆగస్టు 7: అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తన నివాసంలో భారీ మొత్తంలో కాలిన నోట్ల కట్టలు బయటపడిన కేసులో అంతర్గత దర్యాప్తు నిర్వహించిన కమిటీ.. ఆయన్ను దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ నివేదికను సవాలు చేస్తూ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం గురువారం కొట్టివేసింది. ఆయన ప్రవర్తన నమ్మశక్యంగా లేదని, పిటిషన్‌ను విచారించలేమని తెలిపింది. ఈ కేసు దర్యాప్తులో చట్టప్రకారమే వ్యవహరించారని పేర్కొంది. భారీ మొత్తంలో నగదు బయటపడడంతో వర్మను న్యాయమూర్తి పదవి నుంచి తొలగించాలని దర్యాప్తు నివేదికలో సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. జస్టిస్ వర్మ పక్షాన సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు.
జస్టిస్ వర్మను విధుల నుంచి తొలగించాలని నాటి సీజీఐ సంజీవ్ ఖన్నా రాష్ట్రపతి, ప్రధానికి సిఫారసు చేశారు. తాజాగా వర్మ పిటిషన్‌పై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఏజీ మాసి్‌హల ధర్మాసనం విచారణ జరిపింది. వాదనలు విన్న ధర్మాసనం.. జస్టిస్ వర్మ పిటిషన్‌ను సమర్థించలేమని తేల్చిచెప్పింది. ఆయన అంతర్గత కమిటీ విచారణలో పాల్గొన్న తీరు, ఆ తర్వాత అసలు కమిటీ సామర్థ్యాన్ని ప్రశ్నించడాన్ని తాము పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపింది. ఆయన రిట్ పిటిషనే విచారణకు అనర్హమని తేల్చింది. నాటి సీజేఐ, ఆయన ఏర్పాటు చేసిన అంతర్గత కమిటీ.. ఫొటోలు, వీడియోల అప్‌లోడ్ విషయంలో తప్ప మిగిలిన అంశాల్లో చట్టాన్ని పూర్తిగా అనుసరించిందని స్పష్టం చేసింది. అలాగే కోర్టు ప్రక్రియను నిందించారన్న అభియోగాలపై జస్టిస్ వర్మ మీద ఎఫ్‌ఐఆర్ నమో దు చేయాలంటూ న్యాయవాది మాథ్యూస్ నెడుంపర దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను కూడా కొట్టేసింది. తాజాగా సుప్రీంకోర్టు నిర్ణయంతో పార్లమెంటులో ఆయనపై అభిశంసన చేపట్టేందుకు మార్గం సుగమమైంది.
Updated Date - Aug 08 , 2025 | 05:26 AM