Indian Students: విద్యార్థులు విన్నపం.. సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి కార్యాలయం
ABN, Publish Date - Jun 19 , 2025 | 11:13 AM
ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థుల్లో పలువురు న్యూఢిల్లీ చేరుకున్నారు. వారు స్వస్థలాలకు వెళ్లేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
న్యూఢిల్లీ, జూన్ 19: ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు తొలి విడతగా 110 మంది స్వదేశానికి చేరుకున్నారు. అయితే వారిలో జమ్మూ కశ్మీర్‌కు చెందిన విద్యార్థులు ఉన్నారు. వారిని స్వస్థలాలకు తరలించేందుకు సౌకర్యవంతమైన బస్సులు ఏర్పాటు చేస్తున్నామని జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. అందుకోసం సత్వర చర్యలు చేపట్టినట్లు వివరించింది. ఈ విద్యార్థుల బృందం గురువారం ఉదయం న్యూఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. అయితే అప్పటికే రాష్ట్రానికి చెందిన విద్యార్థులను స్వస్థలాలకు తీసుకెళ్లేందుకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం సాధారణ బస్సులను ఏర్పాటు చేసింది.
కానీ ఈ బస్సులు అంత సౌకర్యవంతంగా లేవంటూ సదరు విద్యార్థులు పెదవి విరిచారు. తాము స్వస్థలాలకు చేరేందుకు మంచి బస్సులు ఏర్పాటు చేయాలని వారు ఉన్నతాధికారులను కోరారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అధికారులు తీసుకు వెళ్లారు. దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం సానుకూలంగా స్పందించింది. విద్యార్థులను స్వస్థలాలకు తరలించేందుకు మెరుగైన బస్సులను ఏర్పాటు చేస్తామని ఎక్స్ ఖాతా వేదికగా వెల్లడించింది.
మరోవైపు ఇరాన్‌లో పరిస్థితులు తీవ్ర భయానకంగా ఉన్నాయని విద్యార్థులు గుర్తు చేసుకున్నారు. అలాంటి వేళ తమను స్వదేశానికి తీసుకొచ్చేందుకు రాయబార కార్యాలయ అధికారులతో పాటూ కేంద్రానికి ఈ సందర్భంగా వారు ధన్యవాదాలు తెలియజేశారు. ఇరాన్‌లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 110 మంది విద్యార్థులు ఈ రోజు ఉదయం భారత్ చేరుకున్నారు. వీరంతా ఉర్మియా మెడికల్ యూనివర్సిటీలో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. ఆపరేషన్ సింధూ పేరుతో విదేశాల్లో చిక్కుకున్న భారతీయ పౌరులను కేంద్రం స్వదేశానికి తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే 110 మంది విద్యార్థుల్లో అధిక శాతం మంది జమ్మూ కశ్మీర్‌కు చెందిన వారే ఉన్నారు. ఇరాన్‌లో చిక్కుకున్న వీరిని తొలుత ఆర్మేనియాకు తీసుకు వచ్చారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో భారత్‌కు తీసుకు వచ్చారు. ఇంకోవైపు.. ఇరాన్‌లో దాదాపు నాలుగు వేల మంది భారతీయులు నివసిస్తున్నారు. వారిలో సగానికి సగం మంది విద్యార్థులే కావడం గమనార్హం.
ఈ వార్తలు కూడ చదవండి..
ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభం
ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి
For National News And Telugu News
Updated Date - Jun 19 , 2025 | 06:27 PM