MK Stalin meet MPs: పార్లమెంట్ సమావేశాల వేళ డీఎంకే ఎంపీలతో స్టాలిన్ అత్యవసర భేటీ.. ఆ అంశాలపై దిశానిర్దేశం..
ABN, Publish Date - Mar 09 , 2025 | 04:59 PM
తమిళనాడు హక్కులు నిలబెట్టుకోవడానికి ఇండియా కూటమి, ప్రజాస్వామ్య శక్తులతో కలిసి పనిచేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ చెప్పారు. తమిళనాడుకు కేంద్రం నుంచి రావాల్సిన న్యాయమైన నిధుల వాటాను డిమాండ్ చేస్తూనే దక్షిణాదిపై హిందీ భాషను రుద్దడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని ఎంపీలకు సూచించారు.
చెన్నై: లోక్‌సభ సీట్ల డీలిమిటేషన్, హిందీ భాషను దక్షిణాది రాష్ట్రాలపై రుద్దడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) ఎంపీలకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సూచించారు. మార్చి 10 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్టీ ఎంపీలకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు ఇవాళ (ఆదివారం) డీఎంకే పార్లమెంట్ సభ్యులతో స్టాలిన్ సమావేశం నిర్వహించారు. తమిళనాడు పార్లమెంటరీ ప్రాతినిధ్యాన్ని కాపాడటంలో ఐక్యంగా నిలబడాలని, జనాభా ప్రాతిపదికన లోక్ సభ సీట్లు కేటాయిస్తే నష్టపోతామని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ప్రభావిత రాష్ట్రాల పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావాలని ఎంపీలకు సూచించారు.
తమిళనాడు హక్కులు నిలబెట్టుకోవడానికి ఇండియా కూటమి, ప్రజాస్వామ్య శక్తులతో కలిసి పనిచేయాలని చెప్పుకొచ్చారు స్టాలిన్. తమిళనాడుకు కేంద్రం నుంచి రావాల్సిన న్యాయమైన నిధుల వాటాను డిమాండ్ చేస్తూనే దక్షిణాదిపై హిందీ భాషను రుద్దడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని ఎంపీలకు సూచించారు. ఈ మేరకు సమావేశానికి సంబంధించిన అంశాలను తన ఎక్స్ ఖాతాలో స్టాలిన్ పోస్టు చేశారు. జనాభా ఆధారంగా నియోజకవర్గాలను పునర్ విభజిస్తే దక్షిణాది రాష్ట్రాలకు మాత్రమే కాకుండా ఒడిశా, పశ్చిమ బెంగాల్‌తో సహా ఇతర రాష్ట్రాలకూ అది నష్టం చేకూర్చుతుందని ఆయన చెప్పుకొచ్చారు.
సోమవారం జరిగే పార్లమెంట్ సమావేశాల్లో డీలిమిటేషన్, హిందీ ఇంపోజిషన్ అంశాలు చర్చకు వస్తే వాటిని తీవ్రంగా వ్యతిరేకించాలని పార్టీ ఎంపీలకు సూచించారు. ఒకవేళ డీలిమిటేషన్ చేయాల్సి వస్తే 1971 జనాభా లెక్కల ఆధారంగానే చేయాలని స్టాలిన్ స్పష్టం చేశారు. అయితే ఈ అంశంపై కేంద్రం స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదని, గందరగోళ పరిస్థితులు సృష్టిస్తోందని డీఎంకే ఎంపీలు ఆరోపిస్తున్నారు. గతంలో జనాభా నియంత్రణ చర్యలను కేంద్రం చేపట్టిందని, వాటిని దక్షిణాది రాష్ట్రాలు సమర్థవంతంగా అమలు చేశాయని ఎంపీలు చెబుతున్నారు.
దీంతో ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గిందని, డీలిమిటేషన్ ద్వారా నియోజకవర్గాలు పునర్ విభజిస్తే తమిళనాడుతోపాటు దక్షిణాది రాష్ట్రాలకూ నష్టం చేకూరుతుందని ఎంపీలు చెబుతున్నారు. ఇదే విషయాన్ని స్టాలిన్ సైతం నమ్ముతున్నారని అంటున్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, పంజాబ్ రాజకీయ పార్టీల మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పోటారంలో కేంద్రానికి వ్యతిరేకంగా వారినీ భాగస్వామ్యం చేసేందుకు స్టాలిన్ నిశ్చయించుకున్నట్లు డీఎంకే ఎంపీలు చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
PM Modi: ఉప రాష్ట్రపతిని పరామర్శించిన ప్రధాని మోదీ
Ranya Rao: స్మగ్లింగ్ కేసులో నన్ను ఇరికించారు.. రన్యారావు కంటతడి
Updated Date - Mar 09 , 2025 | 05:02 PM