Share News

PM Modi: ఉప రాష్ట్రపతిని పరామర్శించిన ప్రధాని మోదీ

ABN , Publish Date - Mar 09 , 2025 | 04:24 PM

PM Modi: అనారోగ్యంతో ఎయిమ్స్‌లో చికిత్స పొందుతోన్న ఉప రాష్ట్రపతి జగదీప్ దన్‌ఖడ్‌ను ప్రధాని మోదీ పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి ఎయిమ్స్ వైద్యులను ఆరా తీశారు. ఆయన త్వరగా కొలుకుని పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.

PM Modi: ఉప రాష్ట్రపతిని పరామర్శించిన ప్రధాని మోదీ
PM Modi

న్యూఢిల్లీ, మార్చి 09: అనారోగ్యంతో ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చికిత్స పొందుతున్న భారత ఉప రాష్ట్రపతి జగదీప్ దన్‌ఖడ్‌ను ప్రధాని మోదీ పరామర్శించారు. ఆదివారం ఉదయం ఎయిమ్స్‌కు చేరుకున్న ప్రధాని మోదీ.. జగదీప్ దన్‌ఖడ్‌ను పరామర్శించారు. అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కొలుకోవాలని.. పూర్తి ఆరోగ్యంతో ఆసుపత్రి నుంచి తిరిగి రావాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతా వేదికగా ప్రధాని మోదీ రాసుకొచ్చారు.

శనివారం అర్థరాత్రి 2.00 గంటలకు ఉప రాష్ట్రపతి జగదీప్ దన్‌ఖడ్ తీవ్ర ఛాతీ నొప్పితో ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలో ఆయన్ని వ్యక్తిగత సిబ్బంది ఎయిమ్స్ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. అనంతరం క్రిటికల్ కేర్ యూనిట్‌లో ఆయనకు అత్యవసర వైద్యం అందించారు. ఆసుపత్రి కార్డియాలజీ విభాగం అధిపతి డాక్టర్ రాజీవ్ నారంగ్ సారథ్యంలోని వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు.

Also Read: బ్లాక్ రైస్ ( Black Rice) తినడం వల్ల ఇన్ని లాభాలా..?


73 ఏళ్ల ఉప రాష్ట్రపతి జగదీప్ దన్‌ఖడ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. మరోవైపు ఉప రాష్ట్రపతి దన్‌ఖడ్ అనారోగ్యం వార్త విన్న వెంటనే.. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎయిమ్స్‌కు చేరుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

For National News And Telugu News

Updated Date - Mar 09 , 2025 | 04:24 PM