Central Govt: సెకీ సీఎండీ గుప్తాపై కేంద్రం వేటు
ABN, Publish Date - May 13 , 2025 | 05:05 AM
సెకీ సీఎండీ రామేశ్వర్ గుప్తాను కేంద్రం పదవీ నుండి తొలగించింది. అదానీ స్కాం నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్టు కాంగ్రెస్ ఆరోపించింది.
మరో నెల గడువు ఉండగానే తొలగింపు
కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ
కార్యదర్శి సారంగికి అదనపు బాధ్యతలు
న్యూఢిల్లీ, మే 12: భారత సౌర శక్తి కార్పొరేషన్(సెకీ) చైర్మన్-మేనేజింగ్ డైరెక్టర్ రామేశ్వర్ ప్రసాద్ గుప్తాను కేంద్రం తొలగించింది. ఆయన స్థానంలో కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ కార్యదర్శి సంతోష్ కుమార్ సారంగికి సీఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ సోమవా రం నిర్ణయం తీసుకుంది. గుప్తా గుజరాత్ కేడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి. 2023 జూన్‌లో సెకీ సీఎండీగా బాధ్యతలు చేపట్టారు. మరో నెలలో ఆయన పదవీకాలం ముగియనుంది. ఈలోపే ఈ నెల 10న ఆయనపై వేటు వేయడం గమనార్హం. ఆయన్ను తొలగించడానికి కారణాలేంటో ప్రభుత్వం పేర్కొనలేదు. అయితే అదానీ స్కాంతో ఈ నిర్ణయానికి సంబంధం ఉందని కాం గ్రెస్ ఆరోపించింది. ఇలాంటి చర్యలతో కుంభకోణాన్ని దాచిపెట్టలేర ని స్పష్టంచేసింది. అదానీ, ఆయన సహచరులపై అమెరికా అధికారులు చార్జిషీటు దాఖలుచేశారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ గుర్తుచేశారు. అందులో సెకీ కూడా ఉందన్నారు. కాగా.. నాటి ఏపీ సీఎం జగన్ హయాంలో సెకీతో రాష్ట్రప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. 25 ఏళ్లపాటు కరెంటు కొనడానికి ఒప్పందం చేసుకున్నారని.. ఈ వ్యవహారంలో జగన్‌కు రూ.1,750 కోట్ల ముడుపులు అందాయని టీడీపీ గతేడాది ఏసీబీకి ఫిర్యాదు చేసింది.
Updated Date - May 13 , 2025 | 05:06 AM