Plastic Pollution: ప్లాస్టిక్ నుంచి పారాసిటమాల్
ABN, Publish Date - Jun 26 , 2025 | 06:06 AM
తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు..’ అని భర్తృహరి సుభాషితాల్లో చెప్పారు. ఇసుక నుంచి నూనెను తీయగలమో లేదోగానీ.. కాలుష్యానికి కారణమయ్యే ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి మనకు జ్వరం, ఒళ్లునొప్పుల నుంచి ఉపశమనం కలిగించే ‘పారాసిటమాల్‘ను మాత్రం శాస్త్రవేత్తలు తయారు చేశారు.
కొత్త సాంకేతికతను అభివృద్ధి చేసిన ఎడిన్‌బరో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు
తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు..’ అని భర్తృహరి సుభాషితాల్లో చెప్పారు. ఇసుక నుంచి నూనెను తీయగలమో లేదోగానీ.. కాలుష్యానికి కారణమయ్యే ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి మనకు జ్వరం, ఒళ్లునొప్పుల నుంచి ఉపశమనం కలిగించే ‘పారాసిటమాల్‘ను మాత్రం శాస్త్రవేత్తలు తయారు చేశారు. ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన కాలుష్య సమస్యల్లో ఒకటి ప్లాస్టిక్.. దాన్ని నిర్మూలించడం పెద్ద సమస్య అయితే, పారాసిటమాల్ ఉత్పత్తి కోసం వాడే ముడిపదార్థాలూ కాలుష్య కారకమే. ఈ రెండు విభిన్న సమస్యలకు యూకేలోని ఎడిన్‌బరో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఒకే పరిష్కారం కనుగొన్నారు.
ప్రమాదకర బ్యాక్టీరియా నుంచి..
ప్లాస్టిక్ నుంచి పారాసిటమాల్‌ను ఉత్పత్తి చేసేందుకు శాస్త్రవేత్తలు మనలో తీవ్ర విరేచనాల (డయేరియా) సమస్యకు కారణమయ్యే ఈ-కొలి బ్యాక్టీరియాను వినియోగించారు. మొదట ఈ బ్యాక్టీరియాలో పలు జన్యుమార్పులు చేసి పీఈటీ (పాలీ ఇథైలీన్ టెరిఫ్తలేట్)పై ప్రయోగించారు. నీళ్లు, శీతల పానీయాల బాటిళ్లు, ఆహారం ప్యాకేజింగ్, క్యారీ బ్యాగులలో ఉపయోగించేది ఈరకం ప్లాస్టిక్‌నే. ప్రపంచవ్యాప్తంగా ఏటా ఉత్పత్తి అవుతున్న ప్లాస్టిక్ చెత్తలో పీఈటీ వాటానే సగానికిపైగా ఉంటుందని అంచనా. అందుకే శాస్త్రవేత్తలు పీఈటీని మొదట ఎన్నుకున్నారు. పీఈటీ ప్లాస్టిక్‌ను ముక్కలుగా చేసి అమైనోప్లాస్టేజ్, హైడ్రోలేజ్ అనే ఎంజైములు కలుపుతారు. ఆ సమ్మేళనం టెరిఫ్తాలిక్ యాసిడ్, ఇథిలీన్ గ్లైకాల్‌లుగా మారుతుంది. దీనిలో జన్యుమార్పులు చేసిన ఈ-కొలి బ్యాక్టీరియాను చేర్చారు. ఈ బ్యాక్టీరియా టెరిఫ్తాలిక్ యాసిడ్, ఇథిలీన్ గ్లైకాల్‌లను తన అంతర్గత జీవక్రియల్లో వినియోగించుకుని ‘అసిటమినఫెన్’ను ఉత్పత్తి చేస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనినే పారాసిటమాల్‌గా కూడా పిలుస్తారు. అంటే ప్లాస్టిక్ వ్యర్థాలు నేరుగా పారాసిటమాల్ ఔషధంగా మారిపోయాయి.
రెండూ చమురు ఉత్పత్తుల నుంచే..
ప్లాస్టిక్, పారాసిటమాల్ రెండూ ముడి చమురు నుంచి పెట్రోలియం, డీజిల్, ఇతర రసాయనాలను వేరుచేయగా మిగిలే పదార్థాల నుంచే ఉత్పత్తి చేస్తారు. ఈ క్రమంలోనే గణనీయంగా కాలుష్యకారక పదార్థాలు కూడా వెలువడుతాయి. పారాసిటమాల్ తయారీ ప్రక్రియలో వెలువడే కాలుష్య కారకాలు ప్రమాదకరం. ఇప్పుడు ప్లాస్టిక్ నుంచి పారాసిటమాల్ తయారు చేస్తే.. ఆ కాలుష్యాల ముప్పు తగ్గుతుందని పరిశోధనకు నేతృత్వం వహించిన బయోటెక్నాలజీ శాస్త్రవేత్త స్టీఫెన్ వాలేస్ పేర్కొన్నారు. ప్రస్తుతానికి ల్యాబ్‌లో చేసిన ప్రయోగంలో 92శాతం పారాసిటమాల్ వెలువడిందని, పారిశ్రామిక స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు వీలుగా సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. కాగా, శాస్త్రవేత్త స్టీఫెన్ వాలేస్ రూపొందించిన విధానాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఆస్ట్రాజెనికా (కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారీదారు)వంటి ప్రసిద్ధ ఫార్మా సంస్థలతో చర్చలు జరుపుతున్నామని ఈఐ కన్సల్టెన్సీ సంస్థ ప్రతినిధి ఇయాన్ హాచ్ తెలిపారు. - సెంట్రల్ డెస్క్
Updated Date - Jun 26 , 2025 | 06:06 AM