Chenab Bridge: చినాబ్ పై తెలుగు ముద్ర
ABN, Publish Date - Jun 09 , 2025 | 05:25 AM
ప్రకాశం జిల్లా ఎస్‌ఎన్‌పాడు నియోజకవర్గంలోని ఏడుగుండ్లపాడు గ్రామానికి చెందిన గాలి మాధవీలత ప్రస్తుతం బెంగళూరులోని ఐఐఎ్‌ససీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
రైల్వే వంతెన నిర్మాణంలో తెలుగమ్మాయి మాధవీలత బాధ్యతలు
ఒంగోలు కార్పొరేషన్, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): భారత ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన చినాబ్ బ్రిడ్జి నిర్మాణంలో తెలుగుతేజం మాధవీలత కీలక పాత్ర పోషించారు. ప్రకాశం జిల్లా ఎస్‌ఎన్‌పాడు నియోజకవర్గంలోని ఏడుగుండ్లపాడు గ్రామానికి చెందిన గాలి మాధవీలత ప్రస్తుతం బెంగళూరులోని ఐఐఎ్‌ససీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. కందుకూరులోని ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుకున్న మాధవీలత జేఎన్‌టీయూ కాకినాడలో ఇంజనీరింగ్, వరంగల్ నిట్‌లో ఎంటెక్ పూర్తి చేశారు. మద్రాస్ ఐఐటీలో పీహెచ్‌డీ పూర్తిచేసి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎ్‌ససీ)లో రాక్ మెకానిక్స్‌లో పోస్ట్ డాక్టొరల్ ఫెలోషిప్ చేశారు. గువాహటీ ఐఐటీలో ఏడాదిపాటు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. ప్రస్తుతం బెంగళూరులోని ఐఐఎ్‌ససీలో హెచ్‌ఏజీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అక్కడే సెంటర్ ఫర్ సస్టెయినబుల్ టెక్నాలజీస్ విభాగానికి చైర్‌పర్సన్‌గా అనేక ప్రాజెక్టులకు నాయకత్వం వహించారు. ఈ క్రమంలో చినాబ్ వంతెన నిర్మాణ బాధ్యతను నార్తర్న్ రైల్వే ఆఫ్కాన్స్ సంస్థకు అప్పగించింది. ఆ సంస్థకు జియో టెక్నికల్ కన్సల్టెంట్‌గా ఉండటంతో.. రాక్ మెకానిక్స్‌లో అనుభవం ఉన్న మాధవీలతకు ఈ ప్రాజెక్టులో పనిచేసే అవకాశం దక్కింది. ఏళ్ల తరబడి ఎంతో కష్టపడి ఈ బాధ్యతలన్నీ విజయవంతంగా పూర్తిచేసిన ఘనత మాధవీలతకు, ఆమె బృందానికి దక్కింది. ఒంగోలు సమీపంలోని ఏడుగుండ్లపాడు గ్రామానికి చెందిన ప్రొఫెసర్ మాధవీలత బాల్యమంతా గ్రామంలోనే కొనసాగింది. తండ్రి గాలి వెంకారెడ్డి, తల్లి అన్నపూర్ణమ్మ. తండ్రి పొగాకు బయ్యర్‌గా పనిచేసేవారు. ఆయన మాధవీలత చిన్నతనంలోనే చనిపోయారు. తల్లి అన్నపూర్ణమ్మ ప్రస్తుతం గ్రామంలోనే కుమారుడు హరనాథ్ రెడ్డి దగ్గర ఉంటోంది. ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్న మాధవీలత భర్త హరిప్రసాద్ రెడ్డి గూగుల్‌లో పనిచేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పట్టణ పేదరిక నిర్మూలనకు కృషి.. ఏపీ మెప్మాకు అవార్డుల పంట
For Telangana News And Telugu News
Updated Date - Jun 09 , 2025 | 07:22 AM