Robert Vadra: రాబర్ట్ వాద్రాపై ఈడీ మరిన్ని ఆరోపణలు
ABN, Publish Date - Aug 10 , 2025 | 08:34 PM
షికోపుర్ ల్యాండ్ డీల్ కేసుకు సంబంధించి ఈడీ వర్గాలు మరిన్ని ఆరోపణలు చేశాయి. అక్రమమార్గంలో వచ్చిన రూ.58 కోట్లు స్థిరాస్తుల కొనుగోళ్లకు దారి మళ్లించారని ఆరోపించాయి.
ఇంటర్నెట్ డెస్క్: కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాపై ఈడీ వర్గాలు తాజాగా మరిన్ని ఆరోపణలు చేశాయి. షికోపూర్ భూ లావాదేవీల వ్యవహారంలో ఆయనకు రూ.58 కోట్లు దక్కాయని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వర్గాలు చెప్పినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇలా వచ్చిన లాభాలను స్కై లైట్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్ఎల్‌హెచ్‌పీఎల్), బ్లూ బ్రీజ్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (బీబీటీపీఎల్) ద్వారా దారి మళ్లించి లగర్జీ స్థిరాస్తుల కొనుగోళ్ల వైపు మళ్లించినట్టు ఈడీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్ 15, 16 తేదీల్లో రాబర్డ్ వాద్రాను ఈడీ ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఈడీ ప్రశ్నలకు వాద్రా నేరుగా సమాధానం ఇవ్వకుండా ఇతరులు తన తరఫున ఈ లావాదేవీలు జరిపారని చెప్పినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. తన వాదనకు మద్దతుగా ఆయన ఎలాంటి డాక్యుమెంట్స్ చూపించలేదని సమాచారం.
ఏమిటీ షికోపూర్ ల్యాండ్ స్కామ్
హర్యానా పోలీసులు 2018లో ఈ భూ లావాదేవీకి సంబంధించి కేసు ఫైల్ చేశారు. వాద్రాతోపాటు హర్యాణా మాజీ సీఎం హుడా, డీఎల్ఎఫ్, ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్‌పై కేసు నమోదు చేశారు. ఈడీ చెబుతున్న దాని ప్రకారం.. వాద్రాకు చెందిన కంపెనీ 2008 ఫిబ్రవరిలో గురుగ్రామ్‌లోని షికోపూర్‌లో 3.5 ఎకరాల స్థలాన్ని ఓంకారేశ్వర్ ప్రాపర్టీ నుంచి కొనుగోలు చేసింది. దీని విలువ రూ.7.5 కోట్లు. ఆ తర్వాత వాద్రా కంపెనీ ఆ భూమిని రియల్ ఎస్టేట్ కంపెనీ డీఎల్‌ఎఫ్‌కు రూ.58 కోట్లకు విక్రయించింది. ఈ డీల్‌పై మనీలాండరింగ్ ఆరోపణలు వచ్చాయి.
అయితే, వాద్రా కుటుంబం మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తోంది. తాను గాంధీ కుటుంబం వాడిని కావడం వల్లే తనను టార్గెట్ చేసుకున్నారని వాద్రా ఓ సందర్భంలో కామెంట్ చేశారు. తాను బీజేపీలో ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండి ఉండేదని అన్నారు.
ఇవి కూడా చదవండి
రాహుల్ గాంధీ డిక్లరేషన్ విడుదల చేయాలి.. లేదంటే.. ఓట్ల చోరీ ఆరోపణలపై ఈసీ
భయపెడుతున్న బాబా వాంగ జ్యోష్యం.. ఆగస్టులో ఏం జరగబోతోంది?..
For More National News and Telugu News
Updated Date - Aug 10 , 2025 | 09:03 PM