EC-Rahul Gandhi: రాహుల్ గాంధీ డిక్లరేషన్ విడుదల చేయాలి.. లేదంటే.. ఓట్ల చోరీ ఆరోపణలపై ఈసీ
ABN , Publish Date - Aug 08 , 2025 | 01:49 PM
ఓట్ల చోరీ జరిగిందంటున్న రాహుల్ గాంధీ తన ఆరోపణలకు మద్దతుగా డిక్లరేషన్ విడుదల చేయాలని ఎన్నికల సంఘం తాజాగా డిమాండ్ చేసింది. లేని పక్షంలో పౌరులను తప్పుదారి పట్టించినందుకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని సూచించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఓట్ల చోరీ జరిగిందంటూ సంచలన ఆరోపణలు చేసిన రాహుల్ గాంధీకి ఎన్నికల సంఘం తాజాగా సవాలు విసిరింది. ఈ ఆరోపణలను ప్రస్తావిస్తూ ఓ డిక్లరేషన్‌పై సంతకం చేసి విడుదల చేయాలని రాహుల్ గాంధీకి తేల్చి చెప్పింది. లేని పక్షంలో బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని సూచించింది. రాహుల్ గాంధీ ఆరోపణలు నిరాధారమని, తప్పుదారి పట్టించేలా ఉన్నాయని ఈసీ పేర్కొంది.
డిక్లరేషన్ విడుదల చేయకపోతే రాహుల్ గాంధీకి తన వ్యాఖ్యలపై నమ్మకం లేనట్టు భావించాల్సి వస్తుందని ఈసీ పేర్కొంది. కాబట్టి, పౌరులను తప్పుదారి పట్టించినందుకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని కోరింది. రాహుల్ గాంధీవి అసంబద్ధ ఆరోపణలని తోసి పుచ్చింది. భారత్‌లో ఎన్నికల ప్రక్రియ అత్యంత పారదర్శకమని, అవకతవకలు జరగకుండా అనేక రక్షణ వ్యవస్థలు ఉన్నాయని పేర్కొంది.
రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు..
ఎన్నికల అవకతవకలపై అణు బాంబు ప్రయోగిస్తానంటూ ఇటీవల హెచ్చరించిన రాహుల్ గాంధీ గురువారం ఢిల్లీలో పలు సంచలన ఆరోపణలు చేశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో ఆరోపణలు గుప్పించారు. బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గంలోని మహదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఒక్క చోట పరిశీలిస్తేనే పలు అక్రమాలు బయటపడ్డాయని ఆరోపించారు. దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఓట్ల చోరీ జరిగిందని అన్నారు. ఎన్నికల సంఘం, బీజేపీ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. ఐదు రకాల అవకతవకలతో ఈ మోసం జరిగిందని అన్నారు. ఒక్క సెగ్మెంట్‌లోనే లక్షకు పైచిలుకు తప్పుడు ఓట్లు బయటపడ్డాయని అన్నారు. ప్రజాస్వామ్యంపై ఇదో అణుబాంబు అని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవాలని అన్నారు.
ఇక రాహుల్ గాంధీ ఆరోపణలపై కర్ణాటక రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి స్పందించారు. ఓటర్ల జాబితాలో అనర్హుల చిట్టాను ఇవ్వాలని కోరారు. తొలగించిన అర్హుల పేర్లను ఇవ్వాలని కూడా కోరారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం కూడా ఘాటుగా స్పందించింది. ఈ ఆరోపణలపై తన సంతకంతో కూడిన ఓ డిక్లరేషన్ విడుదల చేయాలని కోరింది.
ఇవి కూడా చదవండి
ఉగ్రవాద ఏరివేత చర్యలతో కశ్మీర్ వాసుల అష్టకష్టాలు
భయపెడుతున్న బాబా వాంగ జ్యోష్యం.. ఆగస్టులో ఏం జరగబోతోంది?..
For More National News and Telugu News