Kulgam Locals Relocation: ఉగ్రవాద ఏరివేత చర్యలతో కశ్మీర్ వాసుల అష్టకష్టాలు.. సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ విజ్ఞప్తి
ABN , Publish Date - Aug 07 , 2025 | 06:23 PM
కుల్గామ్‌లో భద్రతా దళాలు నిర్వహిస్తున్న ఉగ్రవాద ఏరివేత చర్యలతో తమపైనా ప్రభావం పడుతోందని అఖాల్ గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసరాలు నిండుకుంటున్నాయని ఆవేదన చెందుతున్నారు. తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: కశ్మీర్‌లోని కుల్గామ్‌లో భద్రతాదళాలు చేపడుతున్న ఉగ్రవాద ఏరివేత చర్యలు తమపైనా తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను మరో ప్రాంతానికి తరలించాలంటూ జిల్లాలోని అఖాల్ గ్రామస్థులు అభ్యర్థిస్తున్నారు.
గత వారం రోజులుగా నిరంతరం కొనసాగుతున్న కాల్పులు, బాంబు పేలుళ్ల శబ్దాలతో తమకు కంటి మీద కునుకు లేకుండా పోతోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘రాత్రి వేళ కూడా కాల్పులు, బాంబు పేలుళ్ల మోతతో నిద్ర కూడా పోవడం లేదు. ఇళ్లల్లోని నిత్యావసరాలు కూడా నిండుకుంటున్నాయి. పిల్లలు కూడా భయాందోళనలకు లోనవుతున్నారు. రాత్రిళ్లు రోదిస్తున్నారు. ఔషధాలు, నిత్యావసరాల కొరత ఏర్పడింది. సమీపంలో నివసించే సంచార జాతుల వారు కూడా నిత్యావసరాల కొరతతో సతమతమవుతున్నారు’ అని స్థానికుడు ఒకరు వాపోయారు.
ఈ కష్ట సమయంలో గ్రామాధికారులు తమకు చేతనైన మేరకు నిత్యావసరాలు అందిస్తున్నారని కూడా అన్నారు. అవసరమైన సందర్భాల్లో అంబులెన్స్ ఏర్పాటు చేసిన ఎస్ఎస్‌పీకి వారు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే తమ గ్రామం నుంచి అనేక మంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారని గ్రామస్థులు తెలిపారు. మిగిలిన తమను కూడా ఇతర ప్రాంతాలకు తరలించాలని విజ్ఞప్తి చేశారు.
అఖాల్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు దాగున్నారన్న సమాచారం అందడంతో ఆగస్టు 1న భద్రతా దళాలు ఉగ్రవాద ఏరివేత ఆపరేషన్‌ను ప్రారంభించాయి. అత్యాధునిక సర్వేలెన్స్ ఉపకరణాలు, డ్రోన్స్‌తో నిర్వహిస్తున్న ఈ ఆపరేషన్‌లో ఇప్పటివరకూ ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఏడాది కశ్మీర్‌లో భద్రతా దళాలు నిర్వహించిన అత్యంత సుదీర్ఘ ఆపరేషన్ ఇదేనని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇవి కూడా చదవండి
వెనక్కు తగ్గేదే లే.. ట్రంప్‌కు మోదీ స్ట్రాంగ్ కౌంటర్..
భయపెడుతున్న బాబా వాంగ జ్యోష్యం.. ఆగస్టులో ఏం జరగబోతోంది?..
For More National News and Telugu News