Rajnath Singh: పీవోకే తిరిగొస్తుంది: రాజ్‌నాథ్
ABN, Publish Date - May 30 , 2025 | 06:19 AM
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) త్వరలోనే తిరిగొస్తుందని, తాను భారత్‌లో అంతర్భాగమని ప్రకటించుకుంటుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు.
ఆ రోజెంతో దూరం లేదు
అక్కడి ప్రజలకు భారత్‌తో అనుబంధం ఉంది
పాక్‌తో ఎప్పుడు చర్చలు జరిపినా ఉగ్రవాదం, పీవోకేనే కీలకం
రక్షణ మంత్రి రాజ్‌నాథ్
న్యూఢిల్లీ, మే 29: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) త్వరలోనే తిరిగొస్తుందని, తాను భారత్‌లో అంతర్భాగమని ప్రకటించుకుంటుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు. పీఓకే ప్రజలు భారత కుటుంబంలో భాగమని, వారు తామంతట తాము భారత్‌వైపు వచ్చే రోజు ఎంతో దూరంలో లేదని చెప్పారు. గురువారం సీఐఐ వార్షిక సదస్సులో రాజ్‌నాథ్ ప్రసంగించారు. ‘‘ఒకే భారత్.. శ్రేష్ఠ భారత్ విజన్‌కు కట్టుబడి ఉన్నాం. భౌగోళికంగా, రాజకీయంగా విడిపోయినవారు ఏదో ఒకరోజు ఆత్మగౌరవంతో తిరిగి దేశంలో కలుస్తారని నమ్ముతున్నాను.
విడిపోయి ఉన్నా అక్కడి ప్రజలకు భారత్‌తో బలమైన సాంస్కృతిక, మానసిక అనుబంధం ఉంది. అక్కడి వారిలో ఎవరో కొందరు తప్పుదారిపట్టి ఉండవచ్చు. భారత్‌ది ఎప్పుడూ ఏకత్వం, నమ్మకం, ప్రేమమయమైన మార్గమే. పీఓకే ఏదో ఒకరోజు.. ‘నేను భారత్. నేను తిరిగొచ్చాను’ అని ప్రకటిస్తుందని ఆశిస్తున్నా’’ అని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. పాకిస్థాన్‌తో ఎప్పుడు చర్చలు జరిగినా ఉగ్రవాదం నిర్మూలన, పీఓకేను తిరిగి అప్పగించడమనే రెండు అంశాలే కీలకమని చెప్పారు.
Updated Date - May 30 , 2025 | 07:01 AM