PM Modi: ట్రంప్ ఆహ్వానాన్ని కాదని వచ్చా
ABN, Publish Date - Jun 21 , 2025 | 05:33 AM
జగన్నాథ మహాప్రభుని భూమికి రావాలనే ఉద్దేశంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానాన్ని కూడా తిరస్కరించానని ప్రధాని మోదీ వెల్లడించారు. ‘రెండ్రోజుల క్రితం జి-7 సదస్సు కోసం కెనడాలో ఉన్నాను.
భోంచేసి మాట్లాడుకుందామన్నారు
అయితే జగన్నాథుడి కోసం వినమ్రంగా తిరస్కరించా: మోదీ
అమెరికా అధ్యక్షుడి లంచ్ ఆఫర్‌ను జగన్నాథుడి కోసం వినమ్రంగా తిరస్కరించా
భువనేశ్వర్‌లో ప్రధాని మోదీ వెల్లడి
రూ.18,600 కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం
భువనేశ్వర్, జూన్ 20: జగన్నాథ మహాప్రభుని భూమికి రావాలనే ఉద్దేశంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానాన్ని కూడా తిరస్కరించానని ప్రధాని మోదీ వెల్లడించారు. ‘రెండ్రోజుల క్రితం జి-7 సదస్సు కోసం కెనడాలో ఉన్నాను. అధ్యక్షుడు ట్రంప్ నాకు ఫోన్ చేశారు. 35 నిమిషాలు మాట్లాడుకున్నాం. ఎలాగూ కెనడా దాకా వచ్చారు కదా.. వాషింగ్టన్ మీదుగా వెళ్లండని అడిగారు. కలిసి భోజనం చేద్దాం.. మాట్లాడుకుందామని ఆహ్వానించారు. బాగా ఒత్తిడి తెచ్చారు కూడా. ఆహ్వానించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేశాను. అయితే జగన్నాథుని నేలకు వెళ్లడం నాకు చాలా ముఖ్యమంటూ వినమ్రంగా తిరస్కరించాను. మహాప్రభు పట్ల మీ భక్తిప్రపత్తులే నన్ను ఇక్కడకు తీసుకొచ్చాయి’ అని ప్రజలనుద్దేశించి అన్నారు.
ఒడిసాలో మొదటిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా శుక్రవారం భువనేశ్వర్‌లో జరిగిన వార్షికోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. రూ.18,600 కోట్ల విలువైన 105 ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. బౌధ్ జిల్లాకు తొలి రైలు సర్వీసును ప్రారంభించారు. ఒడిసా విజన్ డాక్యుమెంటును ఆవిష్కరించారు. అక్టోబరు-నవంబరుల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. ఒడిసా రావడానికి ముందు ప్రధాని మోదీ శుక్రవారం సీఎం నితీశ్‌కుమార్‌తో కలిసి సివాన్‌లో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. రూ.5,900 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు.
Updated Date - Jun 21 , 2025 | 05:33 AM