Pilots Association: పైలట్లపైకి తప్పు నెట్టే యత్నం
ABN, Publish Date - Jul 13 , 2025 | 04:15 AM
అహ్మదాబాద్ దుర్ఘటనపై ఏఏఐబీ విడుదల చేసిన ప్రాథమిక నివేదికను ఎయిర్‌లైన్ పైలట్స్ అసోసియేన్ ఆఫ్ ఇండియా..
ఏఏఐబీ నివేదికను ఖండిస్తున్నాం
ఎయిర్‌లైన్ పైలట్ల అసోసియేషన్ మండిపాటు
న్యూఢిల్లీ, జూలై 12: అహ్మదాబాద్ దుర్ఘటనపై ఏఏఐబీ విడుదల చేసిన ప్రాథమిక నివేదికను ఎయిర్‌లైన్ పైలట్స్ అసోసియేన్ ఆఫ్ ఇండియా (ఆల్ఫా) ఖండించింది. ప్రమాదానికి సంబంధించి పైలట్లపైకి తప్పు నెట్టేసే ప్రయత్నంలా ఉందని మండిపడింది. ఈమేరకు ఆల్ఫా అధ్యక్షుడు శామ్ థామస్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘విమాన ఇంధన నియంత్రణ స్విచ్‌ల అంశం ప్రమాదానికి కారణమని అమెరికాలోని వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రిక జూలై 10నే కథనం ప్రచురించింది. ఏఏఐబీ దర్యాప్తులోని రహస్య అంశం ముందే ఎలా బయటికి వెళ్లింది? నివేదికపై సంబంధిత అధికారుల సంతకాలు కూడా లేకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది. దర్యాప్తు బృందంలో సరైన నిపుణులు కూడా లేరు. ఇవన్నీ దర్యాప్తు విశ్వసనీయతపై సందేహాలు కలిగిస్తున్నాయి’’అని పేర్కొన్నారు. విమాన ప్రమాద దర్యాప్తులో పైలట్లనూ భాగస్వామ్యం చేయాలని డిమాండ్ చేశారు. దర్యాప్తులో కనీసం పరిశీలకులుగానైనా పైలట్లకు అవకాశమిస్తే దర్యాప్తులో పా రదర్శకత ఉంటుందన్నారు. ఈ డిమాండ్‌పై ఎయిరిండియా స్పందించింది. ఏఏఐబీ నివేదికపై సమీక్షించేందుకు పైలట్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని సంస్థ ఫ్లైట్ ఆపరేషన్స్ విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మనీష్‌ఉప్పల్ ప్రకటించారు.
పాశ్చాత్య మీడియా తీరు దారుణం: బీజేపీ
బోయింగ్ 787 విమానంలో లోపమేమీ లేదని, పైలట్ ఇంజన్‌కు ఇంధన సరఫరా ఆపేయడంతోనే ప్రమాదం జరిగిందని పాశ్చాత్య మీడియా ప్రచా రం చేయడం దారుణమని బీజేపీ మండిపడింది. దీనిపై ఆ పార్టీ నేత అమిత్ మాలవీయ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ‘‘ఏఏఐబీ నివేదికలోని ఒక అంశాన్ని పట్టుకుని పాశ్చాత్య మీడియా వార్తలు ప్రచురిస్తున్న తీరు అగౌరవకరం. మరణించిన పైలట్లపై అపనిందలు వేస్తున్న తీరు దారుణం’’ అని పేర్కొన్నారు.
Updated Date - Jul 13 , 2025 | 04:15 AM