Parliament Budget Session: నేటి నుంచే పార్లమెంటు
ABN, Publish Date - Mar 10 , 2025 | 04:17 AM
ప్రారంభమయ్యే సమావేశాలు రణరంగాన్ని తలపించే అవకాశాలు ఉన్నాయి. అధికార బీజేపీ, ప్రతిపక్ష సభ్యుల మఽధ్య తొలి రోజు నుంచే వాగ్యుద్ధాలు జరగనున్నాయి.
మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనకు లోక్‌సభ ఆమోదం కోరనున్న అమిత్ షా
మణిపూర్, వక్ఫ్ బిల్లుపై సర్కారును నిలదీయనున్న ప్రతిపక్షాలు
నియోజకవర్గాల పునర్విభజన, త్రిభాషా సూత్రంపైనా ఆందోళన
న్యూఢిల్లీ, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా జరగనున్నాయి. సోమవారం నుంచి ప్రారంభమయ్యే సమావేశాలు రణరంగాన్ని తలపించే అవకాశాలు ఉన్నాయి. అధికార బీజేపీ, ప్రతిపక్ష సభ్యుల మఽధ్య తొలి రోజు నుంచే వాగ్యుద్ధాలు జరగనున్నాయి. హింసాకాండతో అతలాకుతలమైన మణిపూర్‌లో విధించిన రాష్ట్రపతి పాలనకూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారమే లోక్‌సభ ఆమోదముద్ర కోరనున్నారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మణిపూర్‌కు సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టబోతున్నారు. ఇక ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వక్ఫ్ బిల్లు కూడా ఈ సమావేశాల్లోనే పార్లమెంట్ ముందుకు రానుంది. మణిపూర్‌లో రెండేళ్లుగా జరుగుతున్న హింసను అదుపు చేయలేక.. గత నెలలో ముఖ్యమంత్రి బీరేన్ సింగ్‌తో రాజీనామా చేయించి, రాష్ట్రపతి పాలన విధించాల్సి రావడంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మణిపూర్‌లో హింసాకాండ ఆగకపోవడంపై సర్కారును నిలదీయనున్నాయి. మరోవైపు వక్ఫ్ బిల్లును పరిశీలించేందుకు వేసిన సంయుక్త పార్లమెంటు కమిటీ (జేపీసీ)లో తమ అభ్యంతరాలను తిరస్కరించి కేవలం ఎన్డీయే సభ్యుల ఆమోదంతో బిల్లుకు ఆమోదముద్ర వేసినందుకు ప్రతిపక్ష సభ్యులు గత సమావేశాల్లోనే గందరగోళం సృష్టించారు.
ప్రతిపక్షాలు ఎంత గొడవ చేసినా సాధ్యమైనంత త్వరలో వక్ఫ్ బిల్లును చట్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు ఇప్పటికే ప్రకటించారు. ఇండియా కూటమి పార్టీలన్నీ వక్ఫ్ బిల్లును వ్యతిరేకించేందుకు వ్యూహ రచన చేస్తాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ప్రకటించారు. సోమవారం రాజ్యసభలో రైల్వే సవరణ బిల్లు, సహకార సంఘాల్లో పనిచేసే వ్యక్తులకు తగిన శిక్షణను అందించేందుకు త్రిభువన్ సహకారీ బిల్లును కూడా ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు నియోజకవర్గాల పునర్విభజన, త్రిభాషా సూత్రం ద్వారా హిందీని దక్షిణాదిపై రుద్దడం, భారత్‌పై అమెరికా టారిఫ్‌లు విధించడంపై కూడా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నాయి. జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేపట్టరాదని డీఎంకే సహా పలు పార్టీలు డిమాండ్ చేయనున్నాయి.
Updated Date - Mar 10 , 2025 | 04:17 AM