Lashkar Commander Funeral: పాక్ ప్రభుత్వ లాంఛనాలతో ఉగ్రవాదుల అంత్యక్రియలు
ABN, Publish Date - May 13 , 2025 | 04:55 AM
పాక్ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో లష్కరే తాయిబా ఉగ్రవాదుల అంత్యక్రియలు నిర్వహించింది. హఫీజ్ అబ్దుల్ రవూఫ్ వంటి అంతర్జాతీయ ఉగ్రవాదుల శవ పేటికలపై పాక్ పతాకం ఉంచటం తీవ్ర విమర్శలకు దారితీసింది.
ఉగ్రమూకల శవ పేటికలపై పాక్ పతాకం.. అంత్యక్రియలకు లష్కరే కమాండర్
న్యూఢిల్లీ, మే 12: భారత్‌పై విషం చిమ్మడమే తన విధానంగా పెట్టుకున్న పాకిస్థాన్.. తాజాగా అంతర్జాతీయ సమాజాన్ని కూడా ఏమార్చే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్‌లోని ఉగ్ర శిబిరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత్ జరిపిన దాడుల్లో పదుల సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో లష్కరే తాయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన పలువురు మృతి చెందారు. అయితే.. మృతి చెందిన ఉగ్రవాదులకు పాక్ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించింది. ఈ అంత్యక్రియల్లో లష్కరే తాయిబాకు చెందిన సీనియర్ కమాండర్ హఫీజ్ అబ్దుల్ రవూఫ్ సహా సైనికాధికారులు, పాక్ పోలీసులు, రాజకీయ నేతలు పాల్గొన్నారు. రవూ్‌ఫను అంతర్జాతీయ ఉగ్రవాదిగా అమెరికా కూడా ముద్ర వేసింది. అలాంటి ఉగ్రవాదికి ఆశ్రయం ఇవ్వడంతోపాటు అంత్యక్రియల్లో పాల్గొన్నా.. పాక్ ప్రభుత్వం మౌనంగా ఉంది. అంతేకాదు.. దీనిని సమర్థించుకుంటూ.. ఆయనను మత గురువుగా, కుటుంబ సభ్యుడిగా పేర్కొంటూ అంతర్జాతీయ సమాజాన్ని ఏమార్చే ప్రయత్నం చేసింది. మరోవైపు, పాక్ సైన్యం కూడా రవూ్‌ఫను వెనుకేసుకు వచ్చింది. ‘‘ఆయన స్థానిక మతగురువు. ఓ పార్టీ కార్యకర్త, కుటుంబ సభ్యుడు.’’ అంటూ పాకిస్థాన్‌కు చెందిన ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌధురి మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో.. ఓ గుర్తింపు కార్డును కూడా ప్రదర్శించారు. అయితే.. ఇక్కడే పాక్ అడ్డంగా దొరికిపోయింది. సదరు గుర్తింపు కార్డులో పేర్కొన్న పుట్టిన రోజు, గుర్తింపు సంఖ్య వంటివి అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ రవూఫ్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా పేర్కొంటూ జారీ చేసిన కార్డులోని వివరాలతో పక్కాగా సరిపోయాయి. ఇదే విషయాన్ని భారత సైనికాధికారులు బట్టబయలు చేశారు.
రాజకీయంగా కూడా..
రవూఫ్ ఉగ్రవాది మాత్రమే కాదు. రాజకీయ నాయకుడిగా కూడా చలామణి అవుతున్నాడు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో లాహోర్‌లోని ఎన్‌ఏ-119 నియోజకవర్గం నుంచి పీఎంఎంఎల్ పార్టీ తరపున పోటీ చేశాడు. ఈయనకు 2 వేల ఓట్లు కూడా పడ్డాయి. పీఎంఎంఎల్ పార్టీకి లష్కరే ఉగ్రవాద నాయకుడు హఫీజ్ సయీద్ మద్దతిస్తుండడం గమనార్హం. ఈ ఎన్నికల్లో హఫీజ్ సయీద్ కుమారుడు తల్హా సయీద్ సైతం లాహోర్ ఎన్‌ఏ-122 నియోజకవర్గం నుంచి పోటీ చేశాడు. ఇక, రవూఫ్ గతంలో లష్కరేకు ఫలా్‌హ-ఇ-ఇన్‌శానియంట్ ఫౌండేషన్ పేరుతో నిధులు సమకూర్చాడు.
వీరంతా ఎవరు?: భారత్
ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాల్గొన్న పాక్ అధికారులు, ఉగ్రవాదుల జాబితాను కేంద్రం విడుదల చేసింది. వీరంతా ఎవరు? అంటూ పాక్‌ను నిలదీసింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉగ్రవాదుల అంత్యక్రియల్లో లష్కరే కమాండర్ అబ్దుల్ రవూఫ్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశాడు. అలాగే పాక్ సైన్యానికి చెందిన లెఫ్టినెంట్ జనరర్ ఫయ్యాజ్ హుస్సేన్ షా, మేజర్ జనరల్ రావ్ ఇమ్రాన్ సర్తాజ్, బ్రిగేడర్ మహ్మద్ ఫర్ఖాన్ షబ్బీర్, సీనియర్ పోలీసు అధికారి ఉస్మాన్ అన్వర్, రాజకీయ నేత మాలిక్ సోహైబ్ అహ్మద్ కూడా ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
పాక్‌కు ఆయుధాలు ఇవ్వలేదు
సైనిక కార్గో విమానం పంపామన్నది వదంతే: చైనా
ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్‌ను ఎదుర్కొనేందుకు పాకిస్థాన్‌కు చైనా ఆయుధాలు పంపినట్లు వస్తున్న వార్తలను డ్రాగన్ దేశం తోసిపుచ్చింది. అవన్నీ వదంతులేనని కొట్టిపారేసింది. గత వారం పాక్‌కు ఆయుధ సామగ్రితో కూడిన అతి పెద్ద కార్గో విమానాన్ని చైనా పంపిందన్న వార్తల నేపథ్యంలో సోమవారం ఆ దేశ వాయుసేన స్పందించింది. ‘మేం అటువంటి మిషన్‌ను చేపట్టలేదు. ఈ వదంతుల వెనక ఉన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇంటర్నెట్.. చట్టానికి అతీతమేమీ కాదు’ అంటూ రక్షణశాఖ వెబ్‌సైట్‌లో ఓ ప్రకటన చేసింది. భారత్‌పై పాక్ చైనా యుద్ధ విమానాలను ప్రయోగించిందన్న వాదనలను అంతకుముందే బీజింగ్ కూడా కొట్టిపారేసింది. ‘మేం అన్ని రకాల ఉగ్రవాదానికి వ్యతిరేకం. శాంతి కోసం సంయమనం పాటించాలని ఇరువైపుల వారిని కోరుతున్నాం’ అంటూ పేర్కొంది.
Updated Date - May 13 , 2025 | 04:56 AM