ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Iran-Israel war: 150 డాలర్లకు చమురు!

ABN, Publish Date - Jun 16 , 2025 | 05:51 AM

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధంతో ముడి చమురు ధర మళ్లీ సెగలు కక్కుతోంది. శనివారం ఒక్కరోజే బ్రెంట్‌ రకం పీపా (బ్యారెల్‌) చమురు ధర 13ు పెరిగి 78 డాలర్లకు చేరింది.

  • ఇరాన్‌-ఇజ్రాయెల్‌ పోరుతో ఇప్పటికే 5 నెలల గరిష్ఠానికి..

  • ఇప్పుడు చమురు, సహజ వాయు క్షేత్రాలపైనా దాడులు

  • హోర్ముజ్‌ జలసంధిని మూసే దిశగా ఇరాన్‌ యోచన

  • ఈ పరిణామాలతో ధరాభారం మరింత పెరిగే ముప్పు

  • మన ఆర్థికవ్యవస్థపై తీవ్ర ప్రభావం.. ద్రవ్యోల్బణం పైపైకి!

న్యూఢిల్లీ, జూన్‌ 15: ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధంతో ముడి చమురు ధర మళ్లీ సెగలు కక్కుతోంది. శనివారం ఒక్కరోజే బ్రెంట్‌ రకం పీపా (బ్యారెల్‌) చమురు ధర 13ు పెరిగి 78 డాలర్లకు చేరింది. చమురు ధర గత ఐదు నెలల్లో ఈ స్థాయికి చేరడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం 75 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇజ్రాయెల్‌ తమపై దాడులు చేస్తున్న నేపథ్యంలో.. పర్షియన్‌ గల్ఫ్‌ నుంచి ప్రపంచదేశాలకు చమురు సరఫరాలో కీలకమైన హోర్ముజ్‌ జలసంధిని మూసేయాలన్న ప్రతిపాదనను ఇరాన్‌ పరిశీలిస్తోంది. అది జరిగినా.. లేక ఈ ప్రాంతంలో అమెరికాకు మిత్రుడైన సౌదీ అరేబియా చమురు క్షేత్రాలపై ఇరాన్‌ దాడులకు దిగినా పీపా చమురు ధర 120 నుంచి 150 డాలర్లకు చేరే ప్రమాదం ఉందని రాబో బ్యాంకు ఇంటర్నేషనల్‌ గ్లోబల్‌ స్ట్రాటజిస్ట్‌ మైఖేల్‌ ఇవిరీ ఇప్పటికే హెచ్చరించారు. ప్రస్తుత ధరతో పోలిస్తే ఇది 103 శాతం ఎక్కువ.

ఇదీ లెక్క..

యూఎస్‌ ఎనర్జీ ఇన్ఫర్మేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా రోజుకు సగటున 103 మిలియన్‌ బ్యారెళ్ల చమురు ఉత్పత్తి అవుతోంది. అందులో ఇరాన్‌ వాటా (రోజుకు) 32 లక్షల బ్యారెళ్లు. అందులో 15 నుంచి 20 లక్షల బ్యారెళ్లను ప్రపంచంలోని వివిధ దేశాలకు ఎగుమతి చేస్తుంది. అలాగే.. అమెరికా, రష్యా తర్వాత ప్రపంచంలోనే మూడో అతిపెద్ద సహజవాయు ఉత్పత్తిదారు ఇరాన్‌. రోజుకు సగటున 275 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల సహజవాయువును ఆ దేశం ఉత్పత్తి చేస్తుంది. అంతర్జాతీయ ఉత్పత్తిలో అది దాదాపు 6.5 శాతం. ఇరాన్‌ప్రధాన ఆదాయ వనరులు.. ఈ చమురు, సహజవాయు నిక్షేపాలే. అందుకే.. ఆ దేశంపై యుద్ధంలో భాగంగా తొలి దశలో అణు, సైనిక స్థావరాలపై బాంబులు కురిపించిన ఇజ్రాయెల్‌ తాజాగా చమురు, సహజవాయు క్షేత్రాలపై దృష్టి సారించింది. అందులో భాగంగానే ఇరాన్‌లోని సౌత్‌ పార్స్‌ గ్యాస్‌ ఫీల్డ్‌పై డ్రోన్‌ దాడి చేసింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సహజవాయు రిజర్వు. ఈ దాడితో ఇరాన్‌ ఆ క్షేత్రంలో సహజవాయు ఉత్పత్తిని పాక్షికంగా నిలిపివేయాల్సి వచ్చింది. ఫలితంగా 12 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల మేర గ్యాస్‌ ఉత్పత్తి ఆగిపోయింది. ఇజ్రాయెల్‌ తన దూకుడును ఇలాగే కొనసాగించి ఇరాన్‌ ఇంధన క్షేత్రాలపై మరింత పెద్ద ఎత్తున దాడులు చేస్తే ఆ ప్రభావం అంతర్జాతీయ ముడిచమురు, సహజవాయు సరఫరా చైన్‌పై తీవ్రంగా పడే ప్రమాదం ఉందని ఇంధన రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా.. ఖార్గ్‌ ఐలండ్‌ వంటివాటిపై దాడులు జరిగితే మరింత ప్రభావం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

హోర్ముజ్‌ జలసంధిని మూసేస్తే..

ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హోర్ముజ్‌ జలసంధిని మూసేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని.. ఇరాన్‌ పార్లమెంటు సభ్యుడు, ఐఆర్‌జీసీ సీనియర్‌ కమాండర్‌ సర్దార్‌ ఇస్మాయిల్‌ కౌసరి తాజాగా తెలిపారు. అదే జరిగితే చమురు ధరలు చుక్కలనంటే ప్రమాదం ఉంది. ఎందుకంటే.. ప్రపంచంలోనే చమురు ఉత్పత్తిలో అత్యంత కీలకమైన ఇరాక్‌, సౌదీ అరేబియా, ఇరాన్‌, యూఏఈ, ఓమన్‌ దేశాల నౌకలు రాకపోకలు సాగించేది ఈ జలసంధి గుండానే. ఆయా దేశాల నుంచి చైనా, భారత్‌, జపాన్‌, కొరియా దేశాల చమురు, ఎల్‌ఎన్‌జీ దిగుమతులకు ఇదే ప్రధాన ఆధారం. యూఎస్‌ ఎనర్జీ ఇన్ఫర్మేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా నిత్యం వినియోగించే చమురులో 20 శాతం, సహజవాయువులో 25ు.. పర్షియన్‌ గల్ఫ్‌ నుంచి ఈ జలసంధి గుండానే బయటకు ప్రయాణిస్తుంది.

భారత్‌కు దెబ్బే..

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం వీలైనంత త్వరగా ముగిస్తే సరే.. లేకపోతే మన దేశానికీ తిప్పలు తప్పవు. ఎందుకంటే మన ముడి చమురు అవసరాల్లో 90 శాతం, గ్యాస్‌ అవసరాల్లో 50 శాతానికి దిగుమతులే దిక్కు. మన చమురు దిగుమతుల్లో ఇరాక్‌, సౌదీ అరేబియా, కువైట్‌, యూఏఈల వాటా సగం వరకు ఉంటుంది. ఇరాన్‌ హోర్ముజ్‌ జలసంధిని మూసివేస్తే ఈ సరఫరాలకు తీవ్ర విఽఘాతం తప్పదు. అదే జరిగితే చమురు ధర భగ్గుమని మన ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే ప్రమాదం ఉంది. పీపా చమురు ధర రెండు డాలర్లు పెరిగినా చమురు కంపెనీలు అమ్మే ప్రతి లీటరు పెట్రోల్‌, డీజిల్‌పై రూ.2 ఆదాయం తగ్గుతుందని అంచనా. ఈ నష్టాలు తట్టుకునేందుకు ఆయిల్‌ కంపెనీలు మళ్లీ పెట్రోల్‌, డిజిల్‌ ధరలు పెంచక తప్పదు. చమురు సెగతో ద్రవ్యోల్బణం ఎగబాకడంతో పాటు ద్రవ్య లోటు కట్టుతప్పి జీడీపీ వృద్ధి రేటూ మసకబారే ప్రమాదం ఉంది. అప్పుడు ఆర్‌బీఐ వడ్డీ రేట్ల కోతలకు స్వస్తి చెప్పి.. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు మళ్లీ వడ్డీ రేట్ల పెంపునకు దిగే అవకాశం ఉంది.

ఎగుమతులకూ ముప్పే

తాజా ఉద్రిక్తతలపై ఎగుమతిదారులూ బెంబేలెత్తిపోతున్నారు. గత ఏడాది హౌతీల దాడులతో ఎర్ర సముద్ర మార్గం మూసుకుపోవడంతో భారత ఎగుమతిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఇరాన్‌కు మద్దతుగా హౌతీలు మళ్లీ ఎర్ర సముద్రం మీదుగా ప్రయాణించే నౌకలపై ఎక్కడ దాడులు చేస్తారోనని భయపడుతున్నారు. ఈ దాడుల నుంచి తప్పించుకునేందుకు దక్షిణాఫ్రికా సమీపంలోని ‘కేప్‌ ఆఫ్‌ గుడ్‌హోప్‌’ మీదుగా నౌకలను మళ్లించాల్సి ఉంటుంది. అదే జరిగితే రవాణ ఖర్చులు 50ు పెరిగిపోతాయి.

Updated Date - Jun 16 , 2025 | 05:51 AM