Madras High Court: ప్రభుత్వ పథకాలకు బతికున్న నేతల పేర్లు పెట్టొద్దు
ABN, Publish Date - Aug 02 , 2025 | 05:15 AM
రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు బతికున్న రాజకీయ నేతల పేర్లు పెట్టకూడదని మద్రాస్ హైకోర్టు స్పష్టంచేసింది.
ప్రభుత్వ ప్రకటనల్లో మాజీ సీఎంలు, పార్టీల నేతల
ఫొటోలు వద్దు.. ఇది సుప్రీం మార్గదర్శకాలకు విరుద్ధం
సంక్షేమ స్కీముల అమలును మేం అడ్డుకోవడం లేదు
ప్రచారం తీరుపైనే అభ్యంతరం: మద్రాస్ హైకోర్టు విచారణ ఈ నెల 13వ తేదీకి వాయిదా
చెన్నై, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు బతికున్న రాజకీయ నేతల పేర్లు పెట్టకూడదని మద్రాస్ హైకోర్టు స్పష్టంచేసింది. అలాగే ప్రభుత్వ ప్రకటనల్లో మాజీ ముఖ్యమంత్రులు, పార్టీ సిద్ధాంతకర్తల పేర్లు, ఫొటోలు ఉండకూడదని స్పష్టం చేసింది. తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌కు షాక్ ఇచ్చింది. ‘ఉంగళుడన్ స్టాలిన్ (మీతోనే స్టాలిన్)’ అనే పథకంలో స్టాలిన్ పేరు, ఆ స్కీం ప్రకటనలో దివంగత మాజీ సీఎం కరుణానిధి ఫొటో వాడకుండా అడ్డుకోవాలని కోరుతూ అన్నాడీఎంకే ఎంపీ సీవీ షణ్ముగం ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మణీంద్రమోహన్ శ్రీవాస్తవ, జస్టిస్ సుందర్ మోహన్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపి.. పై ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ ప్రకటనలకు సంబంధించి సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలు, మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ ప్రకటనల్లో సీఎం స్టాలిన్ ఫొటో ఉండవచ్చని.. అయితే దివంగత పార్టీ నేతలు, మాజీ ముఖ్యమంత్రుల ఫొటోలు, పార్టీ చిహ్నాలు, జెండాలు ఉండరాదని, వాటికి అనుమతి లేదని స్పష్టంచేసింది. ప్రభుత్వ ప్రకటనల్లో అధికార పార్టీ పేరు, చిహ్నం ఉపయోగించడం సుప్రీంకోర్టు, ఎన్నికల కమిషన్ ఉత్తర్వులకు విరుద్ధమని తెలిపింది. రాష్ట్రప్రభుత్వం కొత్తగా ప్రారంభించబోయే పథకాలు, అమలులో ఉన్న పథకాలకు సంబంధించిన ప్రకటనల్లో రాజకీయ నేతల పేర్లు, ఫొటోలు లేకుండా చూసుకోవాలని ఆదేశించింది. పథకాల ప్రారంభోత్సవాలు, అమలుకు సంబంధించి ఎలాంటి వ్యతిరేక ఉత్తర్వులూ జారీచేయడం లేదని పేర్కొంది. అయితే సంక్షేమ పథకాలను అమలు చేయకుండా ప్రభుత్వాన్ని తాము అడ్డుకోవడం లేదని.. వాటిని ప్రచారం చేస్తున్న తీరుపైనే అభ్యంతరమని స్పష్టత ఇచ్చింది. ‘ఉంగళుడన్ స్టాలిన్’ పథకాన్ని తమిళనాడు ప్రభుత్వం ఇటీవలే ప్రారంభించింది. ఆయన పేరుతోనే శనివారం మరో ఆరోగ్య పథకాన్ని ప్రారంభించనుంది. పిటిషనర్ షణ్ముగం తరఫున సీనియర్ న్యాయవాది విజయ్ నారాయణ్ వాదనలు వినిపించారు. కొందరు రాజకీయ నేతలను ప్రమోట్ చేయడానికి రాష్ట్రప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని, 2014నాటి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘిస్తోందని తెలిపారు. అయితే రాజకీయ చిహ్నాలు కనిపించే ఎలాంటి మెటీరియల్ ఉన్నా చట్టనిబంధనలను ఉల్లంఘించినట్లేనని హైకోర్టు స్పష్టంచేసింది.
ఇవి కూడా చదవండి
అనిల్ అంబానీకి షాక్.. లుక్ అవుట్ నోటీస్ జారీ చేసిన ఈడీః
తప్పతాగి డ్యూటీకి.. అడ్డంగా జనానికి దొరికిపోయిన ఎస్ఐ
Updated Date - Aug 02 , 2025 | 05:15 AM