CM Nitish Kumar: ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35% కోటా
ABN, Publish Date - Jul 09 , 2025 | 02:05 AM
ఈ ఏడాది చివర్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కీలక ప్రకటన చేశారు.
యువత అభ్యున్నతి, సంక్షేమానికి ప్రత్యేక కమిషన్
ఎన్నికల ముందు నితీశ్ ప్రభుత్వం కీలక ప్రకటన
పట్నా, జూలై 8: ఈ ఏడాది చివర్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. యువత కోసం కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయాలను నితీశ్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. అన్ని విభాగాలు, స్థాయుల్లోని ఉద్యోగాల్లో బిహార్ శాశ్వత నివాసితులైన మహిళా అభ్యర్థులకు 35 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళా శక్తిని పెంచడం, రాష్ట్ర పరిపాలనలో వారు చురుకైన పాత్ర పోషించేలా చేయాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ‘బిహార్ యూత్ కమిషన్’ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. చైర్‌పర్సన్, ఇద్దరు వైస్ చైర్‌పర్సన్లు, ఏడుగురు సభ్యులతో ఏర్పాటయ్యే ఈ కమిషన్.. రాష్ట్రంలో యువత అభ్యున్నతి, సంక్షేమం కోసం ప్రభుత్వానికి సలహాలు ఇస్తుందని తెలిపారు. యువతకు మెరుగైన విద్య, ఉద్యోగావకాశాలు కల్పించడానికి, ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానిక యువతకు ప్రాధాన్యం దక్కేలా ఈ కమిషన్ కృషి చేస్తుందని తెలిపారు.
Updated Date - Jul 09 , 2025 | 02:05 AM