Modi Sets Independence Day Speech Record: పంద్రాగస్టు ప్రసంగాల్లో మోదీ రికార్డు
ABN, Publish Date - Aug 16 , 2025 | 02:41 AM
పంద్రాగస్టు వేడుకలు ఈసారి అనేక ప్రత్యేకతలను సంతరించుకున్నాయి. ఢిల్లీ ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పలు రికార్డులను బద్దలుకొట్టారు. శుక్రవారం 103 నిమిషాలపాటు దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ....
ఎర్రకోట నుంచి 103 నిమిషాల ప్రసంగం
న్యూఢిల్లీ, ఆగస్టు 15 : పంద్రాగస్టు వేడుకలు ఈసారి అనేక ప్రత్యేకతలను సంతరించుకున్నాయి. ఢిల్లీ ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పలు రికార్డులను బద్దలుకొట్టారు. శుక్రవారం 103 నిమిషాలపాటు దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఒక ప్రధాని ఇంత సుదీర్ఘంగా పంద్రాగస్టు ప్రసంగం చేయడం స్వాతంత్య్ర భారత చరిత్రలోనే ఇది ప్రథమం. గతేడాది 98 నిమిషాలు ఆయన ప్రసంగించారు. అదే అప్పటికి అతి దీర్ఘ ప్రసంగం. ఈసారి ఆయన రికార్డును ఆయననే ఛేదించడం విశేషం. ఆయనకు ముందు నెహ్రూ 72 నిమిషాలు, మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ 71 నిమిషాలు మాట్లాడి అతి దీర్ఘ ఉపన్యాసకులుగా ఘనత పొందారు. నెహ్రూ 1954లో, ఇందిర 1966లో కేవలం 14 నిమిషాలే పంద్రాగస్టు ప్రసంగం చేశారు. ఈ రికార్డు ఇప్పటికీ వారి పేరిటే ఉంది.
ఇందిర రికార్డు బద్దలు...
వరుసగా 12 సార్లు ఎర్రకోట నుంచి దేశ ప్రజలకు సందేశం అందించి.. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ పేరిట ఉన్న రికార్డును ప్రధాని మోదీ అధిగమించారు. ఇందిరాగాంధీ 1966 జనవరిలో ప్రధాని అయి, 1977 మార్చి వరకు కొనసాగారు. అనంతరం 1980 నుంచి 1984 అక్టోబరులో హత్యకు గురయ్యేవరకు తిరిగి ఆ పదవిలో ఉన్నారు. ఈ క్రమంలో మొత్తం 16సార్లు ఆమె ఎర్రకోట నుంచి ప్రసంగించారు. ఎర్రకోట నుంచి అత్యధికంగా 17సార్లు ప్రసంగించిన తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ. ఇప్పుడు ఆయన తర్వాతిస్థానం మోదీ దక్కించుకున్నారు. ఇక ప్రధానమంత్రులుగా పనిచేసినవారిలో రాజీవ్‌గాంధీ ఐదుసార్లు, పీవీ నరసింహారావు నాలుగు సార్లు, అటల్ బిహారీ వాజపేయీ ఆరుసార్లు, మన్మోహన్ సింగ్ పదిసార్లు ప్రసంగించారు. వీపీ సింగ్, దేవెగౌడ, గుజ్రాల్ ఒక్క పర్యాయమే ఉపన్యసించారు. కాగా, గత ఏడాది మన్మోహన్ సింగ్ పేరిట ఉన్న రికార్డును, ఈ సారి ఇందిర రికార్డును మోదీ వరుసగా ఛేదించడం విశేషం.
ఆకర్షించిన కాషాయ తలపాగా..
వరస్రధారణలో తన బ్రాండ్‌ను చూపించే ప్రధాని మోదీ ఈసారి పంద్రాగస్టు వేడుకల్లో ధరించిన కాషాయ రంగు తలపాగా ఆకర్షణగా నిలిచింది. తెల్ల కుర్తా, చుడీదార్, బంధ్‌గల్ జాకెట్, మెడలో త్రివర్ణ కండువాతో ఈ వేడుకల్లో పాల్గొన్నారు. తలపాగా ధరించి ఎర్రకోటపై దర్శనమివ్వడం ఏటా ఒక సంప్రదాయంగా మోదీ పాటిస్తూ వస్తున్నారు. గత ఏడాది రాజస్థానీ లెహెరియా తలపాగాను ఆయన ధరించారు. సామాన్యులుగా కనిపిస్తూ అసామాన్య సేవలను, నైపుణ్యాన్ని దేశాన్ని అందిస్తున్న ఐదువేలమంది ప్రత్యేక అతిథులుగా పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, లఖ్‌పతి దీదీల నుంచి పలు పంచాయతీలకు చెందిన సర్పంచులు వరకు.. ఈ వేడుకలకు హాజరయ్యారు. అలాగే.. ప్రత్యేక ఒలింపిక్ క్రీడలకు ఎంపికైన క్రీడాకారులు, అంతర్జాతీయ క్రీడల్లో పతకాలు సాధించిన విజేతలు, ఖేలో ఇండియా పారా గేమ్స్ బంగారు పతక గ్రహీతలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఔషధ మొక్కలను పెంచుతున్న రైతులను ఈసారి ప్రత్యేకంగా ఆహ్వానించారు.
Updated Date - Aug 16 , 2025 | 02:41 AM