Maoist Ceasefire: నెల రోజులైనా కాల్పుల విరమణ పాటించండి
ABN, Publish Date - Apr 19 , 2025 | 03:11 AM
బస్తర్‌లో హింస ఆపేందుకు నెల రోజుల కాల్పుల విరమణకు మావోయిస్టులు పిలుపునిచ్చారు. చర్చల కోసం భద్రత హామీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు
బస్తర్‌లో హింసను ఆపండి.. మావోయిస్టు పార్టీ లేఖ
చర్ల, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): దండకారణ్యంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తాము కనీసం నెల రోజుల పాటు ఇరువైపుల నుంచి కాల్పుల విరమణ కోరుకుంటున్నామని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ నార్త్, వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో ప్రతినిధి రూపేష్ పేరిట శుక్రవారం ఓ లేఖ విడుదలైంది. ఆ లేఖ ప్రకారం.. ఏప్రిల్ 8న తామిచ్చిన మొదటి ప్రకటనపై స్పందించిన ఛత్తీస్‌గఢ్ ఉపముఖ్యమంత్రి విజయశర్మకు మావోయిస్టు పార్టీ తరఫున రూపేష్ ధన్యవాదాలు తెలియజేశారు. కగార్ పేరుతో జరుగుతున్న మారణకాండ చర్చల వల్లే ఆగుతుందని పేర్కొన్నారు. ఇదే అంశంపై తాము విడుదల చేసిన తొలి లేఖ వెనక ఎలాంటి వ్యూహం లేదని స్పష్టం చేశారు. సమస్యను పరిష్కరించడానికి తమ సహచరులు.. సెంట్రల్ కమిటీ, ప్రత్యేక జోనల్ కమిటీలోని సభ్యులను కలవాల్సిన అవసరం ఉందని తెలిపారు. చర్చల్లో ప్రాతినిధ్యం వహించే ప్రతినిధి బృందంతో పాటు సహచరులను కలవడానికి తమకు భద్రత హామీ అవసరమని వివరించారు. ఇందుకు గాను సాయుధ బలగాల కార్యకలాపాలను నెల రోజుల పాటు నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. చర్చల సమయంలో ప్రభుత్వ సాయుధ బలగాలపై కాల్పులు జరపవద్దని తమ సహచరులకు ఇప్పటికే సూచించామని, ప్రభుత్వం కూడా స్పందించి కాల్పులు విరమణ పాటించాలని, బస్తర్‌లో హింసను ఆపాలని కోరారు. దాడి చెయ్యొద్దని తాము తమ బలగాలను ఆదేశిస్తూ లేఖ విడుదల చేసిన తర్వాత కేంద్ర బలగాలు ఎన్‌కౌంటర్లు చేశాయని ఆరోపించారు. మారణకాండ కొనసాగితే చర్చలు సాఫీగా సాగవని, సమస్యల శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఉపముఖ్యమంత్రి విజయశర్మను కోరారు.
Updated Date - Apr 19 , 2025 | 03:11 AM