Bengali discrimination: మమత హిమంత మాటల యుద్ధం
ABN, Publish Date - Jul 20 , 2025 | 06:26 AM
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మల మధ్య శనివారం మాటల మంటలు చెలరేగాయి. బెంగాలీ మాట్లాడేవారి పట్ల అస్సాంలో వివక్ష చూపుతున్నారని...
న్యూఢిల్లీ, జూలై 19: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మల మధ్య శనివారం మాటల మంటలు చెలరేగాయి. బెంగాలీ మాట్లాడేవారి పట్ల అస్సాంలో వివక్ష చూపుతున్నారని, బీజేపీ ప్రభుత్వం విభజన అజెండాను అమలు చేస్తోందని మమత విమర్శలు గుప్పించగా.. తమ సొంత ప్రజలపై తాము యుద్ధం చేయబోమని హిమంత అన్నారు. కానీ, అడ్డుఅదుపు లేని ముస్లింల చొరబాట్లను అడ్డుకుంటున్నామని చెప్పారు. సరిహద్దు రాష్ట్రం నుంచి పెరుగుతున్న చొరబాట్ల కారణంగా అస్సాంలో జనాభా లెక్కతప్పుతోందన్నారు. అస్సాంలోని అనేక జిల్లాల్లో హిందువులు మైనారిటీలుగా మారే ప్రమాదం ఏర్పడిందని తెలిపారు. తొలుత ఎన్నార్సీకి వ్యతిరేకంగా బెంగాల్‌లోని సిలిగుడిలో శనివారం అధికార టీఎంసీ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్‌టీటీయూసీ చేపట్టిన నిరసనను ఉద్దేశించి సీఎం మమత స్పందించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీ మాట్లాడే పౌరులపై దాడులు జరుగుతున్నాయని, అస్సాంలో బెంగాలీ మాట్లాడేవాళ్లను వేధిస్తే ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుందని అన్నారు. మమత ఆరోపణలపై హిమంత కూడా అంతే వేగంగా స్పందించారు. సుదీర్ఘకాలంగా తమ రాష్ట్రం భాష, సంస్కృతుల పట్ల సామరస్యంగా మెలుగుతోందని తెలిపారు. కానీ, సరిహద్దులు, రాష్ట్ర సంస్కృతిని కాపాడుకునే విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ రాజీపడేది లేదని స్పష్టం చేశారు. రాజ్యాంగం, జనాభా అంశాలను మమత రాజకీయం చేస్తూ బెంగాల్ భవిష్యత్తుతో రాజీపడుతున్నారని ఆయన దుయ్యబట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రభుత్వ బడుల్లో నో వేకెన్సీ పరిస్థితి తేవాలి
Read latest AP News And Telugu News
Updated Date - Jul 20 , 2025 | 06:26 AM