Share News

Political Clash: తాడిపత్రిలో టెన్షన్‌ టెన్షన్‌

ABN , Publish Date - Jul 19 , 2025 | 06:29 AM

అనంతపురం జిల్లా తాడిపత్రిలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఎలాగైనా తాడిపత్రి తీసుకురావడానికి వైసీపీ నాయకత్వం తాజాగా వేసిన ఎత్తు చిత్తయింది.

Political Clash: తాడిపత్రిలో టెన్షన్‌ టెన్షన్‌

  • అడుగుపెట్టేందుకు పెద్దారెడ్డి యత్నం.. అడ్డుకున్న జేసీ వర్గం

  • ‘రీకాల్‌ చంద్రబాబు మేనిఫెస్టో’ పేరుతో ఆ పార్టీ కార్యాలయంలో సమావేశం

  • స్వగ్రామం తిమ్మంపల్లి నుంచి తాడిపత్రి బయల్దేరిన పెద్దారెడ్డిని అక్కడే అడ్డుకున్న పోలీసులు

  • వైసీపీ సమావేశానికి ఆయన కోడలు హాజరు

  • దీంతో అక్కడకు వెళ్లేందుకు జేసీ ప్రభాకర్‌రెడ్డి,ప్రయత్నం.. వారించిన పోలీసులు

  • పెద్దారెడ్డి కోడలిని పంపించివేయడంతో శాంతించిన టీడీపీ శ్రేణులు

తాడిపత్రి/యల్లనూరు, జూలై 18 (ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా తాడిపత్రిలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఎలాగైనా తాడిపత్రి తీసుకురావడానికి వైసీపీ నాయకత్వం తాజాగా వేసిన ఎత్తు చిత్తయింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి నేతృత్వంలో శుక్రవారం ‘రీకాల్‌ చంద్రబాబు మేనిఫెస్టో’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జడ్పీ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ, మాజీ మంత్రి శైలజనాథ్‌తో పాటు ముఖ్యనేతలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వచ్చేందుకు పెద్దారెడ్డి విశ్వప్రయత్నాలు చేశారు. స్వగ్రామమైన యల్లనూరు మండలం తిమ్మంపల్లి నుంచి ఆయన తాడిపత్రికి బయల్దేరడానికి సిద్ధమవగా.. పోలీసులు అడ్డుకున్నారు. తాడిపత్రి రూరల్‌ డీఎస్పీ వెంకటేశ్వర్లు సిబ్బందితో తిమ్మంపల్లి చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, పెద్దారెడ్డి అనుచరుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయినా పోలీసులు శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందంటూ పెద్దారెడ్డిని తాడిపత్రికి వెళ్లనివ్వలేదు. ఆయనకు నోటీసులు ఇచ్చి ఇంట్లోకి పంపించారు. బయటకురాకుండా గృహనిర్బంధం చేశారు. పోలీసుల తీరుపై పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ప్రతిసారీ అడ్డుకుంటే ఇకపై తిమ్మంపల్లిలో ఉండనని, యల్లనూరు పోలీసుస్టేషన్‌లోనే ఉంటానని, అక్కడే పడుకుంటానని వ్యాఖ్యానించారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎమ్మెల్యే హోదాలో పెద్దారెడ్డి.. తాడిపత్రిలోని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటిపై దాడి చేశారు. ఆయన ఇంట్లోకి వెళ్లి కుర్చీలో కూర్చుని వచ్చారు. ఆ ఘటనను ప్రభాకర్‌రెడ్డి తీవ్రంగా పరిగణించారు. అప్పటి నుంచి ఇరు వర్గాల మధ్య పోరు కొనసాగుతోంది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక పెద్దారెడ్డి పలుమార్లు తాడిపత్రి రావాలని చూశారు. ఏ పరిస్థితుల్లోనూ ఆయన్ను అడుగుపెట్టనివ్వబోమని ప్రభాకర్‌రెడ్డి భీష్మించుకుని కూర్చున్నారు. కోర్టు ఆదేశాలున్నా.. శాంతిభద్రతల నేపథ్యంలో పోలీసులు పెద్దారెడ్డిని అడ్డుకుంటూ వస్తున్నారు.


శుక్రవారం అదే పునరావృతమైంది. పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే.. అడ్డుకుంటామని జేసీతోపాటు ఆయన వర్గీయులు ముందే అల్టిమేటం జారీ చేశారు. అనుచరులు, టీడీపీ శ్రేణులు వందలాదిగా జేసీ ఇంటి వద్ద గుమిగూడారు. వైసీపీ ముఖ్యనేతల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘రీ కాల్‌ చంద్రబాబు మేనిఫెస్టో’ సమావేశానికి పెద్దారెడ్డి కోడలు హర్షితారెడ్డి హాజరుకావడాన్ని వారంతా తీవ్రంగా పరిగణించారు. భేటీ జరుగుతున్న వైసీపీ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రభాకర్‌రెడ్డి, ఆయన అనుచరులు సిద్ధమయ్యారు. దీంతో ఎప్పుడేం జరుగుతుందోనన్న భయాందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే అటువైపు వెళ్లకుండా పోలీసులు వారిని అడ్డుకున్నారు. హర్షితారెడ్డిని తాడిపత్రి నుంచి పంపించేస్తామని హామీ ఇచ్చారు. కొద్దిసేపటికే ఆమెను పంపించారు కూడా. టీడీపీ శ్రేణులు అక్కడితో శాంతించారు. కాగా.. ‘రీకాల్‌ చంద్రబాబు మేనిఫెస్టో’ సమావేశంలో వైసీపీ నాయకులు జేసీ ప్రభాకర్‌రెడ్డి పేరెత్తలేదు. చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు, పోలీసులపై ఆరోపణలతో సరిపెట్టారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది.


వైసీపీ కార్యాలయంలో మందు బాటిళ్లు..

వైసీపీ సమావేశం ముగిశాక ఆ పార్టీ కార్యాలయానికి మున్సిపల్‌ చైర్మన్‌ హోదాలో జేసీ ప్రభాకర్‌రెడ్డి వెళ్లారు. అక్కడ చెత్తాచెదారం, మద్యం బాటిళ్లు చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రికి గ్రీన్‌ సిటీ అనే పేరు ఉందని, అలాంటి పట్టణానికి వచ్చి తిని, తాగి పడేసిపోతే చెత్తను ఎవరు ఎత్తేస్తారని వైసీపీ నాయకుల తీరుపై మండిపడ్డారు. ‘మీరు వేసిన చెత్త వాసన వస్తోందని యాక్సిస్‌ బ్యాంకు వాళ్లు ఫిర్యాదు చేశారు. ఇక్కడకు మందు బాటిళ్లు, చెత్త కనిపిస్తున్నాయి. మీటింగ్‌కు వచ్చారా.. తిని, తాగడానికి వచ్చారా? అనంత వెంకటరామిరెడ్డీ.. తాడిపత్రి నా జాగీరు కాదు.. కానీ ఇది నా ఊరు. మీరు వచ్చి ఏదో చేయాలనుకుంటే కుదరదు. అనంతపురంలో డంపింగ్‌ యార్డు తీసివేయడానికి రూ.24 కోట్లు ఖర్చుపెట్టారు. అయినా వాసన పోలేదు. వైసీపీ హయాంలో తాడిపత్రి డంపింగ్‌ యార్డు తీసివేయడానికి రూ.10 కోట్లు కేంద్రం నుంచి వచ్చినా వాడుకోలేదు. తాడిపత్రిని కూడా అనంతపురంలాగే చేయాలనుకుంటున్నారా..’ అని ప్రశ్నించారు.

Updated Date - Jul 19 , 2025 | 06:33 AM