నీట్-యూజీ ఫలితాల విడుదలకు మార్గం సుగమం
ABN, Publish Date - Jun 07 , 2025 | 06:06 AM
నీట్-యూజీ 2025 పరీక్ష ఫలితాల విడుదలకు మార్గం సుగమమైంది. ఫలితాలు ప్రకటించకుండా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)ని నిరోధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను మద్రాస్ హైకోర్టు శుక్రవారం కొట్టేసింది.
చెన్నై, జూన్ 6: నీట్-యూజీ 2025 పరీక్ష ఫలితాల విడుదలకు మార్గం సుగమమైంది. ఫలితాలు ప్రకటించకుండా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)ని నిరోధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను మద్రాస్ హైకోర్టు శుక్రవారం కొట్టేసింది. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర యూజీ వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 4న నీట్ యూజీ పరీక్షను నిర్వహించారు. పరీక్ష జరుగుతున్న సమయంలో చెన్నైలోని నాలుగు కేంద్రాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఇబ్బందిపడిన తమకు మళ్లీ పరీక్ష నిర్వహించేలా ఎన్‌టీఏను ఆదేశించాలని కోరుతూ ఎస్ సాయిప్రియ, మరో 15మంది విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు.
ఈ వ్యాజ్యాలను విచారించిన మద్రాసు హైకోర్టు... దాదాపు 22లక్షల మంది విద్యార్థులు నీట్-యూజీ రాశారని, చిన్నచిన్న కారణాలతో మరోసారి పరీక్ష నిర్వహణకు అనుమతిస్తే 20లక్షల మందికి పైగా అభ్యర్థులపై ప్రభావం పడుతుందని పేర్కొంది. పరీక్షను మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య నిర్వహించారని, ఆ సమయంలో విద్యుత్తు లేకపోయినా సహజంగా వెలుతురుగానే ఉంటుందని అడిషనల్ సొలిసిటర్ జనరల్ చేసిన వాదనలతో ఏకీభవించింది.
Updated Date - Jun 07 , 2025 | 06:06 AM