Minister Vijay Shah - SIT: మహిళా సైనికాధికారిపై వివాదాస్పద వ్యాఖ్యలు.. మధ్యప్రదేశ్ మంత్రిపై సిట్ ఏర్పాటు
ABN, Publish Date - May 20 , 2025 | 01:54 PM
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మధ్యప్రదేశ్ పోలీసులు మంత్రి విజయ్ షాపై దర్యాప్తునకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు.
మహిళా సైనికాధికారి కల్నల్ సోఫియా ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షాపై దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ సెట్‌లో ముగ్గురు సభ్యులున్నారు. మంత్రి వ్యాఖ్యలపై విచారణ జరపనున్న సిట్ మే 28 నాటికి నివేదిక సమర్పించనుంది.
సిట్‌ను ఏర్పాటు చేస్తూ మధ్యప్రదేశ్ డీజీపీ ప్రకటన విడుదల చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఐజీ ప్రమోద్ వర్మ, డీఐజీ కళ్యాణ్ చక్రవర్తి, ఎస్పీ వాహినీ సింగ్‌లతో సిట్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రమోద్ వర్మ ప్రస్తుతం సాగర్ రేంజ్ ఐజీగా ఉన్నారు. కళ్యాణ్ చక్రవర్తి ఎస్ఏఎఫ్ డీఐజీగా ఉన్నారు. వాహినీ సింగ్ డిండోరీ ఎస్పీగా ఉన్నారు.
కల్నల్ ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు మంత్రి విజయ్ షాపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన క్షమాపణలను అంగీకరించేది లేదని స్పష్టం చేసింది. అరెస్టు నుంచి ఉపశమనం కలిగించిన సుప్రీం కోర్టు.. పరిణామాలు తప్పవని హెచ్చరించింది.
ఆపరేషన్ సిందూర్‌లో ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన అనంతరం, ఈ నెల 12వ తేదీన మంత్రి విజయ్‌షా ఓ సభలో మాట్లాడుతూ.. పాకిస్థాన్ పని పట్టేందుకు ప్రధాని మోదీ ‘అక్కడున్న వారి మతానికి’ చెందిన మహిళనే పంపించారంటూ.. కల్నల్ సోషియా ఖురేషీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మంత్రి వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయన్న సుప్రీం కోర్టు.. కల్నల్ సోఫియా ఖురేషీకి క్షమాపణలు చెప్పాలని గత గురువారం ఆదేశించింది. సోమవారం విచారణ సందర్భంగా మంత్రి క్షమాపణలు చెప్పిన తీరుపై కోర్టు ఆగ్రహించింది.
‘‘కోర్టు కోరింది కాబట్టి క్షమాపణ చెబుదామన్నట్టు మీ వైఖరి ఉంది. చేసిన పిచ్చి వ్యాఖ్యలకు నిజాయితీగా క్షమాపణ అడగడానికి మీకు ఏం అడ్డుపడుతోంది?’’ అని జస్టిస్ సూర్యకాంత్ నిలదీశారు. మంత్రి వ్యాఖ్యలతో దేశం సిగ్గుతో తల దించుకుందని మండిపడ్డారు.
ఇవీ చదవండి:
ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెబుతూ ఎంపీ శశి థరూర్ లేఖ
ట్రంప్ తన పంతం నెగ్గించుకుంlటే.. భారత్‌కు ఏటా 18 బిలియన్ డాలర్ల నష్టం
పాక్ చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు.. తుర్కియేకు అసదుద్దీన్ ఒవైసీ సూచన..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 20 , 2025 | 02:04 PM