Trump Remittance Tax: ట్రంప్ తన పంతం నెగ్గించుకుంటే.. భారత్‌కు ఏటా 18 బిలియన్ డాలర్ల నష్టం
ABN , Publish Date - May 18 , 2025 | 08:51 PM
విదేశాలకు తరలించే నిధులపై పన్ను విధించేందుకు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన ప్రవేశపెట్టిన బిల్లు అమల్లోకి వస్తే భారత్‌కు ఏటా 18 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా సంపద మొత్తం ప్రపంచదేశాలు తరలించుకుపోతున్నాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావన. ఈ క్రమంలో సుంకాల ఆయుధం ప్రయోగించారు. రకరకాల కారణాలతో వెనక్కు తగ్గారు. వాణిజ్యంపై ఇప్పుడు ప్రపంచం దేశాలతో అమెరికా చర్చలు జరుపుతోంది. ఇక అమెరికాలో ఉద్యోగాలు చేసే విదేశీయులు సొంత దేశాలకు డబ్బు తరలించుకుపోకుండా మరో బిల్లు తీసుకొచ్చారు. సొంత దేశాలకు తరలించే డబ్బుపై 5 శాతం పన్ను విధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది కార్యరూపం దాలిస్తే భారత్‌కు నష్టం తప్పదని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ ప్రతినిధులు తమ అధ్యయనంలో పేర్కొన్నారు.
వివిధ దేశాల్లోని భారతీయులు ఏటా 120 బిలియన్ డాలర్లు భారత్‌కు రెమిటెన్స్ రూపంలో పంపిస్తున్నారు. ఇందులో అమెరికా నిధుల వాటా 28 శాతం. ఈ మొత్తంపై అమెరికా ప్రభుత్వం 5 శాతం పన్ను విధిస్తే భారత్ ఏటా 12 నుంచి 18 బిలియన్ డాలర్ల వరకూ నష్టపోవాల్సి ఉంటుంది.
ఎన్నారైలు పంపించే నిధులపై ఎక్కువగా ఆధారపడే యూపీ, బీహార్, కేరళ రాష్ట్రాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అనేక కుటుంబాలు ఈ డబ్బుతోనే విద్య, ఆరోగ్యం, సొంతిళ్లు వంటి అవసరాలను తీర్చుకుంటున్నారు. ట్రంప్ ప్రకటించిన రెమిటెన్స్ సుంకం అమెరికాలోని విదేశీయులందరికీ వర్తిస్తుంది. అంటే, హెచ్-1బీ వీసాతో పాటు గ్రీన్ కార్డు పొందిన వారు కూడా భారత్‌కు డబ్బు పంపించేందుకు 5 శాతం చార్జి చెల్లించుకోక తప్పదు.
ట్రంప్ ప్రవేశపెట్టిన ఈ బిల్లు అమల్లోకి వస్తే భారత ఫారెక్స్ నిల్వలపై కూడా ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. డాలర్ల రాక పడిపోయి రూపాయి విలువ తగ్గే అవకాశం కూడా ఉందని అంటున్నారు. చివరకు కరెన్సీ స్థిరీకరణ కోసం ఆర్‌బీఐ రంగంలోకి దిగాల్సి రావొచ్చని అంచనా వేస్తున్నారు.
వివిధ దేశాల మధ్య నగదు బదిలీ మరింత సరళతరం చేసేందుకు భారత్ ఇప్పటికే డబ్ల్యూటీఓ ద్వారా పలు ప్రయత్నాలు చేస్తోంది. ట్రంప్ తాజా చర్య భారత్ ప్రయత్నాలకు అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ట్రంప్ చర్యల ప్రభావం మధ్యతరగతి వారిపై అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అల్పాదాయ దేశాల్లో వస్తువులకు డిమాండ్ తగ్గే అవకాశాలు కూడా లేకపోలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి:
పాక్ చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు.. తుర్కియేకు అసదుద్దీన్ ఒవైసీ సూచన..
మానవాళికి ముప్పుగా మారిన పాక్.. నిప్పులు చెరిగిన ఒవైసీ
భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..
ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి