ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మృత్యువుకే ఫ్లయింగ్‌ కిస్‌..

ABN, Publish Date - Jun 29 , 2025 | 12:07 PM

ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం యావత్‌ ప్రపంచాన్ని విషాదంలోకి నెడితే... మృత్యుంజయుడిగా నిలిచిన ‘ఒకే ఒక్కడు’ విశ్వాస్‌ కుమార్‌ రమేష్‌ అందర్నీ ఆశ్చర్యపరిచారు.

ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం యావత్‌ ప్రపంచాన్ని విషాదంలోకి నెడితే... మృత్యుంజయుడిగా నిలిచిన ‘ఒకే ఒక్కడు’ విశ్వాస్‌ కుమార్‌ రమేష్‌ అందర్నీ ఆశ్చర్యపరిచారు.

విమానంలోని అందరూ మరణించి, ఇలా ఒకే ఒక్కడు బతకడం ఓ మిరాకిల్‌. ప్రపంచవ్యాప్తంగా ఇంతకుముందు కూడా కొన్ని విమాన ప్రమాదాలు జరిగాయి. వాటిలో అందరూ చనిపోయి విచిత్రంగా ఒక్కరే బయటపడ్డ సందర్భాలు లేకపోలేదు. అలాంటి కొందరు అదృష్టవంతుల ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే...

‘11ఎ’ కాపాడింది...

అహ్మదాబాద్‌లో ఇటీవల ప్రమాదానికి గురైన ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదంలో చిన్న దెబ్బలతో బయటపడ్డ విశ్వా్‌స్‌ కుమార్‌ రమేష్‌ సీట్‌ నెంబరు 11ఎ. అత్యవరసర ద్వారం పక్కనే ఈ సీట్‌ ఉంది. అమితాశ్చర్యం కలిగించేలా 27 ఏళ్ల క్రితం విమానంలో అదే సీట్లో కూర్చుని ప్రమాదం నుంచి బయటపడ్డాడు ఓ వ్యక్తి. అతడే థాయిలాండ్‌కు చెందిన పాప్‌స్టార్‌ రువాంగ్‌సక్‌ లోయ్‌ఛుసక్‌.

1998లో థాయి ఎయిర్‌వేస్‌ విమానంలో ఆయన బ్యాంకాక్‌ నుంచి సూరత్తనికి వెళుతున్నాడు. విమానంలోని 101 మంది ప్రయాణికులు మరణించారు. కొందరు మాత్రమే బతికారు. వాళ్లలో రువాంగ్‌సక్‌ ఒకరు. ‘నేడు విశ్వాస్‌ సీట్‌ నెంబరు కూడా నాదే అని తెలిసి, ఒళ్లు గగుర్పాటుకు లోనయ్యింది. నాటి ప్రమాదం తరవాత పదేళ్ల వరకు నేను విమానం ఎక్కలేదు. ఇప్పటికీ నల్లమబ్బులు, భీకర వర్షం కురుస్తుంటే నాకు భయమేస్తుంది. ఆనాటి విమాన శబ్దాలు, అరుపులు ఇంకా గుర్తున్నాయ’ని చెబుతారు రువాంగ్‌సక్‌.

ప్రమాదం... టాటూగా...

‘ఆరోజు, ఆ విమానం, ఆ మంటల్ని మరచిపోయింది లేదు. రోజూ గుర్తుకు వస్తుంటాయి, అసలు నేనెందుకు బతికాను, మా అన్నయ్య బతికి ఉండవచ్చు కదా, మరెవరైనా బతకాల్సింది. నేనే ఎందుకు? ఈ అపరాధభావం జీవితాంతం నన్ను వెంటాడుతూనే ఉంటుంది’ అంటారు సెసిలియా. 1987లో అమెరికాకు చెందిన ‘నార్త్‌వెస్ట్‌’ ఎయిర్‌లైన్స్‌ విమాన ప్రమాదంలో 148 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో పాటు నేల మీద ఉన్న ఇద్దరు మరణించారు. ఆ ప్రమాదంలో ఆశ్చర్యంగా నాలుగేళ్ల సెసిలియా సిచెన్‌ మాత్రమే ప్రాణాలతో బయటపడింది.

ఆ ప్రమాదంలో పాప అమ్మానాన్న, ఆరేళ్ల అన్నయ్య కూడా మరణించారు. ఆరిజోనాలోని టెంపేకి చెందిన వీళ్లంతా టెక్సాస్‌కు వెళ్లి వస్తూ ప్రమాదానికి గురయ్యారు. ఆ చిరంజీవిని వెంటనే వాళ్ల ఆంటీ, అంకుల్‌ అలబామా తీసుకువెళ్లి, మీడియాకు చిక్కకుండా పెంచారు. అక్కడే ఆమె చదువూ, పెళ్లీ అయ్యాయి. 2013లో విమాన ప్రమాదం జరిగిన 26 ఏళ్ల తరవాత... ‘సోల్‌ సర్వైవర్‌’ అనే డాక్యుమెంటరీ కోసం సెసిలియా బయటికి వచ్చి, తన వేదనను తెలియజేశారు. ప్రమాదం జరిగిన రోజుకు గుర్తుగా ఎడమ చేతి మణికట్టు దగ్గర విమానం పచ్చబొట్టు వేయించుకున్నారామె. ‘నేను అక్కడి నుంచే వచ్చానన్నది ఈ టాటూ గుర్తుచేస్తుంటుంద’ని అంటారు సెసిలియా.

ఆకాశం నుంచి ఊడిపడ్డా...

పదిహేడేళ్ల యువతి, వాళ్ల అమ్మతో కలిసి నాన్న దగ్గరకి విమానంలో వెళుతోంది. కిటికీ పక్క సీటు ఆమెది. మేఘాలను చూస్తూ సాండ్విచ్‌ ఆరగిస్తోంది. ఒక్కసారిగా బయట చీకటి పరచుకుంది. పేద్ద ధ్వనితో ఉరుము విమాన రెక్కను తాకింది. అంతే విమానం ముక్కలైంది. ఈ అమ్మాయి సీట్‌తో పాటు 3 వేల మీటర్ల పై నుంచి కింద పడి, స్పృహ కోల్పోయింది. మెలకువ వచ్చాక చూస్తే మెడ ఎముక విరిగి పోయింది. దట్టమైన అమెజాన్‌ అడవుల్లో చిక్కినట్టుగా అర్థం చేసుకుంది. ఎలాగోలా సత్తువ తెచ్చుకుని, తిండీ తిప్పలూ లేకుండా, దారీ తెన్నూ తెలీయకుండా 11 రోజులు ఆ అడవిలో నడుస్తూ ఆఖరికి కొందరు మత్స్యకారుల్ని చూడగలిగింది.

ఆమే జులియేన్‌ కోయెప్కా. 1971 డిసెంబరులో పెరూలోని లీమా నుంచి పుకాల్పాకు వెళుతోన్న వాళ్ల విమానం కూలిపోయింది. అందులోని 92 మందిలో జులియేన్‌ ఒక్కతే ప్రాణాలతో బయటపడింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఆ టీనేజ్‌ అమ్మాయి జీవితంలోని ఆ సంఘటన ఆధారంగా 1974లో ‘మిరాకిల్స్‌ స్టిల్‌ హ్యాపెన్‌’ అనే హాలీవుడ్‌ చిత్రం తీశారు. తరవాత ఎన్నో డాక్యుమెంటరీలు, నవలలూ వచ్చాయి.

అతడి పేరుతో నవల

పన్నెండున్నరేళ్ల వివాహ మహోత్సవాన్ని పెద్ద సంబరంగా జరుపుకోవడం డచ్‌వాసులకు ఒక సంప్రదాయం. నెదర్లాండ్స్‌కు చెందిన వాన్‌ ఆస్సౌ కుటుంబం ఆ వేడుకల కోసం 2010లో దక్షిణాఫ్రికాకు వెళ్లి, తిరిగి వస్తుంటే లిబియాలో వాళ్లు ప్రయాణిస్తున్న విమానం కూలిపోయింది. ఆ ప్రమాదంలో తొమ్మిదేళ్ల బాలుడు తప్ప మిగతా 103 మంది ప్రయాణికులు, విమాన సిబ్బంది మరణించారు. ఆ బాలుడే రూబేన్‌ వాన్‌ ఆస్సౌ. విమాన సీట్లోనే ఇరుక్కుపోయిన బాలుడిని రక్షించి ఆస్పత్రికి తరలించి, అనేక శస్త్రచికిత్సలు చేశారు.

తల్లిదండ్రులు, అన్నయ్యను కోల్పోయిన రూబేన్‌ను దగ్గరి బంధువులు చేరదీసి పెంచారు. అతడి స్ఫూర్తితో ‘డియర్‌ ఎడ్వర్డ్‌’ అనే నవల వచ్చింది. ఆ తరవాత అదే పేరుతో టీవీ సిరీస్‌ కూడా రూపొందించారు. అయితే రూబేన్‌ను మీడియా ముందుకు తీసుకురాకుండా జాగ్రత్తపడ్డారు. అందుకే ఈ నవలలో ఆ చిన్న పిల్లాడి యాతన అంతా కల్పితమేనని అంటారు రచయిత్రి నపోలితానో.

మిరాకిల్‌ గర్ల్‌

2009... పన్నెండేళ్ల బహియా బకరీ, తల్లితో కలిసి సెలవుల్లో విహారానికి కామరూస్‌కి ప్రయాణమైంది. విమానం గమ్యానికి చేరుకోకముందే హిందూ మహాసముద్రంలో పడిపోయింది. విమానంలోని 152 మంది మృత్యువాత పడ్డారు. బకరీ మాత్రం విమాన శకటాలకు వేలాడుతూ సముద్రంలోని గడ్డకట్టే నీళ్లలో ఉండిపోయింది. అలా తొమ్మిది గంటలు గడిచాక సహాయక బృందం ఆమెని రక్షించి, ప్యారిస్‌లోని తండ్రి దగ్గరకి పంపారు. ఎన్నో శస్త్రచికిత్సల తరవాత మామూలు స్థితికి చేరుకుంది బకరీ. ఆమెను అందరూ ‘మిరాకిల్‌ గర్ల్‌’గా పిలవడం మొదలుపెట్టారు. 2010లో ఫ్రెంచ్‌ జర్నలిస్ట్‌తో కలిసి ‘మోయి బహియా, లా మిరాకులీ (ఐయామ్‌ బహియా, ది మిరాకిల్‌ గర్ల్‌’)’ పేరున తన జ్ఞాపకాలపై ఓ పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకం ఆధారంగా ఆమె జీవితాన్ని తెరకెక్కించాలని ప్రసిద్ధ దర్శకుడు స్టీవెన్‌ స్పీల్‌బెర్గ్‌ బహియాను సంప్రదిస్తే, ఆమె తోసిపుచ్చిందని అంటారు.

ఆరోజు ఏమైంది?

‘నువ్వు ఎలా బయటపడ్డావ్‌? ‘అంతమందిలో నువ్వొక్కడవే అంటే ఎలా నమ్మగలం’, ‘ఆ విమానానికి కో పైలట్‌ కాబట్టి, ఇతడే ఏదో కుట్ర పన్నాడు’ అంటూ కోర్టులకెక్కిన వాళ్లూ లేకపోలేదు. అతడే జేమ్స్‌ పోలెహింకే. 2006లో అమెరికాలోని కెంటకీ నుంచి అట్లాంటాకు వెళుతోన్న విమానం కూలిపోయింది. అందులో ఉన్న మొత్తం 50 మందిలో 49 మంది మరణించారు. కోపైలెట్‌ జేమ్స్‌ మాత్రం బతికి బయటపడ్డాడు. అయితే అతడు ప్రమాదంలో ఎడమ కాలును కోల్పోవాల్సి వచ్చింది. అయినా కూడా ఆ విమాన ప్రమాదానికి అతడే కారణం అంటూ మరణించిన వాళ్ల బంధువులు జేమ్స్‌పై ఎన్నో కేసులు పెట్టారు. అతడు చాలా ఇన్వెస్టిగేషన్స్‌ ఎదుర్కొన్నాడు. అనేక సంజాయిషీలు ఇచ్చుకున్నాడు. అయితే చివరికి అతడు నిర్దోషని తేలింది.

Updated Date - Jun 29 , 2025 | 12:07 PM