India Longest Freight Train: 7 ఇంజిన్లు.. 354 వ్యాగన్లు
ABN, Publish Date - Aug 10 , 2025 | 03:07 AM
భారతీయ రైల్వే అరుదైన రికార్డు సృష్టించింది. ఏకంగా 7 ఇంజన్లు.. 354 వ్యాగన్లతో దేశ చరిత్రలోనే
దేశంలోనే అత్యంత పొడవైన గూడ్స్ రైలు
‘రుద్రాస్త్ర’.. 4.5 కిలోమీటర్ల పొడవు
ప్రారంభించిన భారతీయ రైల్వే
ఐదు గంటల్లో 200 కి.మీ. ప్రయాణం
న్యూఢిల్లీ, ఆగస్టు 9: భారతీయ రైల్వే అరుదైన రికార్డు సృష్టించింది. ఏకంగా 7 ఇంజన్లు.. 354 వ్యాగన్లతో దేశ చరిత్రలోనే అత్యంత పొడవైన గూడ్స్ రైలు విజయవంతంగా పట్టాలెక్కింది. ‘రుద్రాస్త్ర’గా నామకరణం చేసిన ఈ రైలును తూర్పు మధ్య రైల్వే (ఈసీఆర్) పరిధిలోని గ్రాండ్ కోర్డ్ రైల్ సెక్షన్‌లో ప్రారంభించారు. దీని పొడవు 4.5 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఆరు బాక్సన్ ర్యాక్ (వ్యాగన్ల శ్రేణి)లను అనుసంధానించడం ద్వారా దీన్ని రూపొందించారు. ముందు ఒక లోకోమోటివ్.. తర్వాత మధ్యమధ్యలో మరో ఆరు ఇంజన్లు ఏర్పాటు చేసి సమర్థంగా నడిపారు. ఇది ఉత్తరప్రదేశ్‌లోని గంజ్ కవాజా రైల్వే స్టేషన్ నుంచి ఝార్ఖండ్‌లోని గర్హ్వా రోడ్ స్టేషన్ మధ్య పరుగులు తీసి అందరి దృష్టిని ఆకర్షించింది. గంటకు సగటున 40కిలోమీటర్ల వేగంతో 200 కిలోమీటర్ల దూరాన్ని దాదాపు ఐదు గంటల్లో పూర్తిచేసింది. దీనికి సంబంధించిన వీడియోను రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ శుక్రవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘రుద్రాస్త్ర.. భారత అతి పొడవైన గూడ్స్ రైలు’ అని క్యాప్షన్ ఇచ్చారు.
‘రుద్రాస్త్ర’ ప్రత్యేకత ఏంటి?
రుద్రాస్త్ర గూడ్స్ రైలు సరుకు రవాణాలో వేగంతో పాటు సామర్థ్యాన్ని పెంచుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఇందులోని ఆరు ర్యాక్‌లను వేర్వేరుగా నడపడం వలన వాటన్నింటికీ వేర్వేరు మార్గాలు, సిబ్బందిని, షెడ్యూల్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అదే రుద్రాస్త్రగా కలిపి నడపడం వలన సమయం ఆదా అవుతుందని, సిబ్బంది అవసరం, నిర్వహణ వ్యయం తగ్గుతుందని తెలిపారు. మొత్తం మీద భారత రవాణా రంగానికి ‘రుద్రాస్త్ర’ మంచి ఊపునిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా చూస్తే..
‘రుద్రాస్త్ర’ భారత రైల్వే చరిత్రలోనే అతి పొడవైన గూడ్స్ రైలుగా నిలిచింది. అయితే ఈ విషయంలో ప్రపంచ రికార్డు ఆస్ట్రేలియాకు చెందిన బీహెచ్‌పీ కంపెనీ చేతుల్లో ఉంది. ఆ సంస్థ రూపొందించిన రైలు 7.3 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అందులో 682 వ్యాగన్లు ఉంటాయి. అయినప్పటికీ, భారత రైల్వే సాఽధించిన ఈ సరికొత్త విజయం.. ప్రపంచ స్థాయి సరుకు రవాణా కార్యకలాపాల్లో ఒక కీలక అడుగుగా చెప్పవచ్చు.
Updated Date - Aug 10 , 2025 | 03:07 AM