ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Shubhanshu Shukla: రోదసిలోకి శుభ యాత్ర

ABN, Publish Date - Jun 26 , 2025 | 05:44 AM

భారతీయ వ్యోమగామి రాకేశ్‌ శర్మ రోదసిలో విహరించిన నాలుగు దశాబ్దాల తర్వాత.. మరో భారతీయుడు బుధవారం అంతరిక్షంలోకి దూసుకెళ్లాడు! యాక్సియం-4 మిషన్‌లో భాగంగా..

‘‘నా దేశవాసులారా.. నమస్కారం. 41 సంవత్సరాల తర్వాత మనం రోదసిలోకి మళ్లీ చేరుకున్నాం. ఇదో గొప్ప ప్రయాణం. ప్రస్తుతం మేము సెకనుకు 7.5 కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ తిరుగుతున్నాం. నా భుజాలపై భారత త్రివర్ణ పతాకం ఉంది. అది నేనిక్కడ మీ అందరితోనూ ఉన్నానని చెబుతోంది. ఐఎస్‌‌ఎస్‌ దిశగా ఇది నా ప్రయాణానికి ప్రారంభం మాత్రమే కాదు.. భారతదేశ మానవసహిత రోదసియాత్రకు నాంది కూడా’’

- రోదసి నుంచి శుభాన్షు శుక్లా

  • అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయల్దేరిన శుభాన్షు శుక్లా

  • ప్రారంభమైన ‘యాక్సియం 4’ మిషన్‌.. తొలి అంకం సక్సెస్‌

  • నలుగురు ఆస్ట్రొనాట్లతో భూకక్ష్యలోకి క్రూడ్రాగన్‌ వ్యోమనౌక

  • నేడు సాయంత్రం 4.30 గంటలకు ఐఎ్‌సఎ్‌సతో డాకింగ్‌

  • రాకేశ్‌ శర్మ తర్వాత.. 41 సంవత్సరాలకు అంతరిక్షంలోకి

  • వెళ్లిన మొదటి భారతీయ వ్యోమగామిగా శుభాన్షు చరిత్ర

  • 14 రోజులపాటు అక్కడ పలు ప్రయోగాలు చేసేందుకు సిద్ధం

న్యూఢిల్లీ, జూన్‌ 25: భారతీయ వ్యోమగామి రాకేశ్‌ శర్మ రోదసిలో విహరించిన నాలుగు దశాబ్దాల తర్వాత.. మరో భారతీయుడు బుధవారం అంతరిక్షంలోకి దూసుకెళ్లాడు! యాక్సియం-4 మిషన్‌లో భాగంగా.. భారత వాయుసేన పైలట్‌, గ్రూప్‌ కెప్టెన్‌ శుభాన్షు శుక్లా మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తన ప్రయాణాన్ని ప్రారంభించారు. నిజానికి మే 29వ తేదీన మొదలుకావాల్సిన వారి ప్రయాణం రకరకాల కారణాలతో ఇప్పటికి ఆరుసార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఏడోసారి ఈ ప్రయోగానికి అన్ని సాంకేతిక విఘ్నాలూ తొలగిపోయాయి. దీంతో.. భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12.01 గంటలకు.. ఫ్లోరిడా (అమెరికా)లోని కెనెడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి శుక్లా సహా నలుగురు వ్యోమగాములతో కూడిన ‘క్రూ డ్రాగన్‌’ వ్యోమనౌకను మోసుకుంటూ స్పేస్‌ ఎక్స్‌ ఫాల్కన్‌ రాకెట్‌ నింగిలోకి దూసుకుపోయింది. ఆ తర్వాత కొన్ని నిమిషాల వ్యవధిలోనే వ్యోమనౌక రాకెట్‌ నుంచి విడివడి నిర్దేశిత భూకక్ష్యలోకి చేరింది. నిర్ణీత షెడ్యూ లు ప్రకారం వీరి వ్యోమనౌక.. గురువారం సాయంత్రం 4.30 గంటలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని హార్మోనీ మాడ్యూల్‌తో అనుసంధానం అవుతుంది. దీంతో ఐఎ్‌సఎ్‌సకు వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామిగా కూడా శుక్లా చరిత్ర సృష్టించనున్నారు. కాగా వ్యోమనౌక భూకక్ష్యలోకి ప్రవేశించాక శుభాన్షు శుక్లా భారత పౌరులను ఉద్దేశించి ‘దేశవాసులారా..’ అంటూ మాట్లాడారు. ఇది తన రోదసి యాత్రకు ప్రారంభం మాత్రమే కాదని, భవిష్యత్తులో భారత్‌ చేపట్టబోయే మానవసహిత యాత్రలకు నాంది అని పేర్కొన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరూ తన యాత్రలో భాగం కావాలనుకుంటున్నానన్నారు. ‘‘మనందరం కలిసి భారత అంతరిక్ష కార్యక్రమాన్ని ఆరంభిద్దాం’’ అని పిలుపునిచ్చారు. ప్రయాణానికి ముందు కూడా రోదసిలోకి తనది ఒంటరి ప్రయాణం కాదని, ఇది భారతదేశంలోని 140 కోట్ల మంది ప్రయాణమని తాను విశ్వసిస్తున్నానని శుక్లా తెలిపారు. తన ప్రయాణం దేశంలోని ఒక తరానికి స్ఫూర్తినిస్తుందని భావిస్తున్నట్టు చెప్పారు. కాగా.. భూకక్ష్యలోకి ప్రవేశించిన తర్వాత ఈ మిషన్‌లో పాల్గొంటున్న వ్యోమగాములు తమ వ్యోమనౌక పేరును ‘గ్రేస్‌’గా ప్రకటించారు. ఇక.. శుక్లా తల్లిదండ్రులు లాంచింగ్‌ ప్రక్రియను లఖ్‌నవూలో శుభాన్షు శుక్లా చదువుకున్న సిటీ మాంటెస్సోరీ స్కూల్‌ నుంచి బడి పిల్లలతో కలిసి వీక్షించారు. లాంచింగ్‌కు ముందు శుక్లా తన తల్లిదండ్రులతో వీడియోకాల్‌లో మాట్లాడారు. ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించేముందు పిల్లలకు తల్లిదండ్రులు ‘దహీ చీనీ’ తినిపించడం ఉత్తరాదిన చాలా కుటుంబాల్లో ఆచారంగా పాటిస్తారు. ఈ క్రమంలోనే.. శుక్లా తల్లి ఆయనకు వర్చువల్‌గా దహీ చీనీ (పంచదార కలిపిన పెరుగు) తినిపించారు (వీడియోకాల్‌లో చూపించారు). క్షేమంగా వెళ్లి, విజయం సాధించి తిరిగిరావాలని ఆశీర్వదించారు.

రెండు వారాలు.. 60 ప్రయోగాలు..

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న తర్వాత ఈ నలుగురు వ్యోమగాములూ 14 రోజులపాటు అక్కడే ఉండి 60 ప్రయోగాలు నిర్వహిస్తారు. వాటిలో ఏడు భారతదేశ పరిశోధకులు ఎంపిక చేసినవి (ఇందుకోసం ఇస్రో రూ.500 కోట్లు చెల్లించింది). అందులో ముఖ్యమైనది.. సూక్ష్మ శైవలాల (మైక్రో ఆల్గే)పై భారరహిత స్థితి ప్రభావం, స్పేస్‌ రేడియేషన్‌ ప్రభావాన్ని అంచనా వేసే ప్రయోగం. ఎందుకంటే సూక్ష్మ శైవలాలను అంతరిక్ష ప్రయోగాల్లో ఆక్సిజన్‌ ఉత్పత్తికి ఉపయోగిస్తారు. అలాగే మైక్రో ఆల్గేను పోషకాలు అధికంగా గల ఆహారంగా పరిగణిస్తారు. రోదసిలో ఈ సూక్ష్మ శైవలాల ఆర్‌ఎన్‌ఏలో, ప్రొటీన్లలో, జీవరసాయన చర్యల్లో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయో ఈ పరిశోధనలో భాగంగా అధ్యయనం చేస్తారు. అలాగే సూక్ష్మ గురుత్వాకర్షణ స్థితిలో కండరాల పునరుద్ధరణ, రోదసిలో పెసర, మెంతి సాగు.. రోదసిలో కండరాల క్షీణత పైన, మైక్రో గ్రావిటీలో కంప్యూటర్‌ తెరలను ఎక్కువగా వాడడం వల్ల వ్యోమగాములపై పడే శారీరక, బౌద్ధిక ప్రభావాలపైన పరిశోధనలు చేస్తారు. అత్యంత తీవ్రమైన వాతావరణాన్ని తట్టుకుని సైతం మనుగడ సాగించగలిగే టార్డిగ్రేడ్స్‌ (సూక్ష్మజీవులు) రోదసి వాతావరణంలో ఎలా ఉంటాయో తెలుసుకునేందుకు మరో పరిశోధన చేయనున్నారు. శుక్లా ఈ ప్రయోగాలన్నింటినీ కేంద్రం ఆధ్వర్యంలో మన భారతీయ శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా తయారు చేసిన ఉపకరణాలతోనే చేయనున్నారు. కాగా.. ఆ 14 రోజుల్లో శుభాన్షుతో విద్యార్థుల ప్రశ్నలకు జవాబులు చెప్పించాలని, ప్రధాని మోదీతో కూడా మాట్లాడించాలని ఇస్రో ప్రణాళికలు రచించింది.

ఎవరెవరు?

అమెరికన్‌ వ్యోమగామి, నాసాకు చెందిన పెగ్గీ విట్సన్‌ కమాండర్‌గా ఉండే ఈ మిషన్‌లో శుక్లా పైలట్‌గా వ్యవహరిస్తారు. వీరితోపాటు పోలండ్‌కు చెందిన స్లావోష్‌ ఊజ్‌నైన్‌స్కీ, హంగరీకి చెందిన టిబోర్‌ కాఫూ ఈ బృందంలో ఉన్నారు. వీరిద్దరూ మిషన్‌ స్పెషలిస్టులుగా వ్యవహరిస్తారు. పెగ్గీవిట్సన్‌ జీవరసాయన శాస్త్ర పరిశోధకురాలు, అత్యంత అనుభవజ్ఞురాలైన వ్యోమగామి. గతంలో రెండుసార్లు ఐఎ్‌సఎస్‌ కమాండర్‌గా వ్యవహరించారు. రోదసిలో 657 రోజుల 10గంటలు ఉన్నారు. అత్యంత వృద్ధురాలైన స్పేస్‌ వాకర్‌, అత్యంత ఎక్కువ సమయం స్పేస్‌ వాక్‌ చేసిన మహిళగా రికార్డులు ఆమె పేరిట ఉన్నాయి. వివిధ మిషన్లలో భాగంగా రోదసిలో 60 గంటల 21 నిమిషాలు నడిచారామె. స్లావోష్‌.. యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీకి పనిచేస్తుండగా, టిబోర్‌ కాపు..మెకానికల్‌ ఇంజనీర్‌.

రోదసిలోకి ఇష్టమైన ఆహారం

ఈ మిషన్‌లో భాగంగా ఐఎ్‌సఎ్‌సలోకి వెళ్తున్న నలుగురు వ్యోమగాములూ తమకు ఇష్టమైన ఆహారాన్ని తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా శుభాన్షు శుక్లా మిగతా వ్యోమగాములకు కూడా పంచిపెట్టడానికి క్యారెట్‌ హల్వా, పెసరపప్పు హల్వా, మామిడి పండ్ల రసం తీసుకెళ్లారు. పోలండ్‌, హంగరీ వ్యోమగాములు తమతో ఫ్రీజ్‌ ఫ్రైడ్‌ పోలిస్‌ పియెరోగీస్‌ (ఫ్రైడ్‌ మోమోల్లాంటివి), స్పైసీ హంగేరియన్‌ పాప్రికా పేస్ట్‌ (చిల్లీ సాస్‌లాంటిది) తీసుకెళ్లారు.

భవిష్యత్తు రోదసి యాత్రలకు..

శుబాన్షు శుక్లా 1985 అక్టోబరు 10న యూపీలోని లఖ్‌నవూలో జన్మించారు. 2006 జూన్‌లో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఫైటర్‌ వింగ్‌లో చేరారు. ఎస్‌యు30, ఎంకేఐ, మిగ్‌ 21, మిగ్‌ 29, జాగ్వార్‌, హాక్‌, డోర్నియర్‌, ఏఎన్‌-32 సహా పలురకాల విమానాలను 2000 గంటలపాటు నడిపి అపార అనుభవాన్ని గడించారు. 2024 నాటికి గ్రూప్‌ కెప్టెన్‌ స్థాయికి చేరుకున్నారు. తన కెరీర్‌లో ఎన్నో అవార్డులు, పతకాలు సాధించిన శుక్లా.. ఇస్రో చేపట్టబోయే మానవ సహిత అంతరిక్ష యాత్రకు సంబంధించి తుది జాబితాలో చేరిన నలుగురు వాయుసేన అధికారుల్లో ఒకరు. ఈ యాత్రకు సంబంధించి..2019లో ఇస్రో నుంచి ఆయనకు పిలుపు వచ్చింది. దరిమిలా ఆయన మాస్కో(రష్యా)లోని యూరీ గగారిన్‌ కాస్మొనాట్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో వ్యోమగామి శిక్షణ పొందారు. ఈ మిషన్‌లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లడం వల్ల.. స్పేస్‌ఫ్లైట్‌ ఆపరేషన్స్‌, లాంచ్‌ ప్రోటోకాల్స్‌ వంటివాటిలో అనుభవం సంపాదించే అవకాశం ఆయనకు లభిస్తుంది. అంతేకాదు.. శిక్షణలో భాగమైన కృత్రిమ భారరహిత స్థితి కాకుండా.. నిజమైన భారరహిత స్థితిని అనుభవిస్తారు. ఇస్రో గగన్‌యాన్‌ మిషన్‌లో ఈ అనుభవాలు ఆయనకు ఉపయోగపడనున్నాయి.

భార్యకు ప్రేమతో..

మిషన్‌ ప్రారంభానికి ముందు శుభాన్షు శుక్లా తన భార్యకు, తనకు అండగా నిలిచిన అందరికీ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. తన భార్యను ఉద్దేశించి ‘‘అద్భుతమైన భాగస్వామిగా నిలిచిన కామ్నాకు ప్రత్యేక కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నారు. ఆమె లేనిదే ఇదంతా సాధ్యమయ్యేది కాదంటూ.. ఆమెకు వీడ్కోలు చెబుతున్న ఫొటోను కూడా పోస్ట్‌ చేశారు. ఒక అద్దానికి అవతల తన భార్య.. ఇవతల తాను ఉన్న ఫొటో అది. మూడో తరగతి నుంచి వీరిద్దరూ ఒకే బడిలో చదివారు. తాము చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులమని.. శుక్లా తనకు గుంజన్‌గా తెలుసని.. తరగతిగదిలో ఎక్కువగా సిగ్గుపడే శుభాన్షు ఇప్పుడిలా ఎంతోమందికి స్ఫూర్తినివ్వడం తనకెంతో ఆనందం కలిగిస్తోందని కామ్న తెలిపారు.

వ్యోమనౌకలో ఐదో సభ్యురాలు.. జాయ్‌!

యాక్సియం-4 మిషన్‌లో పాల్గొంటున్న నలుగురు వ్యోమగాములతోపాటు ‘జాయ్‌’ అనే ఐదంగుళాల బొమ్మను కూడా ‘జీరో జీ ఇండికేటర్‌’గా పంపిస్తున్నారు. అంటే.. జీరో గ్రావిటీ ఇండికేటర్‌ అని అర్థం. సాధారణంగా రోదసి యాత్రల్లో ‘జీరో జీ ఇండికేటర్‌’గా సాఫ్ట్‌ టాయ్స్‌ను పంపిస్తుంటారు. వ్యోమనౌక భూ వాతావరణాన్ని దాటి రోదసిలోకి ప్రవేశించగానే.. దారం కట్టి ఉన్న ‘జీరో జీ ఇండికేటర్‌’ బొమ్మ గాల్లోకి లేస్తుంది. దీంతో తాము భార రహిత స్థితిలోకి ప్రవేశించినట్టు వ్యోమగాములకు అర్థమవుతుంది. ఇంతకీ ఈ మిషన్‌కు ఈ బొమ్మనే ఎందుకు ఎంచుకున్నారంటే.. భారత్‌తో పాటు హంగరీ, పోలండ్‌ దేశాల సంస్కృతుల్లో కూడా హంసకు ప్రత్యేక స్థానం ఉంది. మన దేశంలో హంసను జ్ఞానానికి, స్వచ్ఛతకు, సత్యానికి ప్రతీకగా భావిస్తారు. పోలండ్‌లోనూ దాన్ని స్వచ్ఛతకు, విశ్వాసానికి.. హంగేరీలో విశ్వసానికి, అనుగ్రహానికి ప్రతీకగా భావిస్తారు. మూడు దేశాల్లోనూ హంసకున్న ప్రాముఖ్యానికి గుర్తుగా ఈ బొమ్మను జీరో-జీ ఇండికేటర్‌గా ఎంపిక చేశారు. భారత సంస్కృతిలో హంస ను సరస్వతీదేవికి వాహనంగా భావిస్తామని.. అందుకే దీన్ని తీసుకెళ్తున్నామని శుభాన్షు శుక్లా ఒక సందర్భంలో తెలిపారు. నిజానికి జీరో-జీ ఇండికేటర్‌గా డైనోసార్‌, సింహం.. ఇలా చాలా జంతువుల బొమ్మలను పరిశీలించామని, చివరికి హంగేరియన్‌ వ్యోమగామి టిబోర్‌ కాపు సూచన మేరకు హంసను ఎంపిక చేశామని యాక్సియం సంస్థ వెల్లడించింది.

Updated Date - Jun 26 , 2025 | 06:21 AM