అప్పు కోసం.. పాక్ తప్పుకొందా?
ABN, Publish Date - May 11 , 2025 | 03:48 AM
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరి, ఇక పూర్తిస్థాయి యుద్ధం తప్పదేమోనన్న పరిస్థితుల్లో... కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందంటూ ఒక్కసారిగా ఇరు దేశాల నుంచి ప్రకటన వెలువడింది.
ఉన్నపళంగా కాల్పుల విరమణ పాటించాలి
రుణం ఇచ్చేందుకు దాయాది దేశానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి షరతు?
ఆపై అమెరికా ఒత్తిళ్ల ప్రభావం
ఇప్పటికే దివాలా అంచుల్లో ఉన్న పాక్
ఐఎంఎఫ్ రుణం అందకుంటే అధోగతే!
న్యూఢిల్లీ, మే 10: భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరి, ఇక పూర్తిస్థాయి యుద్ధం తప్పదేమోనన్న పరిస్థితుల్లో... కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందంటూ ఒక్కసారిగా ఇరు దేశాల నుంచి ప్రకటన వెలువడింది. దాడుల విషయంలో పాక్‌కు తగిలిన వరుస ఎదురుదెబ్బలకు తోడు అప్పు కోసం ఆ దేశం తిప్పలు, అమెరికా ఒత్తిళ్లు దీనివెనుక ఉన్నట్టు సమాచారం. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన పాకిస్థాన్‌కు ఇప్పుడు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఇవ్వబోయే సుమారు రూ. 8,500 కోట్ల (బిలియన్ డాలర్ల) రుణమే కీలకం. శుక్రవారమే దీనిపై సమీక్షించిన ఐఎంఎఫ్.. భారత్ వ్యతిరేకత వ్యక్తం చేసినా, పాక్‌కు రుణం మంజూరు చేసేందుకు అంగీకరించింది. కానీ భారత్‌తో యుద్ధం విషయంలో వెనక్కి తగ్గాలని, వెంటనే కాల్పుల విరమణ ప్రకటించాలని షరతు పెట్టినట్టు సమాచారం. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఇండియా టీవీ ఈ మేరకు కథనం ప్రచురించింది. ఐఎంఎఫ్ అమెరికా చెప్పుచేతల్లో ఉంటుంది. ఈ క్రమంలో పాకిస్థాన్ ప్రధాని, ఆర్మీ చీఫ్‌తో మాట్లాడిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో.. రుణం కావాలంటే కాల్పుల విరమణ పాటించాలని పాక్‌కు స్పష్టం చేసినట్టు సమాచారం. వారు ఇదే విషయంపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు వివరించి భారత ప్రభుత్వాన్ని ఒప్పించినట్టు తెలుస్తోంది.
అప్పుల కుప్పగా మారి.. దివాలా అంచుల్లో..
పాకిస్థాన్ కొన్నాళ్లుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతోంది. అప్పులు భారీగా పేరుకుపోయాయి. ఐఎంఎ్‌ఫకు ఇప్పటికే రూ.52 వేల కోట్లు (602 కోట్ల డాలర్లు) బాకీ ఉంది. ప్రపంచ బ్యాంకుకు ఏకంగా రూ.4 లక్షల కోట్లకు (48 బిలియన్ డాలర్లు)పైగా చెల్లించాలి. పాక్ మొత్తం అప్పు సుమారు రూ.11 లక్షల కోట్లకు (130 బిలియన్ డాలర్లు)పైనే ఉంటుందని అంచనా. అప్పులపై వడ్డీలు చెల్లించడానికి కూడా దాయాది దేశం దగ్గర డబ్బుల్లేని పరిస్థితి. ఇప్పుడు ఐఎంఎఫ్ రుణం ఇవ్వకుంటే.. పాక్ దివాలా తీయడం ఖాయం. ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధం చేయలేక పాక్ చేతులు ఎత్తేసిందని నిపుణులు చెబుతున్నారు.
Updated Date - May 11 , 2025 | 03:48 AM