Agni 5 Bunker Buster: అగ్ని-5 బంకర్ బస్టర్ మిసైల్ అభివృద్ధికి నడుం కట్టిన డీఆర్‌డీఓ
ABN, Publish Date - Jun 30 , 2025 | 06:19 PM
అమెరికా తరహా బంకర్ బస్టర్ బాంబుల అభివృద్ధిపై డీఆర్‌డీఓ దృష్టిపెట్టింది. వీటిని యుద్ధ విమానాలకు బదులు క్షిపణుల ద్వారా ప్రయోగించేందుకు అగ్ని-5 ఖండాంతర క్షిపణికి మార్పులు చేస్తున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధాన్ని మలుపు తిప్పింది ‘జీబీయూ-57 బంకర్ బస్టర్’ బాంబు. స్టెల్త్ బాంబర్‌ల సాయంతో గగనతలం నుంచి అమెరికా జారవిడిచిన ఈ బంకర్ బస్టర్‌లు.. 200 అడుగుల లోతున్న ఉన్న భూగర్భ అణు కేంద్రాన్ని సులువుగా ధ్వంసం చేశాయి. ఈ నేపథ్యంలో భారత్ కూడా బంకర్ బస్టర్‌ల అభివృద్ధిపై దృష్టి సారించింది. పాక్‌తో ఉద్రిక్తతల నడుమ భారత అమ్ములపొదిలో ఈ అస్త్రం (Agni-5 Bunker Buster Missile) ఆవశ్యకతను గుర్తించిన డీఆర్‌డీఓ రంగంలోకి దిగింది. అయితే, అమెరికాకు భిన్నంగా యుద్ధ విమానాలకు బదులు క్షిపణుల ద్వారా ప్రయోగించే బంకర్ బస్టర్‌ల అభివృద్ధిపై దృష్టిపెట్టినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
భారత అమ్ములపొదిలోని అత్యంత శక్తిమంతమైన అగ్ని-5 ఖండాంతర క్షిపణి బంకర్ బస్టర్ వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలిగేలా మార్పులు చేస్తోంది. ప్రస్తుతం అగ్ని-5 మిసైల్ గరిష్ఠంగా 5 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. అణ్వాయుధ ప్రయోగం కోసం దీన్ని డిజైన్ చేశారు. ఈ అణు వార్‌హెడ్‌ల స్థానంలో 7500 కిలోగ్రాముల బంకర్ బస్టర్ వార్‌హెడ్‌లను తీసుకెళ్లగలిగేలా డిజైన్ చేస్తోంది. కాంక్రీట్ గోడలతో శత్రుదుర్భేద్యంగా నిర్మించిన భూగర్భ కేంద్రాలను సైతం ధ్వంసం చేసేలా అగ్ని-5కి మార్పులు చేస్తున్నారు. గరిష్ఠంగా 2500 కిలోమీటర్ల దూరంలో 100 అడుగుల లోతున ఉన్న భూగర్భ స్థావరాలను ధ్వంసం చేయగలిగేలా డిజైన్ చేస్తున్నారు. శత్రుదేశాల్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్, మిసైల్ ప్రయోగ కేంద్రాలు, ఇతర కీలక మిలిటరీ స్థావరాలను ధ్వంసం చేసేలా రూపకల్పన చేస్తున్నారు. అమెరికా బంకర్ బస్టర్‌లతో పోటీపడేలా గరిష్టంగా మాక్ 8-20 వేగంతో ఈ మిసైల్ దూసుకుపోగలవు.
అమెరికా వద్ద ప్రస్తుతం ఉన్న జీబీయూ-57 బంకర్ బస్టర్‌లు ప్రపంచంలోనే అతి శక్తిమంతమైన సంప్రదాయక బాంబులు. జీబీయూ-57కు ముందు రూపొందించిన జీబీయూ-43 కూడా శక్తిమంతమైనదిగా గుర్తింపు పొందింది. ఈ స్థాయిలో బంకర్ బస్టర్‌ల అభివృద్ధిపై భారత్ దృష్టి సారించింది. అయితే, బాంబర్ విమానాల ద్వారా బాంబులను జారవిడిచే బదులు ఏకంగా ఖండాంతర క్షిపణుల ద్వారా ప్రయోగించగలిగే బంకర్ బస్టర్‌ల వైపు భారత్ మొగ్గుచూపుతోంది. ఇందుకోసం అగ్ని-5కి చెందిన రెండు వేరియంట్‌లను అభివృద్ధి చేస్తోంది. ఉపరితల నిర్మాణాలను టార్గెట్ చేసేలా ఒక వేరియంట్‌ను, భూగర్భ స్థావరాలను టార్గెట్ చేసేందుకు మరొకదాన్ని అభివృద్ధి చేస్తోంది.
ఇవి కూడా చదవండి:
మహిళలకు తృటిలో తప్పిన ముప్పు.. జలపాతంలో నీరు ఒక్కసారిగా ఉప్పొంగడంతో..
నేరాలను అరికట్టాల్సిన బాధ్యత కేవలం పోలీసులపై పెట్టడం సరికాదు: మధ్యప్రదేశ్ డీజీపీ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 30 , 2025 | 06:36 PM