Indian life expectancy: యూత్ అంకుల్స్.. యంగ్ ఆంటీస్
ABN, Publish Date - Apr 21 , 2025 | 05:11 AM
సగటు ఆయుర్దాయం పెరగడంతో నడివయసు నిర్వచనాలు మారిపోయాయి. 50 ఏళ్లు దాటినా జీవితాన్ని ఉత్సాహంగా కొనసాగిస్తున్న నేటి తరం.. వృద్ధాప్యాన్ని చాలా దూరంగా ఉంచుతోంది.
పాతిక.. ముప్పై.. నలభై.. ఇలా వయసు పెరుగుతుందిగానీ.. మనసు మాత్రం యూత్‌లోనే ఉండిపోతుంది. ఇంటర్, డిగ్రీ చదివే పిల్లలు ‘ఆంటీ’, ‘అంకుల్’ అని పిలుస్తుంటే అదోలా ఉంటుంది. వద్దని చెప్పలేరు. అలాగని అంగీకరించి ఊరుకోనూ లేరు. ‘‘నిన్న మొన్ననే కదా.. కాలేజీలో లైలాతో రొమాన్స్ చేసింది’’ అని పాత తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటుందో పురుష హృదయం!! ‘ఆంటీ’ అన్న పిలుపుతోనే భగ్గున మండుతుందో మహిళ హృదయం!! చెవిలో సీసం పోసినట్టే ఉంటుందా సంబోధన వింటుంటే! కారణం.. మధ్యవయసు అనే భావనకు ప్రమాణాలు మారడమే!
పెరుగుతున్న ఆయుర్దాయంతో.. నడివయసు భావన ఆలస్యం
ఒకప్పుడు 20 ఏళ్లలోపే పెళ్లిళ్లు.. 40 ఏళ్లకే మధ్యవయసు భావన
మనకు స్వాతంత్య్రం వచ్చేనాటికి సగటు జీవితకాలం 32 ఏళ్లు
2021నాటికి 67.2 ఏళ్లు.. 2050నాటికి 76 సంవత్సరాలు
జీవితం మొదలయ్యేదే నాలుగు పదులకు అంటున్న నేటితరం
యాభై సంవత్సరాలు వచ్చినా అందం, ఫిట్‌నె్‌సపై తరగని శ్రద్ధ
ఒకప్పుడు నాలుగు పదుల వయసు వస్తే నడివయసు కిందే లెక్క! 1947లో మనకు స్వాతంత్య్రం వచ్చేనాటికి భారతదేశంలో ప్రజల సగటు ఆయుర్దాయం కేవలం 32 సంవత్సరాలు. 2021 నాటికి అది 67.2 సంవత్సరాలకు చేరుకుంది. 2050 నాటికి మనదేశంలో పురుషుల సగటు ఆయుర్దాయం 76, మహిళల సగటు జీవితకాలం 80 సంవత్సరాలకు చేరుతుందని అంచనా. ఒకప్పుడు సగటు జీవితకాలం తక్కువగా ఉండేది కాబట్టే.. జీవన విధానం కూడా దానికి తగ్గట్టుగా ఉండేది. 20 ఏళ్లలోపే పెళ్లి చేసుకోవడం.. నలభై ఏళ్లకే పిల్లలకు పెళ్లిళ్లు చేయడం.. యాభై ఏళ్లొచ్చేసరికి మనవలు, మనవరాళ్లను ఆడించడం.. ఇలా ఒక సంప్రదాయ పద్ధతిలో సాగిపోయేది. పిల్లలకు పెళ్లి చేయడంతో.. నాలుగు పదుల వయసుకే పెద్దరికం వచ్చేసి, మానసికంగా మధ్యవయసువారిలాగా నడుచుకునేవారు! సగటు జీవితకాలం
తక్కువగా ఉండడం వల్ల.. అరవై ఏళ్లు జీవించినవారికి ఆ పుట్టినరోజును షష్టిపూర్తి పేరుతో వేడుకగా జరిపేవారు. వైద్యప్రమాణాల ప్రకారం కూడా.. 40 నుంచి 60 ఏళ్ల దాకా నడివయసు కింద లెక్క. కానీ అదంతా గతం. ఇప్పుడా లెక్కలన్నీ మారిపోయాయి. ఆడ, మగ అనే తేడా లేకుండా.. చాలా మందికి చదువు పూర్తిచేసుకుని, కెరీర్‌లో స్థిరపడేసరికే మూడు పదుల వయసు దాటుతోంది. పెద్ద చదువులు చదవకుండా డిగ్రీ, పీజీతో సరిపెట్టుకున్నవారు సైతం ‘ఇప్పుడే ఎందుకు’ అంటూ పెళ్లిని వాయిదా వేస్తున్నారు. దీంతో వారికి పెళ్లయి, పిల్లలు పుట్టేసరికే 35-36 ఏళ్లు వస్తున్నాయి. అంటే.. ఆ వయసులోనే వారికి అసలు జీవితం మొదలవుతోంది. దీనికితోడు.. గడిచిన యాభై సంవత్సరాలుగా అందుబాటులోకి వచ్చిన అత్యంత అధునాతన వైద్యరీతులు, ఔషధాలు, పెరిగిన సౌకర్యాల కారణంగా.. ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగి శారీరకంగా దృఢంగా ఉండడంతో 50 ఏళ్లు దాటితేగానీ మధ్య వయసులోకి వచ్చిన భావన వారికి కలగని పరిస్థితి ఉంది. మరోకారణం ఏంటంటే.. విదేశాలతో పోలిస్తే మనదేశంలో పిల్లలు ఎంత పెద్దవారైనా తల్లిదండ్రులతో కలిసి ఉండడం సర్వసాధారణం. ఇంటికి సంబంధించిన నిర్ణయాలు ఏవి తీసుకోవాలన్నా పెద్దలపై ఆధారపడేవారి శాతం ఎక్కువ. తల్లిదండ్రులు నిర్ణయాలు తీసుకోలేనంత వృద్ధులైతే తప్ప.. చాలా మంది ఇంటి బాధ్యతలు తీసుకోని పరిస్థితి ఉంటుంది. అలా బాధ్యతలు స్వీకరించేనాటికి వారి వయసు దాదాపు 50 సంవత్సరాలకు దగ్గర్లో ఉంటోంది! అప్పుడుగానీ వారికి మధ్యవయసుకు వచ్చిన భావన కలగట్లేదు.
యోగా.. వ్యాయామంతో..
‘వయసు పెరగడం.. ముసలితనం రావడం సహజం’ ..అనే భావన మునుపటి తరంవారిలో ఉండేది. కానీ, ఈ తరం ఆలోచనలు అలా లేవు. ‘‘వయస్సనేది కేవలం లెక్కలకు సంబంధించినది. మానసికంగా ఉత్సాహంగా ఉంటే శారీరకంగా కూడా దృఢంగా ఉండి, వృద్ధాప్యాన్ని ఎక్కువకాలం అల్లంతదూరాన ఉంచొచ్చు’ అనేది నేటితరం భావన. అందుకే.. నలభై, యాభై ఏళ్ల వయసున్న స్త్రీ, పురుషులూ జిమ్‌కు వెళ్లి వ్యాయామం చేస్తూ, యోగా, ప్రాణాయామం వంటివి చేస్తూ.. వైద్యుల సలహాలు, సూచనలతో పౌష్టికాహారం తీసుకుంటూ.. ఫిట్‌నె్‌సను, ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. అనివార్యమైన వృద్ధాప్యాన్ని వాయిదా వేయడానికి గట్టిగా చెమటోడుస్తున్నారు. దీనివల్ల శారీరక దారుఢ్యం పెరిగి.. ఏడు పదుల వయసులోనూ ఉద్యోగాలు, పని చేస్తున్నవారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుండడం గమనార్హం. మనదేశంలో రిటైర్మెంట్ వయసు ప్రాంతాన్ని బట్టి 60-65 సంవత్సరాలు అయినప్పటికీ.. 70 ఏళ్లు దాటినా కూడా హుషారుగా పనిచేస్తున్నవారు కోటిమందికిపైగానే ఉన్నట్టు 2011 జనాభా లెక్కలు చెబుతున్నాయి. ఆ సంఖ్య.. ఆ ఏడాది మనదేశంలో ఉన్న 70-79 ఏళ్లవారిలో 32 శాతం కావడం గమనార్హం. 2001 లెక్కల ప్రకారం ఆ సంఖ్య 76.7 లక్షలే. గడిచిన పదమూడేళ్లలో అలా పనిచేస్తున్న వారి సంఖ్య ఇంకా పెరిగి ఉంటుందని అంచనా. మధ్యవయసు.. దరిమిలా ముదిమి... వాయిదా పడడం అనే కాన్సెప్ట్ మనదగ్గర ఇప్పుడిప్పుడు ఊపందుకుంటోందిగానీ.. పాశ్చాత్యదేశాల్లో ఈ ట్రెండ్ చాలాకాలంగా ఉంది. 2012లో బ్రిటన్‌లో నిర్వహించిన ఒక సర్వేలో అత్యధికులు.. 55 ఏళ్లు వస్తేగానీ నడివయసుకు వచ్చినట్టు కాదని కుండబద్దలు కొట్టి చెప్పారు. 20 శాతం మంది దృష్టిలో మధ్యవయసు అంటే కనీసం 60 ఏళ్లు!! నిజమే.. ప్రముఖ రచయిత మార్క్‌ట్వెయిన్ అన్నట్టు వయస్సనేది కేవలం మానసిక భావన! పట్టించుకుంటేనే సమస్య.. పట్టించుకోకపోతే అద్భుతాలు సృష్టించవచ్చు!!
తప్పా? ఒప్పా?
కాబోయే అల్లుడితో అత్త పరారీ.. కూతురి మామగారితో తల్లి వివాహేతర సంబంధం.. పెళ్లిచూపుల్లో కూతుర్ని చూపించి పెళ్లికి సిద్ధమైన తల్లి వంటి ఘటనలు ఇటీవలికాలంలో పెరగడానికి వయసు పెరిగినా మనసు యవ్వనంలోనే ఉండిపోవడం ఒక కారణమని మనస్తత్వ శాస్త్ర నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఉదాహరణకు కూతురి మామగారితో తల్లి వివాహేతర సంబంధం పెట్టుకున్న ఘటనలో.. వారిద్దరి వయసూ 43, 46 ఏళ్లు. వారుచేసింది తప్పా? ఒప్పా? అనే మీమాంస పక్కన పెడితే.. పెళ్లయిన పిల్లలున్నా... మానసికంగా వారిద్దరూ నడివయస్సులోకి వచ్చినట్టు భావించకపోవడం వల్లే వారు అలాంటి అసాధారణమైన నిర్ణయం తీసుకున్నారని వారు పేర్కొంటున్నారు.
ఇవి కూడా చదవండి:
Ramesh Nagapuri: నేనే తప్పూ చేయలేదు.. సస్పెన్షన్‌పై రమేశ్ నాగపురి రియాక్షన్
Viral Video: వైద్యం కాదు వేధింపు..ప్రభుత్వ ఆస్పత్రిలో వృద్ధుడిని లాక్కెళ్లిన డాక్టర్, సిబ్బంది
Viral News: 70 ఇన్ స్పేస్..అంతరిక్షంలో రోదసీ యాత్రికుడి బర్త్ డే సెలబ్రేషన్
UPSC Recruitment: రూ.25తో ప్రభుత్వ ఉద్యోగానికి గ్రీన్‌సిగ్నల్.. 45 ఏళ్ల వారికీ కూడా ఛాన్స్
Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..
Read More Business News and Latest Telugu News
Updated Date - Apr 21 , 2025 | 05:11 AM