Fixes Prices: క్యాన్సర్ సహా 71 ఔషధాల ధరల ఖరారు
ABN, Publish Date - Jul 16 , 2025 | 05:23 AM
క్యాన్సర్ సహా.. 71 రకాల ఔషధాల ధరలను కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఇందులో మెటాస్టాటిక్ రొమ్ము క్యాన్సర్, అలర్జీలు, మధుమేహం వంటి వ్యాధుల చికిత్సలకు...
న్యూఢిల్లీ, జూలై 15: క్యాన్సర్ సహా.. 71 రకాల ఔషధాల ధరలను కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఇందులో మెటాస్టాటిక్ రొమ్ము క్యాన్సర్, అలర్జీలు, మధుమేహం వంటి వ్యాధుల చికిత్సలకు వినియోగించే ఔషధాలున్నాయి. ఈ మేరకు జాతీయ ఫార్మాస్యూటికల్ ధరల సంస్థ(ఎన్‌పీపీఏ) మంగళవారం ఓ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఫార్మసీల్లో ధరల పట్టీలను ప్రదర్శించాలని ఆ నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. అందులో కొన్ని ముఖ్యమైన ఔషధాల ధరలు ఇలా ఉన్నాయి. రిలయెన్స్ లైఫ్ సైన్సెస్ తయారు చేసే ట్రాస్టుజుమాబ్ ఇంజెక్షన్ ధర ఒక్కో వైల్‌కి రూ.11,966గా ఉంది. దీన్ని మెటాస్టాటిక్ బ్రెస్ట్ క్యాన్సర్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్ చికిత్సలో వినియోగిస్తారు. పెప్టిక్ అల్సర్ చికిత్సలో వాడే క్లారిత్రోమైసిన్, ఎసోమెప్రజోల్, అమోక్సిసిల్లిన్‌ల కాంబినేషన్ మాత్ర ధర(ఒక్కోటి)ను రూ.162.5గా నిర్ణయించారు. దీన్ని టోరెంట్ ఫార్మా కంపెనీ తయారు చేస్తుంది. లైఫ్ సేవింగ్‌లో భాగంగా వాడే సెఫి్ట్రయాక్సోన్, డిసోడియం ఎడిటేట్, సల్బాక్టామ్ కాంబినేషన్ల ఇంజెక్షన్ వైల్ ధరను రూ.626గా నిర్ణయించారు. ఇదే కంపోజిషన్‌తో టైకెమ్ కంపెనీ తయారు చేసే ఇన్ఫ్యూషన్ సొల్యూషన్ ఇంజెక్షన్ ధరను ప్రతి వైల్‌కి రూ.515.50గా ఖరారు చేశారు. మధుమేహ చికిత్సలో ఉపయోగించే.. సిటాగ్లిప్టిన్ కలిగి ఉన్న 25 రకాల ఔషధాల ధరలు, ఎంపాగ్లిఫ్లోజిన్ కలిగి ఉన్న ఇతర షుగర్ ఔషధాల ధరలను కూడా తాజా నోటిఫికేషన్‌లో నిర్ణయించారు.
ఇవి కూడా చదవండి:
ఇక సమోసా, జిలేబీలకూ సిగరెట్ ప్యాకెట్ తరహా హెచ్చరికలు..
మహారాష్ట్రలో మరో కలకలం.. హిందీలోనే మాట్లాడతానన్న ఆటో డ్రైవర్‌పై దాడి
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 16 , 2025 | 05:24 AM