Share News

Palghar Auto Driver: మహారాష్ట్రలో మరో కలకలం.. హిందీలోనే మాట్లాడతానన్న ఆటో డ్రైవర్‌పై దాడి

ABN , Publish Date - Jul 13 , 2025 | 04:18 PM

హిందీలోనే మాట్లాడతానన్న ఓ ఆటో డ్రైవర్‌పై మహారాష్ట్రలో జరిగిన దాడి కలకలానికి దారితీసింది. శివ సేన (యూబీటీ), ఎమ్ఎన్ఎస్ పార్టీ మద్దతుదారులు ఈ దాడికి దిగారు.

Palghar Auto Driver: మహారాష్ట్రలో మరో కలకలం.. హిందీలోనే మాట్లాడతానన్న ఆటో డ్రైవర్‌పై దాడి
Marathi language row

ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలో మరో షాకింగ్ ఉదంతం చోటుచేసుకుంది. హిందీలోనే మాట్లాడతానన్న ఓ ఆటో డ్రైవర్‌పై శివసేన (యూబీటీ), మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్ఎన్ఎస్) మద్దతుదారులు బహిరంగంగా దాడికి దిగిన ఘటన కలకలం రేపుతోంది.

జాతీయ మీడియా కథనాల ప్రకారం, వారం రోజుల క్రితం ఆ ఆటో డ్రైవర్ తన వాహనంలోని ప్రయాణికుడితో మాట్లాడుతూ తాను హిందీ లేదా భోజ్‌పురీలోనే మాట్లాడతానని స్పష్టం చేశాడు. ఎవరేం చేసినా తనకు భయం లేదని చెప్పారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో శనివారం శివసేన (యూబీటీ), ఎమ్ఎన్ఎస్ మద్దతుదారులు ఆ ఆటోడ్రైవర్‌పై దాడి చేశారు. మరాఠీ భాష, సంస్కృతిని అవమానిస్తే ఉపేక్షించేది లేదంటూ పలుమార్లు అతడి చెంప ఛెళ్లుమనిపించారు. అతడిపై చేయి చేసుకున్న వారిలో మహిళ కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో విరార్ సిటీ శివ సేన (యూబీటీ) చీఫ్ ఉదయ్ జాదవ్ కూడా ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.


ఘటనపై ఉదయ్ జాదవ్ మాట్లాడుతూ తాము అసలై శివసేన స్టైల్‌లో స్పందించామని చెప్పుకొచ్చారు. ‘ఎవరైనా మరాఠీ భాషను, రాష్ట్రాన్ని, మరాఠా ప్రజల్ని అవమానించే ధైర్యం చేస్తే వారికి అసలైన శివ సేన స్టైల్‌‌లో సమాధానం ఇస్తాము. చూస్తూ ఊరుకోము’ అని జాదవ్ అన్నారు. ‘ఆ డ్రైవర్ మరాఠా రాష్ట్రం, ప్రజల గురించి తప్పుగా మాట్లాడే ప్రయత్నం చేశాడు. అతడికి తగిన బుద్ధి చెప్పాము. రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పించాము’ అని అన్నారు.

అయితే, ఈ ఘటనపై పాల్‌ఘర్ పోలీసులు ఇంకా కేసు నమోదు చేయాల్సి ఉంది. ‘మేము ఆ వైరల్ వీడియోను చూశాము. అసలేం జరిగిందీ నిర్ధారించేందుకు ట్రై చేస్తున్నాము. ఇప్పటివరకూ ఎవరూ మాకు ఫిర్యాదు చేయలేదు’ అని ఓ పోలీసు అధికారి అన్నారు.


జాతీయ విద్యా విధానంలో భాగంగా హిందీ భాషా బోధనపై మహారాష్ట్రంలో వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే. మరాఠీ భాష మద్దతుదారులు ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో హిందీని ప్రైమరీ స్కూళ్లల్లో విద్యార్థులకు బోధించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది.

ఇవి కూడా చదవండి:

గ్రామంలో రోడ్లు లేవంటూ సోషల్ మీడియాలో గర్భిణుల నిరసన.. ఎంపీ రెస్పాన్స్ చూస్తే..

తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పోలీస్ అకాడమీలో చేరి.. రెండేళ్ల పాటు..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 13 , 2025 | 04:27 PM