Operation Sindoor: పాక్ దాడులను ముందే ఊహించి స్వర్ణ దేవాలయంలో తుపాకులు
ABN, Publish Date - May 21 , 2025 | 07:40 AM
ఆపరేషన్ సిందూర్ సమయంలో అమృత్‌సర్ స్వర్ణ దేవాలయంలో ఆయుధాల మోహరింపునకు ఆలయ యాజమాన్యం అనుమతిచ్చినట్టు ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ డీజీ సుమేర్ ఇవాన్ పేర్కొన్నారు. అయితే ఆ వ్యాఖ్యలను భారత సైన్యం అధికారికంగా ఖండించింది.
మోహరించామని ఏఎన్‌ఐ ఇంటర్వ్యూలో తెలిపిన ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ డీజీ సుమేర్ ఇవాన్
ఆ ఆలయ ప్రధాన పూజారి అందుకు అనుమతిచ్చారని వెల్లడి
ఇవాన్ వ్యాఖ్యలను ఖండించిన ఆర్మీ
న్యూఢిల్లీ, మే 19: ఆపరేషన్ సిందూర్ దరిమిలా భారత్‌లోని పలు ప్రాంతాలపై దాడులకు పాక్ ప్రయత్నించిన వేళ.. అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో ఆయుధాల మోహరింపునకు ఆలయ యాజమాన్యం అంగీకరించిందని ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ డీజీ, లెఫ్టినెంట్ జనరల్ సుమేర్ ఇవాన్ ఏఎన్‌ఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు! అంతేకాదు.. శత్రుదేశ డ్రోన్లు, క్షిపణులను గుర్తించేందుకు వీలుగా తొలిసారి స్వర్ణ దేవాలయంలో విద్యుద్దీపాలన్నీ ఆర్పివేసినట్టు ఆయన వెల్లడించారు. దీనివల్ల శత్రు డ్రోన్లను గుర్తించి, వాటిని నిర్వీర్యం చేయడం భారత సైన్యానికి సులువైందని వివరించారు. ‘‘పాక్ మన ప్రజలను, మన దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతుందని మేం ముందే ఊహించాం. ఆ సమయంలో స్వర్ణ దేవాలయ ప్రధాన గ్రంధి (ప్రధాన పూజారి) మా తుపాకులను ఆలయంలో మోహరించడానికి అనుమతించారు. ఆలయానికి పొంచి ఉన్న ముప్పు గురించి మేం చెప్పినప్పుడు ఆ విషయాన్ని ఆలయ యాజమాన్యం అర్థం చేసుకుంది. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన, నిత్యం వందలు, వేలాది మంది సందర్శించే జాతీయ కట్టడాన్ని పరిరక్షించడం కోసం తుపాకులను మోహరించడానికి ఆమోదం తెలిపింది. దీంతో అక్కడ తుపాకులను మోహరించాం. అలాగే.. స్వర్ణదేవాలయంలో ఎన్నో ఏళ్లుగా వెలుగుతున్న దీపాలను బహుశా తొలిసారి ఆర్పివేశారు. దాంతో మేం ఆ దిశగా వచ్చే శత్రు డ్రోన్లను స్పష్టంగా చూడగలిగాం.’’ అని ఆయన ఏఎన్‌ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరంగా వెల్లడించారు. పాకిస్థాన్‌లోని ఏ ప్రాంతంపై అయినా దాడి చేయగల సత్తా తమకు ఉందని, భారత్ పూర్తిస్థాయిలో దాడి చేస్తే కలుగులో దాక్కోవడం తప్ప పాక్‌కు మరో మార్గం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
అలాంటిదేం లేదు..
స్వర్ణ దేవాలయంలో తుపాకులను మోహరించినట్టు ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ డీజీ సుమేర్ ఇవాన్ చెబుతున్న వీడియో క్లిప్ ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నప్పటికీ.. ఆర్మీ దాన్ని కొట్టిపారేసింది. స్వర్ణదేవాలయంలో ఎలాంటి తుపాకులనూ (ఎయిర్‌డిఫెన్స్(ఏడీ) గన్స్) మోహరించలేదని ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘‘స్వర్ణదేవాలయంలో ఎయిర్‌డిఫెన్స్ గన్స్ మోహరింపునకు సంబంధించి కొన్ని కథనాలు మీడియాలో వస్తున్నాయి. కానీ.. శ్రీ దర్బార్ సాహిబ్ అమృత్‌సర్ (స్వర్ణదేవాలయం)లో ఏడీ తుపాకులనుగానీ, మరే ఇతర ఆయుధాలనుగానీ మోహరించలేదని స్పష్టం చేస్తున్నాం’’ అని ఆ ప్రకటనలో తేల్చిచెప్పింది. గోల్డెన్ టెంపుల్ ప్రధాన పూజారి.. సింగ్ సాహిబ్ జ్ఞానీ రఘ్‌బీర్ సింగ్ సైతం తుపాకుల మోహరింపు కథనాలను కొట్టిపారేశారు. ‘‘భారత సైన్యం సంప్రదింపుల గురించి నాకు ఎలాంటి సమాచారం లేదు. ఆ సమయంలో నేను సెలవులో ఉన్నా. వేరే దేశానికి వెళ్తున్నా. దీనిపై లోతైన విచారణ జరపాలి. దీని వెనుక భారత సైన్యం అసలు ఉద్దేశం ఏంటో తెలియాలి’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఆలయ అదనపు ప్రధాన పూజారి జ్ఞానీ అమర్జీత్ సింగ్ కూడా.. ఆలయంలో ఆయుధాల మోహరింపునకు అనుమతిచ్చామనడం అసత్యమన్నారు. అధికారుల ఆదేశాల మేరకు బ్లాకవుట్ సమయంలో ఆలయం బయట, పైభాగంలో ఉన్న దీపాలను ఆర్పేశామని.. లోపలిభాగంలో తప్పనిసరిగా దీపాలు వెలుగుతూ ఉండాల్సిన చోట అలాగే ఉంచామని వెల్లడించారు. స్వర్ణదేవాలయ పవిత్రతను పూర్తిస్థాయిలో కాపాడామని పేర్కొన్నారు.
Updated Date - May 21 , 2025 | 07:42 AM