AAIB Report: కిల్లర్ స్విచ్
ABN, Publish Date - Jul 13 , 2025 | 04:26 AM
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదానికి సంబంధించి ఇంధన స్విచ్‌లు కీలకంగా మారాయి...
ఇంధన స్విచ్‌లు కటాఫ్‌కు.. ఆగిపోయిన 2 ఇంజన్లు
అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై ఏఏఐబీ నివేదిక
‘ఇంధన స్విచ్‌లు ఎందుకు ఆఫ్ చేశావు?
నేను ఆఫ్ చేయలే..’ పైలట్ల సంభాషణ
స్విచ్‌లను తిరిగి ఆన్‌చేసినా..ఇంజన్లు పుంజుకునే లోగా ఘోరం
టేకాఫ్ అయిన 32 సెకన్లలోనే దుర్ఘటన
ప్రస్తుత ఆధారాల మేరకు కుట్ర కోణమేదీ లేదని భావిస్తున్నట్టు ఏఏఐబీ వెల్లడి
ఇంధన స్విచ్‌లు ఎలా కటాఫ్‌కు మారాయనే దానిపై సందేహాలు
విమానాన్ని కావాలనే కూల్చివేసినట్టుందని పలువురు నిపుణుల ఆరోపణ
న్యూఢిల్లీ, జూలై 12: అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదానికి సంబంధించి ఇంధన స్విచ్‌లు కీలకంగా మారాయి. రెండు ఇంధన స్విచ్‌లు ‘రన్’ నుంచి ‘కటాఫ్’ మోడ్‌లోకి మారడంతో.. ఇంధన సరఫరా నిలిచిపోయి సెకన్ల వ్యవధిలోనే రెండు ఇంజన్లు నిలిచిపోయాయి. పైలట్లు దీన్ని గుర్తించి సరిచేసేందుకు ప్రయత్నించినా.. ఆలోపే ప్రమాదం జరిగిపోయింది. టేకాఫ్ తర్వాత 32 సెకన్లలోనే కుప్పకూలింది. ‘విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ (ఏఏఐబీ)’ శనివారం విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలను వెల్లడించింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయానికి బయల్దేరిన ఎయిరిండియా ఏఐ171 విమానం (బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్).. ఎయిర్‌పోర్టు పక్కనే ఉన్న బీజే వైద్య కళాశాల హాస్టల్ భవనంపై కుప్పకూలిన విషయం తెలిసిందే. విమానంలోని మొత్తం 242మందిలో 11ఏ సీట్లో కూర్చున్న ఒక్కరు తప్ప మిగతా వారంతా మృతిచెందిన ఈ దుర్ఘటన భారత విమానయాన చరిత్రలోనే అతిపెద్ద విషాదాల్లో ఒకటి. ఏఏఐబీ ఈ ప్రమాదంపై సుమారు నెల రోజులపాటు యూకే విమాన ప్రమాదాల దర్యాప్తు విభాగం, అమెరికా జాతీయ రవాణా భద్రత బోర్డుల సహకారంతో క్షుణ్నంగా పరిశీలన జరిపింది. తాజాగా 15పేజీలతో ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. విమానం బ్లాక్‌బాక్స్‌లో నమోదైన సాంకేతిక అంశాలు, పైలట్ల వాయిస్ రికార్డుల వివరాలనూ అందులో వెల్లడించింది.
అంతా 32 సెకన్లలోనే..
జూన్ 12 మధ్యాహ్నం 13.38 గంటల 39 సెకన్ల సమయంలో (24 గంటల విధానం) విమానం రన్‌వే పైనుంచి గాల్లోకి ఎగిరింది. సుమారు గంటకు 333 కిలోమీటర్ల (180 నాట్స్) వేగాన్ని అందుకుంది. ఆ సమయంలో 54,200 కిలో ల ఇంధనం ఉంది. విమానం మొత్తం బరువు కూడా అనుమతించిన పరిమితిలోపు 2,13,401 కిలోలు ఉంది. వాతావరణం అనుకూలంగా ఉంది. పక్షులేవీ ఢీకొన్న ఆనవాళ్లు లేవు. విమానం రెక్కలకు ఉండే ఫ్లాప్స్ (టేకాఫ్‌కు తోడ్పడే భాగాలు), ల్యాండింగ్ గేర్ సరిగానే ఉన్నాయి.
13.38 గంటల 42 సెకన్ల సమయంలో విమానంలోని మొదటి ఇంజన్‌కు ఇంధనం సరఫరా చేసే స్విచ్ ‘రన్’ మోడ్ నుంచి ‘కటాఫ్’ మోడ్‌లోకి మారింది. తర్వాత ఒక్క సెకన్‌లోనే రెండో ఇంజన్ ఇంధన సరఫరా స్విచ్ కూడా ‘కటాఫ్’ మోడ్‌లోకి మారింది. ఇంధన సరఫరా నిలిచిపోవడంతో దాదాపు 10సెకన్ల పాటు రెండు ఇంజన్లు ఆగిపోయి.. విమానం కిందికి పడిపోవడం మొదలైంది. దీంతో పైలట్లు అప్రమత్తం అయ్యారు. ఒక పైలట్ ‘ఇంధన స్విచ్ ఎందుకు ఆఫ్ చేశావు’ అని ప్రశ్నించగా... ‘నేనేమీ ఆఫ్ చేయలేదు’ అని మరో పైలట్ సమాధానం ఇచ్చారు.
13.38గంటల 52సెకన్ల సమయంలో మొదటి ఇంధన స్విచ్, 56 సెకన్ల సమయంలో రెండో స్విచ్ ‘రన్’ మోడ్‌లోకి మారాయి. రెండు ఇంజన్లకు ఇంధన సరఫరా మొదలైంది. మొదటి ఇంజన్ ఆన్ అయి వేగం అందుకోవడం మొదలైంది. రెండో ఇంజన్ ఆన్ అయినా వేగం పుంజుకోలేదు.
13.39గంటల 5సెకన్ల సమయంలో పైలట్లలో ఒకరు ‘మేడే.. మేడే..’ అంటూ ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్)కి అత్యవసర సందేశం పంపారు. ఏటీసీ తిరిగి పైలట్లతో మాట్లాడటానికి ప్రయత్నించినా.. అప్పటికే సిగ్నల్స్ నిలిచిపోయాయి. తర్వాత ఆరు సెకన్లకే విమానం కూలిపోయింది. మొత్తంగా 32 సెకన్లలోనే అంతా ముగిసిపోయింది.
విమానం వెనుకభాగంలో ‘రామ్ ఎయిర్ టర్బైన్ (ర్యాట్)’గా పిలిచే చిన్నపాటి ఇంజన్ ఉంటుంది. విమానం రెండు ఇంజన్లు ఆగిపోయిన పరిస్థితి ఎదురైతే.. అది ఆటోమేటిగ్గా ఆన్ అయి కీలక భాగాలు, కమ్యూనికేషన్ పరికరాలకు విద్యుత్ అందిస్తుంది. ఎయిరిండియా విమానం కూలే ముందు ఈ ర్యాట్ ఆన్ అయింది. దీనితో రెండు ఇంజన్లు ఒక్కసారిగా ఆగిపోయినట్టు నిర్ధారణ అయింది.
ప్రమాదానికి గురైన విమానం పైలట్లలో సుమిత్ సభర్వాల్ (56) కు 15,638 గంటలు విమానం నడిపిన అనుభవం ఉంది. రెండో పైలట్ క్లైవ్ కుందర్ (32)కు 3,403 గంటల అనుభవం ఉంది. ఆరోగ్యంగా ఫిట్‌గా ఉన్నారు. విమానంలోకి వెళ్లే ముందు వారికి బ్రీత్ అనలైజర్, ఇతర పరీక్షలు కూడా చేశారు.
కూలిపోవడానికి ముందు విమానంలో ఇంధనం నింపిన ట్యాంకులు, పైపుల నుంచి శాంపిళ్లను సేకరించి పరీక్షించారు. ఇంధనం నాణ్యంగానే ఉందని, లోపమేమీ లేదని తేల్చారు.
ఇప్పటివరకు లభించిన ఆధారాల మేరకు ప్రమాదం వెనుక కుట్ర కోణమేదీలేదని భావిస్తున్నట్టు ఏఏఐబీ నివేదికలో పేర్కొంది. మరిన్ని ఆధారాలను, రికార్డులను పరిశీలించాక స్పష్టత వస్తుందని తెలిపింది.
ఆ స్విచ్‌లు అంత సులువుగా కదలవు!
విమానంలోని బ్లాక్‌బాక్స్‌లో ‘ఎన్‌హాన్స్‌డ్ ఎయిర్‌బార్న్ ఫ్లైట్ రికార్డర్ (ఈఎఫ్ఆర్)’, ‘కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్)’ పరికరాలు ఉంటాయి. విమానానికి సంబంధించిన ప్రతి అంశాన్ని ఈఎఫ్ఆర్ ఎప్పటికప్పుడు నమోదు చేస్తే పైలట్ల మధ్య సంభాషణలను సీవీఆర్ నమోదు చేస్తుంది. విమానం టేకాఫ్ తీసుకోగానే రెండు ఇంజన్ల ఇంధన స్విచ్‌లు ‘రన్’ మోడ్ నుంచి ‘కటాఫ్’ కు మారినట్టు ‘ఈఎఫ్ఆర్’ డేటా ఆధారంగా గుర్తించారు. ‘స్విచ్‌లు ఎందుకు ఆఫ్ చేశావని ఒక పైలట్ అంటే.. నేనేమీ చేయలేదంటూ’ పైలట్లు గందరగోళానికి లోనవడం ‘సీవీఆర్’లో నమోదైంది.
పైలట్ల సంభాషణను బట్టి.. వారు ఆఫ్ చేసినట్టు కనిపించడం లేదు. పొరపాటున చేయిగానీ, ఏదైనా వస్తువుగానీ తగిలి ఇంధన స్విచ్‌లు కదిలే అవకాశమూ లేదు. పైకి కిందికి కదిలే మోడల్‌లోని ఈ స్విచ్‌లలో స్టాప్‌లాక్ ఏర్పాటు ఉంటుంది. నేరుగా వేలితో నొక్కినంత మాత్రన కదలవు. స్విచ్‌ను పట్టుకుని, లాగి.. పైకిగానీ, కిందకుగానీ జరిపాక వదిలేయాల్సి ఉంటుంది. ఇక ల్యాండింగ్ తర్వాత విమానం ఇంజన్లను ఆఫ్ చేయడానికి, గాల్లో ఎగురుతున్నప్పుడు ఇంజన్‌లో మంటలురావడం లేదా ఏదైనా సమస్య తలెత్తడం వంటివి జరిగితే ఇంజన్లను ఆపడానికి, తిరిగి ప్రారంభించడానికి ఇంధన స్విచ్‌లను వినియోగిస్తారు. ఈ స్విచ్‌లు స్వతంత్ర విద్యుత్ వ్యవస్థతో అనుసంధానమై ఉంటాయని.. ఇంజన్లకు విద్యుత్ సరఫరాను, ఇంధన వాల్వ్‌లను నియంత్రిస్తాయని అమెరికా విమానయాన నిపుణుడు జాన్ కాక్స్ తెలిపారు. ఈ స్విచ్‌లు ఎలా కటాఫ్ మోడ్‌కు మారాయో ఏఏఐబీ నివేదికలో పేర్కొనలేదు.
జవాబులు లేని ప్రశ్నలెన్నో..
ఇంధన స్విచ్‌లు ఎలా కటాఫ్ అయ్యాయి? మొదటి పైలట్ అలా ఎందుకు అడిగారు? వారి నియంత్రణలో లేని పరిస్థితి ఏదైనా నెలకొందా? ఇంధన స్విచ్‌లలో సాంకేతిక, నిర్మాణపరమైన లోపాలున్నాయా? వంటి ప్రశ్నలెన్నో వెల్లువెత్తుతున్నాయి.
విమాన 2 ఇంజన్లు ఒక్కసారిగా ఆగిపోవడానికి, ఒక ఇంజన్ ఆన్ అయినా, మరొకటి మొరాయించడానికి కారణా లు ఏఏఐబీ నివేదికలో పేర్కొనలేదు.
ప్రమాదానికి గురయ్యే ముందు ఏఐ423 సర్వీసు కింద ఈ విమానం నడిచింది. అప్పటి విమాన సిబ్బంది స్టెబిలైజర్ సెన్సర్‌లో సమస్యని గుర్తించి రిపోర్టు చేశారు. ఎయిరిండియా ఇంజనీర్లు దాన్ని పరిష్కరించి ప్రయాణానికి సిద్ధం చేశారు. అదే సమస్య మళ్లీ ఉత్పన్నమైం దా? అన్న ప్రస్తావన నివేదికలో లేదు.
మానవ తప్పిదాన్ని కూడా నివేదిక ధ్రువీకరించలేదు. కాక్‌పిట్‌లో ఏం జరిగిందన్న దానిపై ఇంకా పరిశీలన కొనసాగుతోందని ఏఏఐబీ తెలిపింది.
కాక్‌పిట్‌లోని పైలట్లలో ఇంధన స్విచ్ గురించి ఎవరు ఎవరిని అడిగారనేది వెల్లడించలేదు. 32 సెకన్ల పాటు విమానం గాలిలో ఉంటే.. కేవలం ఒక్కో వాక్యాన్నే బహిర్గతం చేసింది. మిగతా వివరాలు ఏమయ్యాయి?
అమెరికా ముందే హెచ్చరించిందా?
బోయింగ్ విమానాల్లోని ఇంధన స్విచ్‌ల వ్యవస్థలో లోపాలున్నాయని అమెరికా పౌర విమానయాన సంస్థ (ఎఫ్‌ఏఏ) 2018లోనే హెచ్చరించింది. ఈ అంశాన్ని ఎయిరిండియా దృష్టికీ తెచ్చింది. బోయింగ్ 737, 787 విమానాల్లోని ఇంధన స్విచ్‌ల లాకింగ్ వ్యవస్థలో లోపం ఉందని, ఆ లాక్ సులువుగా వదులయ్యే అవకాశం ఉందని పేర్కొంటూ ఎఫ్‌ఏఏ 2018 డిసెంబర్‌లో ప్రత్యేక వైమానిక సమాచార బులెటిన్ (ఎస్‌ఏఐబీ)లో పేర్కొంది. అయితే అది సమాచారం మాత్రమే. తప్పనిసరిగా పాటించాల్సిన సూచనగానీ, ప్రమాదకరమనే హెచ్చరికగానీ కాదు. దీనితో ఎయిరిండియా తమ విమానాల్లో ఈ ఇంధన స్విచ్‌ల వ్యవస్థకు సంబంధించిన తనిఖీలు నిర్వహించలేదని తెలిపింది. ఇంధన స్విచ్‌లలో ఇప్పటివరకు ఎలాంటి లోపాలు బయటపడలేదని, పైలట్లు ఎవరూ ఫిర్యాదు చేయలేదని పేర్కొంది.
దర్యాప్తుకు సహకరిస్తాం: బోయింగ్
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తునకు పూర్తి సహకారం కొనసాగిస్తామని విమాన తయారీ సంస్థ బోయింగ్ ప్రకటించింది. ప్రమాదంపై ఏఏఐబీ ప్రాథమిక నివేదికను విడుదల చేసిన నేపథ్యంలో బోయింగ్ శనివారం ఒక ప్రకటనను విడుదల చేసింది. ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని ఏఏఐబీకి అందజేసేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. ‘దర్యాప్తునకు, మా కస్టమర్లకు మా మద్దతును కొనసాగిస్తాం. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ ప్రోటోకాల్‌కు అనుగుణంగా ఏఐ171 విమానానికి సంబంధించిన సమాచారాన్ని ఏఏఐబీకి అందజేసేందుకు కట్టుబడి ఉన్నాం’ అని పేర్కొంది
Updated Date - Jul 13 , 2025 | 09:59 AM