Digital Highway: తొలి డిజిటల్ హైవేగా ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే
ABN, Publish Date - Jun 29 , 2025 | 04:45 AM
దేశంలోనే తొలిసారిగా డిజిటల్ హైవే అందుబాటులోకి వచ్చింది. ఢిల్లీ-గురుగ్రామ్‌ను కలిపే ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేపై ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ సాయంతో పనిచేసే అడ్వాన్స్‌డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్(ఏటీఎంఎస్) ఏర్పాటు చేశారు.
ఢిల్లీ-గురుగ్రామ్ హైవేపై ఏఐతో అడ్వాన్స్‌డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ
న్యూఢిల్లీ, జూన్ 28: దేశంలోనే తొలిసారిగా డిజిటల్ హైవే అందుబాటులోకి వచ్చింది. ఢిల్లీ-గురుగ్రామ్‌ను కలిపే ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేపై ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ సాయంతో పనిచేసే అడ్వాన్స్‌డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్(ఏటీఎంఎస్) ఏర్పాటు చేశారు. ఈ ఎక్స్‌ప్రెస్ హైవేతో పాటు ఎన్‌హెచ్-48పై 28 కిలోమీటర్ల మేర(రెండు వైపులా) అత్యాధునిక ఏటీఎంఎస్‌ను జోడించారు. దేశవాప్తంగా దీన్ని అమలు చేయాలని కేంద్రం యోచిస్తోంది. ఏఐ ఆధారిత స్మార్ట్ ట్రాఫిక్ వ్యవస్థ కలిగిన ఈ డిజిటల్ హైవేపై కిలోమీటర్‌కు ఒకటి చొప్పున మొత్తం 110 హై రిజల్యూషన్ పీటీజడ్ కెమెరాలను అమర్చారు. ఇవి 24 గంటలూ రహదారిపై నిఘా ఉంచుతాయి. ఏటీఎంఎస్‌లో ట్రాఫిక్ మానిటరింగ్, ప్రమాదాల వీడియో చిత్రీకరణ, వాహన వేగం, సైన్‌బోర్డులు, సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూం వంటి 5 రకాల వ్యవస్థలున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగితే కమాండ్ సెంటర్ వెంటనే రహదారి సిబ్బందికి సమాచారం చేరవేస్తుంది. పొగమంచు ఏర్పడినప్పుడు, రహదారిపై జంతువులు వచ్చినప్పుడు, ఇతర అడ్డంకులు ఏర్పడినప్పుడు సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది.
రూల్స్ ఉల్లంఘిస్తే వెంటనే ఈ-చలాన్
నేషనల్ ఇన్‌ఫర్‌మాటిక్స్ సెంటర్(ఎన్‌ఐసీ) ఈ-చలాన్ పోర్టల్‌కు ఏటీఎంఎస్ అనుసంధానం చేయడంతో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది. దీంతో క్షణాల్లో ఈ-చలాన్ జారీ చేసే అవకాశం ఉంటుంది. హైవేపై ప్రయాణించే సమయంలో సీటుబెల్ట్ పెట్టుకోకపోయినా, ట్రిపుల్ రైడింగ్ ఉన్నా, పరిమితికి మించిన వేగం ఉన్నా కెమెరాలు పసిగట్టి వెంటనే సిబ్బందికి సమాచారం చేరవేస్తాయి. మొత్తం 14 రకాల ట్రాఫిక్ ఉల్లంఘనలను ఏటీఎంఎస్ వ్యవస్థ పసిగడుతుంది.
Updated Date - Jun 29 , 2025 | 04:47 AM