‘ఉగ్రవాదులను వాళ్ల మతానికి చెందిన సోదరితో మట్టుబెట్టించారు’
ABN, Publish Date - May 15 , 2025 | 05:43 AM
ఆపరేషన్ సిందూర్ వివరాలను మీడియాకు వెల్లడించిన వారిలో ఒకరైన కల్నల్ సోఫియా ఖురేషీని ఉద్దేశించి మధ్యప్రదేశ్ మంత్రి కున్వర్ విజయ్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి.
కల్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ వ్యాఖ్య
హైకోర్టు తీవ్ర ఆగ్రహం
పది సార్లు క్షమాపణ చెప్పడానికైనా సిద్ధం : విజయ్ షా
న్యూఢిల్లీ, మే 14 : ఆపరేషన్ సిందూర్ వివరాలను మీడియాకు వెల్లడించిన వారిలో ఒకరైన కల్నల్ సోఫియా ఖురేషీని ఉద్దేశించి మధ్యప్రదేశ్ మంత్రి కున్వర్ విజయ్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. ఉగ్రవాదులను వాళ్ల తోబుట్టువుతోనే మోదీ మట్టుబెట్టించారంటూ విజయ్ షా అనడం వివాదానికి కారణమైంది. కాంగ్రె్‌సతోపాటు జాతీయ మహిళా కమిషన్, మధ్యప్రదేశ్ హైకోర్టు కూడా ఈ అంశంపై స్పందించాయి. విజయ్‌షా వ్యాఖ్యలను క్యాన్సర్‌తో పోల్చిన హైకోర్టు.. ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని బుధవారం ఆదేశించింది. అసలేం జరిగిందంటే.. మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్ షా.. ఇండోర్‌లో మంగళవారం జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో ఆపరేషన్ సిందూర్ విషయంలో ప్రధాని మోదీపై పొగడ్తల జల్లు కురిపించారు.
ఈ క్రమంలో ‘‘ పహల్గాంలో ఉగ్రవాదులు మన సోదరీమణుల నుదుట సిందూరాన్ని తుడిపి వారిని వితంతువులను చేస్తే.. ప్రధాని మోదీ వాళ్ల(ఉగ్రవాదుల) మతానికే చెందిన సోదరిని విమానంలో పంపి ఉగ్రవాదులను మట్టుబెట్టించారు’’ అని అన్నారు. నిజానికి, ఆపరేషన్ సిందూర్‌లో కల్నల్ సోఫియా ఖురేషీ ప్రత్యక్షంగా పాల్గొనలేదు. విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రితో కలిసి ఆపరేషన్ వివరాలను మీడియాకు వివరించారు. ఖురేషీ ముస్లిం కావడంతో.. విజయ్‌షా ఆమెనే ఉగ్రవాదుల సోదరి అన్నారని, మత విద్వేషాలను రెచ్చగొట్టారని దుమారం రేగింది. విషయం తీవ్ర వివాదాస్పదంగా మారడంతో స్పందించిన విజయ్ షా తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు. సోఫియా ఖురేషీని కలలో కూడా అవమానించనని, తన సొంత సోదరి కంటే ఎక్కువుగా ఆమెను గౌరవిస్తున్నానని పేర్కొన్నారు. సోఫియా ఖురేషీ దేశానికి చేసిన సేవలకు ఆమె సెల్యూట్ చేస్తున్నానని, తన మాటలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే పది సార్లు క్షమాపణ చెప్పడానికైనా తాను సిద్ధమని వివరణ ఇచ్చారు.
Updated Date - May 15 , 2025 | 05:43 AM