Congress Internal Conflict: శశిథరూర్‌పై కాంగ్రెస్ మల్లగుల్లాలు
ABN, Publish Date - May 20 , 2025 | 05:10 AM
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత విదేశాంగ వర్గాలకు కేంద్రం ఎంపిక చేసిన ప్రతినిధుల జాబితాలో కాంగ్రెస్ నేత శశిథరూర్ పేరు లేకపోయినా ఆయనను బృందం నాయకుడిగా నియమించడం కాంగ్రెస్ లో అంతర్గత అవినీతి సృష్టించింది. మరోవైపు, తృణమూల్ పార్టీ ఎంపీ యూసుఫ్ పఠాన్ ఎంపికపై మమతా బెనర్జీ వివాదానికి తెరలేపడంతో పార్టీల మధ్య ఉద్రిక్తతలు గమనించబడ్డాయి.
విదేశాలకు వెళ్లే ఎంపీల బృందంలో ఆయనకు స్థానం కల్పించిన కేంద్రం
పార్టీ అనుమతి కోరకుండానే అంగీకరించిన శశిథరూర్
చర్యలు తీసుకుంటే కేరళ ఎన్నికల్లో నష్టమన్న భావనలో పార్టీ నాయకత్వం
న్యూఢిల్లీ, మే 19(ఆంధ్రజ్యోతి): రోజురోజుకీ బీజేపీ దిశగా అడుగులు వేస్తూ.. పార్టీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న సీనియర్ నేత శశిథరూర్‌తో ఎలా వ్యవహరించాలన్నదానిపై కాంగ్రెస్ మల్లగుల్లాలు పడుతోంది. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత విదేశాంగ విధానాన్ని అంతర్జాతీయ సమాజానికి వివరించటానికి కేంద్రం ఎంపిక చేసిన ఎంపీలలో శశిథరూర్ పేరు కూడా ఉండటం ఈ సమస్యను మరింత సంక్లిష్టం చేసింది. కేంద్రానికి కాంగ్రెస్ అందజేసిన పార్టీ ఎంపీల జాబితాలో.. శశిథరూర్ పేరు లేనప్పటికీ, కేంద్రం ఆయనను ఎంపిక చేయటమేగాక ఓ బృందానికి సారథిగా కూడా నియమించింది. దీనిపై శశిథరూర్ సోషల్‌మీడియా వేదికగా స్పందిస్తూ.. ఇది తనకు లభించిన గౌరవమని ప్రకటించారు. కేంద్రం తనను ఎంపిక చేస్తే.. దానికి అంగీకరించాలా? వద్దా? అన్నది కూడా పార్టీని అడగకుండా... బహిరంగంగా ఇటువంటి ప్రకటన చేయటం ఏమిటని పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు భావిస్తున్నారు. ఇది పార్టీ నాయకత్వాన్ని బహిరంగంగా ధిక్కరించటమేనని పేర్కొంటున్నారు. అయితే ఇప్పటికే జ్యోతిరాదిత్య సింధియా, జితిన్ ప్రసాద వంటి యువ నేతలు పార్టీని వీడిన నేపథ్యంలో.. శశిథరూర్ విషయంలో అధిష్ఠానం జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. వచ్చే ఏడాది కేరళలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున.. శశిథరూర్ అదే రాష్ట్రానికి చెందినవారు కాబట్టి, ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని పేర్కొంటున్నారు. త్వరలోనే ఈ అంశంపై కాంగ్రెస్ వ్యూహాన్ని సిద్ధం చేయనుందని సంబంధితవర్గాలు తెలిపాయి.
వివాదం చేయదల్చుకోలేదు: మమత
ఇండొనేషియా, మలేషియా తదితర దేశాలకు వెళ్లే ఎంపీల బృందంలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ పేరు చేర్చటంపైనా వివాదం రేగుతోంది. తృణమూల్ పార్లమెంటరీ పార్టీ చెయిర్‌పర్సన్ అయిన తనకు సమాచారం ఇవ్వకుండానే తమ పార్టీ ఎంపీని ఎంపిక చేయటం ఏమిటని మమతా బెనర్జీ ప్రశ్నించారు. అయినప్పటికీ తాను వివాదం చేయదల్చుకోలేదని, తమ ప్రతినిధిని పంపిస్తామని చెప్పారు. కాగా, విదేశాలకు వేళ్లే ఎంపీల బృందం నుంచి తప్పుకొంటున్నట్లుగా యూసుఫ్ పఠాన్ ప్రకటించారు.
భారత ప్రతినిధి వర్గాలు సాధించేదేంటి
పాకిస్థాన్ ఉగ్రవాదానికి మద్దతివ్వడం గురించి ప్రపంచానికి వివరించేందుకు భారత ప్రతినిధి వర్గాలను పంపడాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన తర్వాతే భారత ప్రతినిధి వర్గాల గురించి నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేదని జైరాం రమేశ్ అన్నారు. 7 ప్రతినిఽధి వర్గాలను పంపించడం వల్ల జరిగేదేముందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రతిపాదించిన నాలుగు పేర్లలో కేవలం ఒకరి పేరునే అంగీకరించి, సొంతంగా పేర్లను ఎంపిక చేశారని ఆయన అన్నారు. ఇదేమి రాజకీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
థరూర్‌కు బిలావల్ సమవుజ్జీ కాదు
భారత్‌ను కాపీ కొడుతూ.. పాకిస్థాన్ కూడా తమ దేశానికి చెందిన ఎంపీల బృందాలను విదేశాలకు పంపించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అమెరికా, బ్రిటన్ తదితర దేశాలకు వెళ్లే బృందానికి బిలావల్ భుట్టోను నాయకుడిగా ఎంపిక చేసింది. అమెరికా వెళ్లే భారత ఎంపీల బృందానికి శశిథరూర్ నాయకత్వం వహిస్తున్నారు. దీంతో వీరిద్దరి సామర్థ్యంపై పాక్‌లో చర్చ జరుగుతోంది. అంతర్జాతీయ అంశాల పట్ల అవగాహనలోగానీ, వ్యక్తీకరణలోగానీ థరూర్‌కు బిలావల్ సమ ఉజ్జీ కాదని పలువురు పాక్ నేతలే పెదవి విరుస్తున్నట్లు సమాచారం.
ఇవీ చదవండి:
Operation Sindoor: మౌనం విపత్కరం.. జైశంకర్‌పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు, బీజేపీ కౌంటర్
భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..
ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 20 , 2025 | 05:10 AM