Caste Census: కులగణనపై కింకర్తవ్యం
ABN, Publish Date - May 02 , 2025 | 04:41 AM
మోదీ ప్రభుత్వం తీసుకున్న కులగణన నిర్ణయం పై కాంగ్రెస్ అణచిపోయింది, ఇకపై తదుపరి కార్యాచరణపై శుక్రవారం వర్కింగ్ కమిటీ సమావేశం కానుంది. పహల్గాం ఉగ్రదాడిలో చనిపోయిన వారికి అమరవీరుల హోదా ఇవ్వాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
కేంద్రం నిర్ణయంతో కాంగ్రెస్ డైలమా.. నేడు వర్కింగ్ కమిటీ భేటీ
హెడ్‌లైన్ సరే.. టైమ్‌లైన్ ఏదీ?
పక్కదోవ పట్టించే ఎత్తుగడ: జైరాం
515 కోట్లతో కుల గణన సాధ్యమా?
రిజర్వేషన్లు 68ు ఉండాలి: ఖర్గే
న్యూఢిల్లీ/బెంగళూరు, మే 1 (ఆంధ్రజ్యోతి): ఇన్నాళ్లూ కులగణన డిమాండ్‌తో మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడిన కాంగ్రెస్.. ఇప్పుడు అయోమయంలో పడింది. జనాభా లెక్కల సేకరణతోపాటే కులగణన కూడా జరపాలని మోదీ క్యాబినెట్ ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయం ఆ పార్టీని విస్మయానికి గురిచేసింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ కులగణననే ప్రధాన ప్రచారాస్త్రంగా మార్చుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గ నిర్ణయంతో అది బీజేపీ చేతికి వెళ్లిందన్న ఆందోళన ఆ పార్టీ నేతల్లో నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఈ అంశంపై తదుపరి కార్యాచరణను ఖరారు చేసేందుకు ఆ పార్టీ అత్యున్నత నిర్ణాయక విభాగమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శుక్రవారం ఢిల్లీలో భేటీకానుంది. దీనిపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ గురువారం మీడియాతో మాట్లాడారు. వర్కింగ్ కమిటీ కులగణన, పహల్గాం ఉగ్రదాడిపై విస్తృతంగా చర్చిస్తుందన్నారు. కులగణనను ఆమోదిస్తూ ప్రభుత్వం ‘హెడ్‌లైన్’ ఇచ్చిందని.. కానీ దాని అమలుకు డెడ్‌లైన్ ఎక్కడని ప్రశ్నించారు. పహల్గాం దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌పై గట్టి చర్య తీసుకోవాలన్న డిమాండ్ల నేపథ్యంలో కులగణనపై నిర్ణయం పక్కదోవ పట్టించే ఎత్తుగడగా అభివర్ణించారు. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని రద్దుచేస్తూ నిర్ణయం తీసుకోకుండా ఎవరు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు. ఇందుకోసం పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆ నిధులు ఏ మూలకు: ఖర్గే
దేశవ్యాప్తంగా కులగణన సర్వే జరిపేందుకు రూ.575 కోట్లు సరిపోతాయా అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్రాన్ని ప్రశ్నించారు. గురువారం బెంగళూరు, హుబ్బళిలో జరిగిన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. ‘కర్ణాటకలో కులగణనకు పదేళ్ల కిందట రూ.168 కోట్లు ఖర్చ చేశారు. అలాంటిది దేశవ్యాప్తంగా దీనికి రూ.575 కోట్లే కేటాయించడం ఏమిటి? ఇది ఉత్తరప్రదేశ్‌లో సర్వేకు కూడా సరిపోదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల ప్రగతి పట్ల ప్రధానికి నిజంగా ఆసక్తి ఉంటే రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయాలి. కోటా ఇప్పటికే 50 శాతానికి మించిపోయింది. ముందుగా ఆ 50ు పరిమితిని తొలగించాలి. 67-68 శాతానికి పెంచాలి. తమిళనాడులో కూడా 68ు రిజర్వేషన్ అమలవుతోంది’ అని గుర్తుచేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు లభించేలా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా చర్యలు తీసుకుందని.. దానిని కేంద్రం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అమరవీరులుగా గుర్తించాలి: రాహుల్
పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో చనిపోయినవారికి అమరవీరుల హోదా ఇవ్వాలని రాహుల్‌గాంధీ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. వారి కుటుంబ సభ్యులకు వెన్నంటి ఉంటానని.. తమవారిని అమరవీరులుగా గుర్తించాలన్న వారి డిమాండ్‌కు మద్దతిస్తున్నానని, వారి మనోభావాలను గౌరవించాలని కోరుతున్నానని గురువారం ‘ఎక్స్’లో తెలిపారు.
ఇవి కూడా చదవండి
ACB Custody: విడుదల గోపిపై ఏసీబీ ప్రశ్నల వర్షం
PM Modi AP Visit: ప్రధాని మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారు
Read Latest AP News And Telugu News
Updated Date - May 02 , 2025 | 04:41 AM