ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Caste Census: కులగణన ఉద్దేశం కేంద్రానికి లేదు

ABN, Publish Date - Jun 18 , 2025 | 06:02 AM

కులగణనపై కాంగ్రెస్‌, బీజేపీ నడుమ మళ్లీ విమర్శల యుద్ధం మొదలైంది. జనాభా లెక్కల సేకరణకు కేంద్ర హోం శాఖ సోమవారం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో కులగణన ప్రస్తావనే లేదని, అసలది జరిపే ఉద్దేశమే మోదీ ప్రభుత్వానికి లేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సచిన్‌ పైలట్‌ ఆరోపించారు.

  • కాలహరణం, మీడియాలో ప్రచారం.. ప్రభుత్వ లక్ష్యం

  • మహిళా రిజర్వేషన్‌ మాదిరే కులగణనపైనా చిత్తశుద్ధి లేదు

  • ఉంటే.. తెలంగాణ విధానాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాలి

  • జనగణనకు 10 వేల కోట్లు కావాలి.. 576 కోట్లే కేటాయించారు

  • కాంగ్రెస్‌ నేత సచిన్‌ పైలట్‌ విమర్శలు.. దుష్ప్రచారమన్న బీజేపీ

న్యూఢిల్లీ, జూన్‌ 17: కులగణనపై కాంగ్రెస్‌, బీజేపీ నడుమ మళ్లీ విమర్శల యుద్ధం మొదలైంది. జనాభా లెక్కల సేకరణకు కేంద్ర హోం శాఖ సోమవారం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో కులగణన ప్రస్తావనే లేదని, అసలది జరిపే ఉద్దేశమే మోదీ ప్రభుత్వానికి లేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సచిన్‌ పైలట్‌ ఆరోపించారు. రాజకీయ లబ్ధి పొందాలన్న లక్ష్యం నెరవేరకపోవడంతో ఆ పార్టీ దుష్ప్రచారాలకు దిగుతోందని బీజేపీ మండిపడింది. పైలట్‌ మంగళవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. కులగణనకు కేంద్రం కావాలనే జాప్యం చేస్తోందన్నారు. ‘ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్‌ పార్టీ కులగణనకు డిమాండ్‌ చేస్తోంది. మోదీ ప్రభుత్వం రాహుల్‌ ఒత్తిడికి తలొగ్గి జనగణనతోపాటే కులగణన చేపడతామని ప్రకటించింది. కానీ క్షేత్ర స్థాయిలో వాస్తవాలు వేరుగా ఉన్నాయి. జనాభా లెక్కల సేకరణకు రూ.10 వేల కోట్లు అవసరం.

కానీ కేంద్రం రూ.574 కోట్లు మాత్రమే కేటాయించింది. ఎలాగైనా కాలహరణం చేయడం, పతాక శీర్షికలకు ఎక్కడం.. ఆయా అంశాలను తన చేతుల్లోకి తీసుకోవడమే దాని ఉద్దేశంగా కనబడుతోంది’ అని విమర్శించారు. తెలంగాణలోని తమ పార్టీ ప్రభుత్వం కులగణనను మంచి పద్ధతిలో నిర్వహించిందని తెలిపారు. ఇందులో ప్రభుత్వ సిబ్బందిని నియోగించలేదని.. స్వచ్ఛంద సంస్థలు, సాంకేతిక నైపుణ్యం ఉన్నవారి సాయంతో లెక్కలు సేకరించిందని చెప్పారు. ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులను తెలుసుకునే దిశగా కులగణన మొదటి అడుగన్నారు. కానీ ఇది చేపట్టే ఉద్దేశం కేంద్రానికి ఉన్నట్లు కనబడడం లేదని చెప్పారు. ఈ అంశాన్ని రాజకీయం చేయడం మాని సమర్థంగా పనిచేయాలని.. జాతీయ స్థాయిలో కులగణనకు తెలంగాణ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. అయితే, కేంద్రం జారీచేసిన నోటిఫికేషన్‌లో కులగణన ప్రస్తావన లేదని, మోదీ ప్రభుత్వం యూటర్న్‌ తీసుకుందన్న ఆరోపణలను కేంద్ర హోం శాఖ సోమవారమే తోసిపుచ్చింది. ఇవి తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలుగా పేర్కొంది. ఏప్రిల్‌ 30, జూన్‌ 4, 15 తేదీల్లో విడుదల చేసిన పత్రికా ప్రకటనల్లో కులగణన ప్రస్తావన ఉందని స్పష్టంచేసింది.

Updated Date - Jun 18 , 2025 | 06:02 AM