Kharana Hills: కిరానా హిల్స్‌లో ఏం జరిగింది?
ABN, Publish Date - May 15 , 2025 | 05:15 AM
పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ పరిధిలో.. సర్గోధా జిల్లాలో కిరానా హిల్స్ ఉన్నాయి. వీటి వైశాల్యం 68 చదరపు కిలోమీటర్లు కాగా.. 39 కిలోమీటర్ల వ్యాసార్థంలో పాకిస్థాన్ రక్షణ శాఖ తన స్థావరాలను ఏర్పాటు చేసుకుంది.
అణుధార్మికత లీక్ అయ్యిందా?.. అక్కడ పాక్ టాక్టికల్ న్యూక్లియర్ వార్‌హెడ్ల నిల్వ!
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో అక్కడికి హడావుడిగా అమెరికా బీ-350 విమానం
అందులో రేడియేషన్‌ను అంచనా వేసే టెక్నాలజీ
ఈజిప్ట్ నుంచి బోరాన్‌తో మరో విమానం!
కిరానా హిల్స్‌లో రేడియేషన్ లీక్ వార్తలకు బలం
(సెంట్రల్ డెస్క్): పాకిస్థాన్‌లోని కిరానా హిల్స్‌లో ఏం జరిగింది? అక్కడి టాక్టికల్ న్యూక్లియర్ వార్ హెడ్స్ నిల్వలకు నష్టం వాటిల్లిందా? ఫలితంగా.. కిరానా హిల్స్ నుంచి అణుధార్మికత వెలువడుతోందా? అమెరికాకు చెందిన ప్రత్యేక ‘న్యూక్లియర్ ఎమర్జెన్సీ’ విమానం పాకిస్థాన్‌లో ల్యాండ్ అయినట్లు ఫ్లైట్ ట్రాకింగ్ డేటా వెల్లడి చేయడం.. అణుధార్మికతను కొంత వరకు నియంత్రించగలిగే బోరాన్ నిల్వలతో ఈజి్‌ప్టకు చెందిన విమానం ఇస్లామాబాద్‌కు చేరిందనే వార్తలు వెల్లువెత్తడంతో ఇప్పుడు ఈ అంశంపై మరింత ఉత్కంఠ నెలకొంది. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ పరిధిలో.. సర్గోధా జిల్లాలో కిరానా హిల్స్ ఉన్నాయి. వీటి వైశాల్యం 68 చదరపు కిలోమీటర్లు కాగా.. 39 కిలోమీటర్ల వ్యాసార్థంలో పాకిస్థాన్ రక్షణ శాఖ తన స్థావరాలను ఏర్పాటు చేసుకుంది. ఈ కొండల్లో 10కి మించి సొరంగాలను నిర్మించిన పాక్.. వాటిలో టాక్టికల్(చిన్నపాటి అణు దాడులు) న్యూక్లియర్ వార్‌హెడ్ నిల్వలను భద్రపరిచినట్లు వార్తలు వెలువడుతున్నాయి. స్ట్రాటజిక్(భారీ విధ్వంసం సృష్టించే అణు దాడులు) న్యూక్లియర్ వార్‌హెడ్‌లు నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్ సమీపంలో ఉన్నట్లు అంతర్జాతీయ వార్తాసంస్థలు చెబుతున్నాయి. 1980-89 మధ్యకాలంలో కిరానా హిల్స్‌పై పాకిస్థాన్ టాక్టికల్ న్యూక్లియర్ పరీక్షలు నిర్వహించినట్లు 2023లో ‘ద బులెటిన్ ఆఫ్ ది అటామిక్ సైంటిస్ట్స్’ నివేదిక వెల్లడించింది. ఇదే నివేదికలో వార్‌హెడ్‌ల నిల్వల ప్రస్తావన ఉండడం గమనార్హం..! ఇక్కడ ఆయుధాల గ్రేడ్ ప్లూటోనియం ఉత్పత్తికి ఉపయోగించే 4భారజల రియాక్టర్లు ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
ఇప్పుడు ఎందుకు ఉత్కంఠ?
ఇటీవల ‘ఆపరేషన్ సిందూర్’పై వాయుసేన అధికారి ఏకే భారతి ప్రెస్ బ్రీఫింగ్‌లో భాగంగా.. ఓ విలేకరి ‘‘కిరానా హిల్స్‌ను టార్గెట్‌గా చేసుకున్నారా? అక్కడ రేడియేషన్ వెలువడుతోందంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి’’ అని ప్రస్తావించారు. దానికి ఏకే భారతి సమాధానమిస్తూ.. ‘‘మా టార్గెట్లలో కిరానా హిల్స్ లేవు. అక్కడ పాకిస్థానీ అణ్వాయుధాలున్నట్లు సమాచారం చెప్పినందుకు ధన్యవాదాలు’’ అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత రేడియేషన్ లీకేజీపై అంతటా చర్చ మొదలైంది. ఎకనామిక్ టైమ్స్‌తోపాటు.. పలు అంతర్జాతీయ వార్తా సంస్థలు కూడా ఇదే కోణంలో వార్తలను ప్రచురించాయి. దీనికి బలాన్ని చేకూరుస్తూ.. ఫ్లైట్‌రాడార్-24 వంటి ఫ్లైట్ ట్రాకర్ వెబ్‌సైట్లలో అమెరికాకు చెందిన బీ-350(ఏఎంఎస్) విమానం పాకిస్థాన్‌కు వచ్చినట్లు పేర్కొన్నాయి. ఈ విమానాన్ని ‘న్యూక్లియర్ ఎమర్జెన్సీ’ అని పిలుస్తారు. ఒక ప్రాంతంలో వెలువడే అణుధార్మికత తీవ్రతను గుర్తించే సాంకేతిక పరికరాలు ఈ విమానంలో ఉంటాయి. పుకుషిమా ఉదంతంలోనూ ఈ విమానం జపాన్‌కు వెళ్లినట్లు ఎకనామిక్ టైమ్స్ గుర్తుచేసింది. అదేవిధంగా ఈజిప్ట్ నుంచి బోరాన్ నిల్వలతో మరో విమానం పాకిస్థాన్‌కు చేరుకున్నట్లు వార్తలు వచ్చాయి. అణుధార్మికతకు సంబంధించిన న్యూట్రాన్లు బోరాన్-10 ఐసోటో్‌పలలో విలీనం అవుతాయి. ఫలితంగా రేడియేషన్ ప్రభావం తగ్గుతుంది. అందుకే ఈజిప్టు బోరాన్‌ను పంపించి ఉంటుందని ఆయా కథనాలు చెబుతున్నాయి.
నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్ వద్ద కూడా..
నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్ సమీపంలో బంకర్లలోని వార్‌హెడ్లకు నష్టం జరిగి.. రేడియో ధార్మికత లీకై ఉండొచ్చని అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ సీఐఏ మాజీ అధికారి, రాండ్ కార్పొరేషన్ విశ్లేషకుడు డెరెక్ గ్రాస్‌మన్‌ను ఉటంకిస్తూ ఎకనామిక్ టైమ్స్ తన కథనంలో తెలిపింది. ఈ దాడులు పాకిస్థాన్ న్యూక్లియర్ కమాండ్ అథారిటీ పాలిట శరాఘాతమని ఆయన వ్యాఖ్యానించినట్లు ఎకనామిక్ టైమ్స్ కథనం స్పష్టం చేస్తోంది.
ఇంటెలిజెన్స్ హెచ్చరిక ఇదేనా?
పాక్‌పై దాడులను భారత్ తీవ్రతరం చేయడంతో.. ఈ నెల 10వ తేదీన తెల్లవారుజామున ప్రధాని మోదీకి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఫోన్ చేసిన విషయం తెలిసిందే..! దీనికి కారణాలను విశ్లేషిస్తూ సీఎన్‌ఎన్ ఓ కథనాన్ని ప్రసారం చేసింది. అత్యంత కీలకమైన హెచ్చరికలను ఇంటెలిజెన్స్ వర్గాలు వైట్‌హౌ్‌సకు అందజేసినట్లు పేర్కొంది. ఆ వెంటనే అధ్యక్షుడు ట్రంప్, వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో భేటీ అయ్యి.. భారత్-పాక్ ఉద్రిక్తతలను తక్షణం నిలువరించాల్సిన అవసరం ఉందని భావించినట్లు వెల్లడించింది. ఆ మేరకు వైట్‌హౌస్ తీసుకున్న నిర్ణయంతో వాన్స్ వెంటనే(శనివారం ఉదయం) ప్రధాని మోదీకి ఫోన్ చేసినట్లు స్పష్టం చేసింది. ఆ ఇంటెలిజెన్స్ హెచ్చరికలు అణుధార్మికత లీకేజీకి సంబంధించినవే అయి ఉంటాయని తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. ఇదిలా ఉండగా, భారత్ దాడులతో దారుణంగా దెబ్బతిన్న పాకిస్థాన్.. ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం ఢిల్లీని లక్ష్యంగా చేసుకుని, ఫతాహ్ క్షిపణిని ప్రయోగించింది. దీన్ని భారత్ సరిహద్దుల్లోనే కూల్చివేసింది. అయితే.. విశ్రాంత మేజర్ జనరల్ జీడీ భక్షి ఓ న్యూస్‌చానల్‌లో మాట్లాడుతూ.. టాక్టికల్ న్యూక్లియర్ వార్‌హెడ్‌తో ఫతాహ్ క్షిపణి వచ్చి ఉంటుందని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు.
కర్త, కర్మ, క్రియ.. ఏపీ సింగ్
పాకిస్థాన్ మిలిటరీకి అత్యంత కీలకమైన నూర్‌ఖాన్ ఎయిర్‌బే్‌సపై వైమానిక దాడులు చేయాలన్న మాస్టర్ ప్లాన్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ అమర్‌ప్రీత్ సింగ్‌దే అని రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ ఎయిర్ బేస్‌పై దాడికి ప్రణాళిక రచించిందీ, అమలు చేసిందీ.. చివరకు పైలట్లను ఎంపిక చేసిందీ ఆయనే అని తెలిపాయి. ఏపీ సింగ్‌కు జాతీయ భద్రత సలహాదారు అజిత్ డోభాల్ మద్దతుగా నిలిచారని, ఆపరేషన్‌కు అనుమతి ఇచ్చారని పేర్కొన్నాయి. నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్ రావల్పిండిలో ఉంది. దీనికి సమీపంలోనే చక్లాలాలో పాక్ ఆర్మీ చీఫ్ ప్రధాన కార్యాలయం, న్యూక్లియర్ కమాండ్ కార్యాలయం ఉన్నాయి. ఈ నేపథ్యంలో, నూర్‌ఖాన్ బేస్‌పై దాడి చేయడం ద్వారా తాము ఎక్కడైనా దాడి చేయగలదన్న గట్టి సందేశాన్ని పాకిస్థాన్‌కు పంపించాలని ఏపీ సింగ్ భావించారని రక్షణ వర్గాలు వివరించాయి. ఆయన అనుకున్నట్లుగానే, నూర్‌ఖాన్ ఎయిర్‌బే్‌సపై దాడితో పాక్ ఆత్మస్థైర్యం దెబ్బతిన్నదని, ఆ దేశ ఆర్మీ చీఫ్ మూడు గంటల పాటు బంకర్లో దాక్కోవాల్సి వచ్చిందని తెలుస్తోంది. ఈ దాడుల కోసం భారత్ బ్రహ్మోస్ క్షిపణులను ఉపయోగించి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Updated Date - May 15 , 2025 | 05:57 AM