Alimony Case: కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN, Publish Date - Jul 22 , 2025 | 06:27 PM
తన నుంచి భర్త విడాకులు కోరుతున్న నేపథ్యంలో తనకు భరణం ఇప్పించాలంటూ ఒక మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను సీజేఐ బీఆర్ గవాయి పరిశీలించి కీలక వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ, జులై 22: సుప్రీంకోర్టులో మంగళవారం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. విడాకుల నేపథ్యంలో భర్త నుంచి భరణాన్ని మహిళ కోరడంతో.. భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భర్త నుంచి విడాకులు తీసుకునే క్రమంలో తనకు ముంబైలో ఇల్లు, రూ. 12 కోట్ల నగదుతోపాటు బీఎండబ్ల్యూ కారు భరణంగా ఇప్పించాలంటూ తన పిటిషన్‌లో ఆమె స్పష్టం చేసింది. మంగళవారం ఈ పిటిషన్ సీజేఐ బీఆర్ గవాయి ముందుకు వచ్చింది. దీనిని ఆయన పరిశీలించి.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమెతో సీజేఐ బీఆర్ గవాయి మాట్లాడుతూ.. మీరు బాగా చదువుకున్నారు. ఎంబీఏ కూడా చేశారు. ఐటీ ఉద్యోగం సైతం చేస్తున్నారని.. మీరు బెంగళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో మీకు మంచి డిమాండ్ ఉందన్నారు. మీరు అక్కడ ఎందుకు ఉద్యోగం చేయకూడదంటూ ఆమెను సూటిగా ప్రశ్నించారు. మీరు కోరుతున్న ఇల్లు కల్పతరువులో ఉందన్నారు. అది కూడా బిల్డర్ చేతిలో ఉందని గుర్తు చేశారు.
అదీకాక మీ వివాహమై కేవలం 18 నెలలు మాత్రమే అయిందన్నారు. ఆ క్రమంలో మీరు నెలకు కోటి రూపాయిల నగదు అడుగుతున్నట్లుగా ఉందని పేర్కొన్నారు. సీజేఐ వ్యాఖ్యలపై ఆ మహిళ స్పందిస్తూ.. విడాకులు కోరుతున్న తన భర్త బాగా ధనవంతుడని చెప్పింది. తనకు స్కిజోఫ్రెనియా ఉందని.. అందుకే విడాకులు ఇస్తున్నట్లు అతడు స్పష్టం చేశారన్నారు. అయితే తనకు స్కిజోఫ్రెనియా ఉన్నట్లు కనిపిస్తుందా? అంటూ సీజేఐను ఈ సందర్భంగా ఆమె ప్రశ్నించింది. ఇంతలో భర్త తరఫు న్యాయవాది మాధవి దివాన్ జోక్యం చేసుకున్నారు. ఆమె ఉద్యోగం చేస్తుందన్నారు. ఇలా ప్రతి దానిని డిమాండ్ చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. ఆ క్రమంలో సీజేఐ బీఆర్ గవాయి స్పందిస్తూ.. విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసిన నీ భర్త ఆస్తి.. అతడి తండ్రిదని స్పష్టం చేశారు. ఇక ఆ యువతి అందుకు సమాధానమిస్తూ.. తన భర్త బ్యాంక్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తూనే మరోవైపు రెండు వ్యాపారాలు చేస్తున్నారని చెప్పారు.
తనకు కుమారుడు ఉన్నాడని.. అతడిని తనకు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. కానీ తనకు స్క్రీజోఫ్రెనియా ఉందన్నాడని తెలిపారు. అందుకే తన నుంచి విడాకులకు అతడు దరఖాస్తు చేశాడని వివరించారు. ఆ క్రమంలో తన కుమారుడిని తనకు ఇవ్వలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తాను ఉద్యోగం సైతం చేశానని తెలిపారు. అయితే ఆ ఉద్యోగానికి తన భర్త బలవంతంగా రాజీనామా చేయించారని సీజేఐకి ఈ సందర్భంగా వివరించింది. మరోవైపు ఆమె భర్త పన్ను రిటర్న్‌లను కోర్టు పరిశీలించి.. అతడి ఆదాయం తక్కువగా ఉందని గుర్తించింది. ఆ క్రమంలో ఫ్లాట్ తీసుకుని మంచి ఉద్యోగాన్ని వెతుక్కొండంటూ ఆమెకు సూచించారు. అలా కాకుంటే.. రూ. 4 కోట్లు భరణం తీసుకుని.. పుణె, హైదరాబాద్, బెంగళూరులో మంచి ఐటీ ఉద్యోగాన్ని సంపాదించాలన్నారు. మీరు బాగా చదువుకుని కూడా.. బతుకు తెరువు కోసం ఇలా అడగడం భావ్యం కాదని భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయి అభిప్రాయపడ్డారు. అనంతరం ఈ కేసులో తీర్పును ఆయన రిజర్వు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు
ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 22 , 2025 | 07:43 PM