ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

2027 మార్చి 1 నుంచి జనగణన

ABN, Publish Date - Jun 05 , 2025 | 04:14 AM

దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణకు కేంద్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. 2027 మార్చి 1వ తేదీ నుంచి దేశంలో 16వ జనగణనను చేపట్టనున్నట్లు తెలిపింది.

  • దేశవ్యాప్తంగా కులగణన కూడా.. షెడ్యూల్‌ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

  • రెండు దశల్లో జరగనున్న జనాభా లెక్కల సేకరణ.. ఈ నెల 16న గెజిట్‌ నోటిఫికేషన్‌

  • రూ.13 వేల కోట్లకు పైగా వ్యయం.. 30 లక్షలకు పైగా ఎన్యూమరేటర్లు!

  • జనగణన అనంతరం లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన?

న్యూఢిల్లీ, జూన్‌ 4: దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణకు కేంద్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. 2027 మార్చి 1వ తేదీ నుంచి దేశంలో 16వ జనగణనను చేపట్టనున్నట్లు తెలిపింది. జనగణనతో పాటే కులగణన కూడా చేపడతామని తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ బుధవారం షెడ్యూల్‌ను ప్రకటించింది. రెండు దశల్లో జనాభా లెక్కలు సేకరించనున్నట్లు వివరించింది. అయితే హిమపాతం ఎక్కువగా ఉండే హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌తో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లో 2026 అక్టోబరు 1 నుంచి జనగణన ప్రారంభమవుతుందని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. మొత్తం మీద దేశంలో 16 ఏళ్ల తర్వాత జనగణన జరగనుంది. సామాజిక, ఆర్థిక వివరాలతో సమగ్రంగా జనగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలిసారిగా పౌరులే స్వయంగా ఆన్‌లైన్‌లో తమ వివరాలు నమోదు చేసుకొనే అవకాశం కల్పించనున్నారు. జనాభా లెక్కల సేకరణకు రూ.13 వేల కోట్లకు పైగా వెచ్చించనున్నారు. ఈ భారీ ప్రక్రియలో 30 లక్షల మందికి పైగా ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లు పాల్గొననున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. జనగణన షెడ్యూల్‌పై జనాభా లెక్కల చట్టం 1948లోని సెక్షన్‌ 3 ప్రకారం ఈ నెల 16న అధికారికంగా గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్లు కేంద్ర హోం శాఖ తెలిపింది.


దేశంలో చివరి సారిగా 2011లో రెండు దశల్లో జనాభా లెక్కలను సేకరించారు. నాటి లెక్కల ప్రకారం దేశ జనాభా 121 కోట్లు. నాటి యూపీఏ సర్కారు జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా చేసింది. కానీ, ఇప్పటికీ ఆ వివరాలను వెల్లడించలేదు. ఇటీవల బిహార్‌, తెలంగాణ రాష్ట్రాల్లో కులగణన సర్వే చేశారు. దేశవ్యాప్తంగా పదేళ్లకోసారి జనగణన చేపట్టాల్సి ఉండగా.. 2021లో కూడా అందుకోసం అన్ని ఏర్పాట్లూ చేశారు. కానీ, కరోనా కారణంగా జనగణన ప్రక్రియను వాయిదా వేశారు. కాగా, దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందాలంటే కులగణన కూడా చేయాలని పలు రాజకీయ పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన కూడా చేసేందుకు అంగీకరించింది. 2027లో జనగణన పూర్తయిన తర్వాత లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కూడా చేపట్టే అవకాశం ఉంది. జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాలను పునర్విభజించనున్నారు. అయితే దీనిపై దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తాము జనాభా నియంత్రణను పక్కాగా అమలు చేశామని, ఫలితంగా పునర్విభజనతో తాము నష్టపోతామని వాదిస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ చర్యలు చేపట్టలేదని.. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేస్తే ఆ రాష్ట్రాలు ఎక్కువగా లబ్ధి పొందుతాయని ఆరోపిస్తున్నాయి.

Updated Date - Jun 05 , 2025 | 04:14 AM